ఎర్రజెండా భుజానికి ఎత్తుకుని సీపీఐ నేత నారాయణ రెడ్ షర్ట్ వలంటీర్ గా కనిపిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఎవరూ చెప్పకున్నా గాంధీ జయంతి రోజు చికెన్ రుచి చూస్తారు. పల్లెలకు వెళితే ముంతలోని కల్లు రుచి చూస్తారు. స్వాములు, బాబాల వద్దకు వెళ్లడంలో కూడా ఆయనది ప్రత్యేక తీరే. వీటన్నింటిని పక్కన ఉంచితే,
చిత్తూరు జిల్లాకు చెందిన సీపీఐ నారాయణ తిరుపతి గంగమ్మను దర్శంచుకోవడమే కాదు. పూజలు చేసి, హారతి తీసుకుని, నుదట బొట్టు పెట్టించుకున్నారు. దీని ద్వారా నారాయణ మరో విలక్షణతను మంగళవారం ప్రదర్శించారు. ఈ చర్యల ద్వారా దేవుడు లేడు. దయ్యం లేదు. మూఢ నమ్మకాలను నమ్మవద్దు అనే మాటలను జనం విశ్వసిస్తారా? దీనిని సీపీఐ నాయకత్వం ఎలా పరిగణిస్తుంది? అనే ప్రశ్నలకు సీపీఐ నారాయణ మరోసారి తెరతీశారు. విషయంలోకి వస్తే..
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణస్వామి నాయుడు ( డాక్టర్ కే. నారాయణ) మొక్కుబడి చెల్లించారు. అమ్మవారి మూలవిరాట్టును ప్రత్యేకంగా దర్శించుకుని, హారతి తీసుకున్నారు. కోడిని కూడా ఆయన అమ్మవారికి సమర్పించారు.
గంగమ్మ ఆలయం వద్ద కోడి తీసుకుని వెళుతున్న సీపీఐ నారాయణ
గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ గాంధీ జయంతి రోజు చికెన్ రుచి చూసిన సీపీఐ నేత డాక్టర్ నారాయణ వివాదంలో చిక్కుకుని, వార్తల్లో ప్రముఖంగా నిలిచి, పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. మంగళవారం తిరుపతి జిల్లా కార్యదర్శి మురళీ, చిన్నం పెంచలయ్య తో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాక్ష్ణ గంగమ్మ గుడిలో అర్చన, పూజలు చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఆనాటి ఛాలెంజ్
"దేవుళ్లు, పూజలు, మూఢనమ్మకాలను కమ్యూనిస్టులు ఏమాత్రం విశ్వసించరు. కానీ ఎదుటి వారి విశ్వాసాలకు గౌరవం ఇస్తారు" అనేది కమ్యూనిస్టులకు ఉన్న గౌరవం.
చేతబడి, క్షుద్రపూజలను ఏమాత్రం ఏమాత్రం నమ్మరు. ఓ సందర్భంలో కమ్యూనిస్టు నారాయణ ఛాలెంజ్ విసరడం గుర్తు చేసుకోవాలి.
"కావాలంలే నా తల వెంట్రుక ఇస్తా. నాపై చేతబడి చేయండి. ఏమి జరుగుతుందో చూద్దాం" అని కూడా మాంత్రికులకు సీపీఐ నారాయణ సవాల్ విసిరారు. అంటే మూఢ విశ్వాసాలను పట్టించుకోవద్దనేది ఆయన ఆలోచన, సూచన కూడా కావచ్చనే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే..
సీపీఐ నేత ఏమి చేశారంటే..
సీపీఐ నేత నారాయణకు అమ్మవారి చరిత్ర వివరిస్తున్న అర్చకుడు
తిరుపతి గంగజాతరలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేయించారు. అర్చన కూడా చేయించారు. అర్చకుడు అందించిన హారతి కళ్లకు అద్దుకున్నారు రూ. 500 కానుకగా సమర్పించారు. ఆ తరువాత మొక్కుబడి చెల్లించారు. అక్కడే ఉన్న తిరుపతిలోని వివిధ పార్టీల నేతలు, ప్రముఖుల సూచనలతో అర్చకుడు సీపీఐ నారాయణకు నుదిటను అమ్మవారి పాదాల చెంత నుంచి తీసిన కుంకుమ బొట్టు పెట్టారు. అనంతరం ఆలయ అర్చకుడు అమ్మవారి చారిత్రక నేపథ్యాన్ని నారాయణకు వివరించారు. దీనివల్ల మరోసారి ఆయన పార్టీని ఇరుకున పెట్టారా? అంటే స్థానిక కమ్యూనిస్టు నేతల నుంచి ఔను అనే సమాధానం వస్తోంది.
చికెన్ నారాయణ
2007 అక్టోబర్ 2 గాంధీజయంతి రోజు ప్రకాశం జిల్లా చినగంజాం పర్యటనకు సీపీఐ నారాయణ వచ్చారు. పార్టీ నాయకులతో పాటు సీపీఐ నారాయణ ఇడ్లీలోకి చికెన్ గ్రేవీతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. మరుసటి రోజు మీడియాలో ఇదే వార్త ప్రధానాంశంగా మారింది. దీంతో సీపీఐ నారాయణ. చికెన్ నారాయణగా ఆయన పేరు మీడియాలో ప్రముఖంగా మారింది. నాలుక కరుచుకున్న సీపీఐ నారాయణ క్షమాపణలు చెప్పారు. తనకు తాను ప్రాయశ్చిత్త శిక్షగా "సంవత్సరం పాటు చికెన్ ముట్టను" అని శపథం చేశారు.
2008 గాంధీజయంతి తరువాత ఆయన తన దీక్ష విరమించారు. మరుసటి రోజు తన నివాసంలో చికెన్ తో వంటకాలు తయారు చేయించారు. పార్టీవారితో పాటు, మీడియాను కూడా ఆహ్వానించి, చికెన్ దీక్ష విరమించినట్లు చెప్పడం తెలిసిందే.
శ్రీవారి దర్శనం
సీపీఐ రాష్ట్ర హోదాలో ఉన్న డాక్టర్ కే. నారాయణ కుంటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
2019లో ఏప్రిల్ 3 భార్య వసుమతి, కుమార్తెతో కలిసి తిరుమలకు వెళ్లిన నారాయణ వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, రంగనాయకుల మండపంలో నారాయణ కుటుంబీకులకు ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ,
"కుటుంబ సభ్యుల కోరిక మేరకే స్వామివారిని దర్శించుకున్నాను" అని వివరణ ఇచ్చారు. గతంలో చాలాసార్లు తిరుమలకు వచ్చినా దర్శనానికి వెళ్లని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయనే వివాదం నేపథ్యంలో కూడా ఆయన తిరుమలను సందర్శించారు.
చిత్తూరు జిల్లా నగరి మండలం అయనంబాకం గ్రామానికి చెందిన కంకణాల నారాయణస్వామినాయుడు (ఇప్పుడు సీపీఐ నారాయణ) గ్రామంలోని హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ, మదనపల్లె బీటీ కాలేజీలో పీయూసీ వరకు చదివారు. ఆ తరువాత గుంటూరులో ఆయుర్వేద వైద్యశాస్త్రం చదివారు. సీపీఐ విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) లో కీలకంగా పనిచేస్తూ, 1986లో చిత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన సీపీఐ నారాయణ 2002లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన నారాయణ వరుసగా 2007లో తిరుపతి, తరువాత 2012లో మూడోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అంటే..
చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన తనకు ఇక్కడి ఆచార వ్యవహారాలు తెలిసినవే. చిన్ననాడు వెళ్లే వాళ్లం. ఇప్పుడూ అంతే అన్నట్లు గా ఆయన వ్యవహర శైలి ఉంది. గంగమ్మ దర్శనం, పూజలు, శాంతిపూజలు ఏ వివాదానికి మలుపు తీస్తాయో? పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.