
Nara Devansh | శ్రీవారి సన్నిధిలో సీఎం మనవడి పుట్టినరోజు సందడి
సీఎం చంద్రబాబు కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. అన్నదాన సత్రంలో యాత్రికులకు ప్రసాదాలు వడ్డించారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును సీఎం ఎన్. చంద్రబాబు కుటుంబం శుక్రవారం జరుపుకుంది. స్వామివారి దర్శనం తరువాత తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆయన కుటుంబం యాత్రికులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తద్వారా మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు మొక్కును చెల్లించారు. దీనికోసం టీటీడీకి రూ. 44 లక్షలు విరాళంగా అందించారు.
సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలసి గురువారం రాత్రి విజయవాడ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోనే పద్మావతి అతిథిగృహాల సముదాయంలో బస చేశారు.
క్యూ కాంప్లెక్స్ నుంచి...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం ఎన్. చంద్రబాబు ఆయన కుటుంబీకులు యథావిధిగానే వీఐపీల కోసం కేటాయించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (VQC -1) నుంచి దర్శనానికి శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయంలోకి వెళ్లారు.సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మహద్వారం నుంచి కాకుండా, క్యూకాంప్లెక్స్ నుంచి మాత్రమే వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు అనే మాటను మరోసారి నిరూపించారు.