
బేడిఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి (ఫైల్)
శ్రీవారి బ్రహ్మోత్సవానికి రానున్న సీఎం
రేపు తిరుమలలో పట్టువస్త్రాలు సమరించనున్న చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు.ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు బుధవారం (24వ తేదీ) సాయంత్రం తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇదే రోజు రాత్రి తిరుమలలో శ్రీవారి బ్రహ్మెత్సవాలు పెదశేషవాహనంతో ప్రారంభం కానున్నాయి. గత ఏడాది కూడా మొదటిసారి సీఎం నారా చంద్రబాబు వాహనసేవలో పాల్గొన్నారు. తిరుపతి తిరుమల లో నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
భద్రతా ఏర్పాట్లు
సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో తిరుపతిలో భద్రత ఏర్పాట్లతోపాటు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు అడ్వాన్స్ లైజన్ సెక్యూరిటీ ఏఎస్ఎల్ ( Advance Liaison Security ASL )ని తిరుపతి ఎస్పీ. ఎల్ సుబ్బారాయుడు పర్యవేక్షించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఎస్పి ఎల్. సుబ్బారాయుడుతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను కూడా పరిశీలించారు. తిరుమలలో కూడా టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరితో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
రెండోసారి..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండోసారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఆయన పర్యటన సాగే విధానం ఇలా ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం విజయవాడ విమానాశ్రయంలో నాలుగు గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తిరుపతి నగరం తనపల్లెకు సమీపంలోని హోటల్ తాజ్ వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ లో ల్యాండ్ అవుతారు. సాయంత్రం 5.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి తిరుమలలోని గాయత్రి నిలయానికి చేరుకుంటారు.
బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు..
తిరుమలలో రాత్రి 7 గంటల 40 నిమిషాలకు సంప్రదాయ దుస్తులు ధరించే సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడిఆంజనేయస్వామి ఆలయం వద్దకు వస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు, వేద పండితులు ఆశీర్వచనాల మధ్య సీఎం చంద్రబాబుకు తలపాగా చుడతారు. వెండిపళ్లెంలో ఉంచిన పట్టువస్త్రాలను నెత్తిన ఉంచుకుని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించిన తర్వాత దర్శనానంతరం సీఎం చంద్రబాబు వెలపలికి రానున్నారు.
తిరుమలలో బస
పెదశేష వాహనసేవలో సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి (ఫైల్)
తిరుమలలోనే సీఎం నారా చంద్రబాబు బుధవారం రాత్రికి బస చేయనున్నారు. గురువారం ఉదయం యాత్రికుల వసతి సముదాయం (pilgrims amenities complex Pac 5) ఆ భవనాన్ని సీఎం ఎన్ చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రద్దీ గుర్తించేందుకు, సైబర్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన తిరిగి తిరుపతిలోని హోటల్ తాజ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో ఉండవెల్లికి తిరిగి వెళతారు.
Next Story