కుప్పం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు
x

కుప్పం నుంచి 'సుపరిపాలనకు తొలి అడుగు'

సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు కొన్ని గంటల్లో రానున్నారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తయింది. ఈ కాలంలో సాధించిన ప్రగతి, సంక్షేమాన్ని వివరించడానికి సుపరిపాలనకు బుధవారం తొలి అడుగు కార్యక్రమం కుప్పంలో శ్రీకారం చుట్టున్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రానున్నారు.

అధికారంలోనే కాదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే. ఏ కార్యక్రమం అయినా కుప్పం నుంచి ప్రారంభించడం సీఎం ఎన్. చంద్రబాబు పాటించే సెంటిమెంట్. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.

నాలుగు ప్రధాన అంశాలు
కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. తిమ్మరాజుపల్లిలో 'సుపరిపాలనలో - తొలి అడుగు'లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. కుప్పంలో ప్రగతిని పరుగులు పెట్టించడానికి, అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఒప్పందాలు చేసుకోనున్నారు. ఏ టాస్క్ లోనే యువతలో స్కిల్స్ డెవలప్ చేయడానికి వీలుగా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.
మారిన బాబు తీరు..
కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 1989లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు 2024 వరకు వరుసగా తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు, నవ్యాంధ్రలో రెండోసారి ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం చెప్పడం వెనక ప్రధాన కారణం ఒకటి.
కుప్పం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీఎం చంద్రబాబు రాజకీయ వ్యవహారాలు, అనుసరిస్తున్న విధానం గతానికి భిన్నంగా ఉంది.
2024 ఎన్నికల్లో కుప్పం నుంచి మళ్లీ గెలిచిన సీఎం ఎన్. చంద్రబాబు సామాన్య ప్రజలతో ఎక్కువగా మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే కోవలో పార్టీ క్యాడర్ కు కూడా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు వారి సంక్షేమానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు.
వైసీపీ నుంచి ఎదురైన విమర్శలను తిప్పి కొట్టడానికి కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండలం వద్ద సొంత ఇంటి నిర్మించుకున్నారు. కుటుంబ సమేతంగా రెండు నెలల కిందట గృహప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు స్థానికుల్లో ఒకరిగా మారిపోయారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు రెండోసారి బుధవారం రాత్రి సొంత ఇంటిలోనే బస చేయనున్నారు. చిత్తూరు జిల్లా యంత్రాంగం కుప్పంలో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భద్రత చర్యలు కూడా తీసుకుంది.
సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..
సీఎం ఎన్ చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 12:30 గం.లకు శాంతిపురం మండలం తుంసి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారని, అనంతరం మ 12.50 గంటలకు తుమ్మిసి గ్రామం వద్ద ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ వేదిక వద్ద పలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల అనంతరం ఎంఓయూ లు కుదుర్చుకోవడం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ లు పరిశీలిస్తారు.
సుపరిపాలనకు తొలి అడుగు
బహిరంగ సభ అనంతరం సీఎం చంద్రబాబు సాయంత్రం 4.30 గంటలకు శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి వెళతారు. ఏడాది పాలనలో సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇంటింటా వివరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమం రాష్ట్రంలోని టీడీపీ, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిర్వహించాలని అమరావతిలో జరిగిన పార్టీ మీట్లో సీఎం చంద్రబాబు నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం సొంత ఇంటికి చేరుకునే సీఎ చంద్రబాబు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు కుప్పం ఏరియా ఆస్పత్రిలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు స్వగృహానికి చేరుకుని అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రి 4.10 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని, బెంగళూరు తిరుగు ప్రయాణం అవుతారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read More
Next Story