నారావారిపల్లెకు సంక్రాంతి కళ వచ్చేసింది..
x
నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం (ఫైల్)

నారావారిపల్లెకు సంక్రాంతి కళ వచ్చేసింది..

రేపు స్వగ్రామానికి రానున్న సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు మకాం.


తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతికి సిద్ధమైంది. ఈ సంక్రాంతి పండుగకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 12 వ తేదీ నారావారిపల్లెకు చేరుకుంటారు. నాలుగు రోజుల పాటు ఆయన స్వగ్రామంలో బంధువులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు.

పల్లెలో.. పండుగ కళ
నారావారిపల్లె జెడ్పీ హైస్కూల్ ఆవరణలో గ్రామస్తులు, పిల్లలకు ఆటల పోటీల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేశారు. గ్రామానికి పండుగ వళ వచ్చే విధంగా పరిశుభ్రంగా తీర్చదిద్దడంతో పాటు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నారావారిపల్లెలో 12వ తేదీ నుంచి నాలుగు రోజులు విడిది చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో నారావారిపల్లెలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా ఈ సంజీవని ప్రాజెక్టు, శ్రీశేషాచల లింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు పనులు, మూలపల్లెలో జరుగుతున్న పనులు, చెరువు పనులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు.
నారావారిపల్లెలో 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నారావారిపల్లెలో అన్ని ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. నారావారిపల్లెలో ముందస్తు భద్రత లైజన్ ( ASL )లో భాగంగా ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, అదనపు ఎస్పీలు, అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలిసి 12వ తేదీ (సోమవారం) సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. నారావారిపల్లెకు వెళ్లడానికి సమీపంలోని రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన వారి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. వారి సొంత ఇంటిలోనే బస చేయనున్నారు. పండుగకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయనున్నారు.
రంగంపేట తోపాటు నారావారిపల్లెలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్,ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
Read More
Next Story