Chandra Babu| నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు
x

Chandra Babu| నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు

రెండు రోజుల పర్యటన కోసం సిఎం చంద్రబాబు నారావారిపల్లెకు వచ్చారు. ఆయన తమ్ముడు కర్మక్రియల కోసం స్వగ్రామానికి చేరుకున్నారు.


చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తమ్ముడు రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరుకావడానికి సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కొడుకు, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు.


విమానాశ్రయంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్, థామస్, ఎంఎల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తదితరులు ఉన్నారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు.

గ్రామంలో సందడి

సీఎం చంద్రబాబు సొంతఊరికి రావడంతో సందడి వాతావరణం కనిపించింది. నారావారిపల్లె ప్రజలు, బంధువులు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతి పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పార్టీ నేతలు, శ్రేణులు భారీగానే గ్రామానికి తరలివచ్చాయి. వాహనం దిగగానే, తనకు అభివాదం చేస్తున్న గ్రామస్తులు, బంధువులను దూరం నుంచే సీఎం చంద్రబాబు పలకరించారు. ఆయన వెంట ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేతలను పరిచయం చేశారు.

ముందస్తు ఏర్పాట్లు
సీఎం చంద్రబాబు రావడానికి రెండు రోజుల ముందే కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు నారావారిపల్లెలో ముందస్తు ఏర్పాట్ల తోపాటు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. గ్రామంలో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంచారు. సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లు చేశారు. అధికారులు, సిబ్బంది సీఎం పర్యటన ముగిసే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశించారు.
Read More
Next Story