నెల తరువాత సీఐడీ ఎంట్రీ!  మదనపల్లెలో ప్రజాకోర్టు!
x

నెల తరువాత సీఐడీ ఎంట్రీ! 'మదనపల్లె'లో ప్రజాకోర్టు!

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసు దర్యాప్తులో కదలిక వచ్చింది. నెల తరువాత సీఐడీ రంగంలోకి దిగింది. పారదర్శంగా, ఆహ్లాద వాతావరణంలో దర్యాప్తు ప్రారంభమైంది.


మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసు మరుగున పడింది. అని అనుకుంటున్న నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో మదనపల్లెలో మళ్లీ అలజడి మొదలైంది. ప్రధాన నిందారోపణలు ఎదుర్కొంటున్న వారు ఇంకా పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రీవెన్స్ సెల్ లో అందిన అర్జీల ఆధారంగా విచారణ, దర్యాప్తు సాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఈ కేసు దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


దర్యాప్తులో... కదలిక


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్, అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ డిఎస్పీ వేణుగోపాల్, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు సోమవారం రాత్రి రికార్డులను పరిశీలించారు. నిమ్మనపల్లి వీఆర్ఏ రమణయ్యతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్, పూర్వ ఆర్డీఓ మురళీ, బదిలీ ఆర్డీఓ హరిప్రసాద్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

అసలు సంఘటన


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21వ తేదీ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నిషేధిత పట్టా భూముల రికార్డులు కాలిబూడిద అయ్యాయి. ఈ ఘటనలో ముఖ్యమైన 20ఏ, ఈనాం, ఎస్టేట్, డికేటీ భూములు, అటవీ వివాదాస్పద భూముల రికార్డులు కాలిపోయాయని గుర్తించారు. సంఘటన జరిగిన అర్ధరాత్రి వరకు కార్యాలయంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ గౌతంతేజ్ వ్యవహారంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ సంఘటన జరిగిన రోజే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెకు వచ్చారు. ఇందులో అప్పటి వరకు ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్, అంతకుముందు ఆ పోస్టులో ఉన్న మురళీపై కూడా కేసులు నమోదు చేశారు.
ఆ తరువాత రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా మదనపల్లెలో మకాం వేయడం ద్వారా ఆధారాలు సేకరించడంలోనే కాకుండా, ఫైల్స్ రిట్రీవ్ చేయడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతో పాటు తహసీల్దార్ కార్యాలయాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం మధ్య జరిగిన రికార్డుల రాతకోతలు పరిశీలించారు. చివరగా భూ బాధితలు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఊహించని విధంగా వందల సంఖ్యలో వినతులు అందాయి. దీని ద్వారా భూముల అక్రమాలు ఎక్కడెక్కడ జరిగిందనే విషయాన్ని సులువుగా గుర్తించారు.
ఇప్పటికే జిల్లాలో 2.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియానే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో మదనపల్లె పాత ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషా, రైస్ మిల్ మాధవరెడ్డి, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రామకృష్ణారెడ్డితో పాటు ఇంకొందరిపై కేసులు నమోదు విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ నెలరోజుల కితమే మీడియాకు బహిర్గతం చేశారు.

విచారణ మళ్లీ మొదటి నుంచి..
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధమైన సంఘటనపై సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏఎస్పీ రాజ్ కమల్ తోపాటు డీఎస్పీ వేణుగోపాల్, సిబ్బంది మదనపల్లెలో మకాం వేశారు. సోమవారం సాయంత్రం మదనపల్లెకు చేరుకున్న సీఐడీ బృందం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, నిందితులుగా ప్రత్యక్షసాక్షి వీఆర్ఏ రమణయ్య, ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ ను పిలిపించారని సమాచారం. కార్యాలయంలో ఘటన జరిగిన ప్రదేశంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశారని చెబుతున్నారు.
ఈ కేసులో నిందారోణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులైన మిల్లు మాధవరెడ్డి, పీఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు చేసినప్పుడు లభించిన పత్రాలు, ఐప్యాడ్, పెన్ డ్రైవ్, బ్యాంకు లావాదేవీల్లో మద్యం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయని సమాచారం.
మదనపల్లె పట్టణంలో సోమవారం కూడా సీఐడీ బృందం తనిఖీలు సాగించింది. అందులో ప్రధానంగా రికార్డుల దగ్ధానికి సంబందించిన కేసు రికార్డులను సీఐడీ అధికారులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిశీలన జరిపినట్లు పోలీస్ అధికారుల ద్వారా తెలిసింది. సంఘటన తరువాత విచారణ వేగవంతం సాగింది. విచారణ అంశాలపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఆహ్లాద వాతావరణంలో..


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్, ఎస్ఐ వెంకటరమణ రెవెన్యూ సిబ్బందిని ఆహ్లదకర వాతావరణంలోనే విచారణ సాగించారు. తమకు నచ్చిన మీడిను మాత్రమే అనుమించి, మిగతా వారిని దరిదాపుల్లోకి రానివ్వలేదని సమాచారం. కార్యాలయంలో సిబ్బంది మధ్యే కూర్చుని వివరాలు సేకరించి, నమోదు చేసుకోవడం కనిపించింది. మదనపల్లె మీడియా ప్రతినిధుల్లో కొందరినే లోనికి అనుమతించారని చెబుతున్నారు.


పెద్ద గదిలో సిబ్బంది మధ్యే కూర్చున్న సీఐడీ అధికారులు నింపాదిగా, పారదర్శకంగా విచారణ సాగించారు. వారు ఏమి అడుగుతున్నారు? ఏమి సమాధానాలు వస్తున్నాయి? అనేవి అందరూ అక్కడ చక్కగా వింటున్నారు. ిజరిగే సమయంలో రెవెన్యూ సిబ్బంది నవ్వుతూ తుళ్లుతూ కనిపించారు.

"మీడియా మాత్రం వీడియో, ఫోటోలు తీయవద్దని అభ్యంతరం చెప్పారు. ఇదేం విడ్డూరమో అర్ధం కాలేదు" అని పట్టణంలోని సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ వ్యాఖ్యానించారు.
సాధారణంగా జరిగిన నేరానికి సంబంధించి తీవ్రతను పరిగణలోకి తీసుకునే పోలీస్ ఉన్నతాధికారులు మీడియా కోసం బులెటిన్ విడుదల చేస్తారు. ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. కేసు దర్యాప్తు కూడా అదేతీరుగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. సంఘటన జరిగిన తరువాత అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కేసులు కూడా నమోదు చేశారు. మినహా, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై మాత్రమే వేటు వేశారు. అసలైన నిందితులను గుర్తించారా? గుర్తిస్తే, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అనేది మాత్రం తెలియడం లేదు.
రికార్డుల దగ్ధం, భూముల రిజిస్ట్రేషన్, ఫ్రీహోల్డ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించినా, అదుపులోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. వారంతా పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు ప్రధాన అనుమానితులు కొన్ని రోజుల కిందట కూడా మదనపల్లెలో స్వేచ్ఛగా తిరిగారని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.

ఇప్పుడంతా తేలేలా లేదు?

రికార్డుల దగ్ధం కేసు చిక్కుముడి ఇప్పుడల్లా తేలేలా లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీన్ ఇప్పటికి రెండుసార్లు రీ కనస్ట్రక్షన్ చేశారని సమాచారం. దీంతో పోలీస్, సీఐడీ అధికారులు కూడా ఓ అంచనాకు వచ్చారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బాధితుల నుంచి వినతులు కూడా స్వీకరించారు.
"అవి దాదాపు 600 వరకు ఉండవచ్చని" అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గతంలో చెప్పారు. "వాటిని మండలాలు, సమస్యల వారీగా విభజించారు" అని కూడా తెలిపారు.

"ఈ అర్జీలు ఇచ్చిన ఫిర్యాదుదారులను పిలిపించి, ఒక్కొక్కరిగా మాట్లాడాలి" అని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ఈ కేసు మూలాలు ఇప్పట్లో తేలే అవకాశం కనిపించదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మదనపల్లె పోలీసు అధికారులు ఏమి చెప్పడం లేదు.
Read More
Next Story