BREAKING- Chhattisgarh encounter | తవణంపల్లె నుంచి దండకారణ్యానికి..
ఒడిశా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో చిత్తూరు జిల్లా మావోయిస్టు అగ్రనేత మరణించారు. భద్రతా బలగాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.
ఛత్తీస్ ఘడ్ -ఒడిశా సరిహద్దుల్లో ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మరణించిన ఘటనతో చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో కలకలం చెలరేగింది.
చిత్తూరు జిల్లా తిరుపతి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తరువాత అదృశ్యమైన మావోయిస్టు దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. జిల్లాలోని తవణంపల్లె ప్రాంతానికి చెందిన రామచంద్రారెడ్డిగారి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి, అలియాస్ జయరాం ఉన్నట్లు గుర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.
2003లో తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అలిపిరి టోల్ గేట్ దాటిన తరువాత సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లక్ష్యంగా క్లేమోర్ మైన్స్ పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ నిర్వహించడంలో రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి కీలకపాత్ర పోషించాడనేది పోలీసులు అభియోగం. ఈ కేసులో మాజీ నక్సల్స్ తిరుపతికి చెందిన రాంమోహనరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్. నరసింహారెడ్డి, కలికిరికి చెందిన కేవశకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ 2014లో తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. ఆ తరువాత వారు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. విచారణ అనంతరం వారు ముగ్గురూ నిర్దోషులని కోర్టు ప్రకటించింది.
కీలకపాత్ర
అలిపిరి బాంబు పేలుడు ఘటనలో కీలక సూత్రధారిగా ఉన్న రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి అజ్ణాతంలోకి వెళ్లిపోవడంతో పాటు ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి నిఘా వర్గాలు తీవ్రంగా పనిచేశాయని చెబుతారు. అప్పటికే చలపతి దండకారణ్యం వైపు పయనం సాగించినట్లు భావిస్తున్నారు.
ఎన్ కౌంటర్ తో వెలుగులోకి..
ఒడిశా సరిహద్దులోని దండకారణ్యం జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారు 20 మంది వరకు మావోయిస్టులు మరణించినట్లు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. మావోల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సాగించిన జాయింట్ ఆపరేషన్ లో చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలోని తవనంపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈయన శ్రీకాకుళం కోరాపుట్ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలిపిరి పేలుడు తరువాత ఆచూకీ లేకుండా పోయిన రామచంద్రారెడ్డి ఒడిశా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉంది.
విద్యాభ్యాసం.. పోరుబాట
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం పైపల్లె గ్రామానికి చెందిన చలపతిరెడ్డి గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మదనపల్లె, తిరుపతిలో పీజీ వరకు విద్యాభ్యాసం కొనసాగింది. మదనపల్లిలోని సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పని చేస్తూ విశాఖకకు బదిలీ అయ్యారు. అక్కడ మావోయిస్టులతో ఏర్పడ్డ పరిచయంతో అంచెలంచెలుగా అగ్ర నాయకుడుగా ఎదిగారు. దళంలనే ఆయన మావోయిస్టు నాయకురాలు అరుణను వివాహం చేసుకున్నారు.
విశాఖ ఏజెన్సీలో గతంలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు రామకృష్ణ , చలపతి రెడ్డి తప్పించుకోవడంతో వారిని పట్టుకునేందుకు కోటి రూపాయల వరకు రివార్డు ను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ జరిగిన కాల్పుల్లో చలపతి రెడ్డి మృతి చెందినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఆయన తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. ఆయనకు ఇద్దరు అన్నలు. ఒక అన్న మృతి చెందారు. అన్న కొడుకు పైపల్లెలో నివాసం ఉన్నాడు. రెండో అన్న చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మదనపల్లి లోని పట్టు పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై తవణంపల్లె మండలం పైపల్లె చర్చకు వచ్చింది.
Next Story