
సబ్సిడీ ఆదుకున్నా .. 2026 వరకు మామిడి రైతులకు విషాదమే..
రూ. 300 కోట్లు చెల్లించడం మరింత ఆలస్యం తప్పదంటున్న గుజ్జు పరిశ్రమలు.
ఈ సంవత్సరం మామిడికాయల సీజన్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సబ్సిడీ జమ చేయడంతో రైతులకు కాస్త ఉపశమనం కలిగింది. మామిడి కాయలు కొనుగోలు చేసిన గుజ్జు పరిశ్రమల నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల రైతులకు 300 కోట్ల రూపాయలు జమ చేయడం ఆలస్యం అవుతోంది. దీంతో రైతుల ఆక్రందనలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. 2026 మామిడి సీజన్ ప్రారంభం వరకు ఈ కడగండ్లు తీరేలా లేవు. దీనికి తోడు దాదాపు మూడు వేల మందికి పైగానే సబ్సిడీకి కూడా పెండింగ్ లో ఉంచారు.
"ఆ రైతులు ఈ నెలాఖరులోపు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి" అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. దీనికోసం కంట్రెల్ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు.
మామిడి రైతులకు నగదు చెల్లింపుపై జాప్యంపై ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ (all India food processor association aifpa) సౌత్ జోన్ చైర్మన్, చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కట్టమంచి బాబి ఏమంటారంటే..
"మామిడి గుజ్జు ఎగుమతులకు యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom UK) మార్కెట్ కాస్త సానుకూల వాణిజ్యం ఉంది. యూరోపియన్ దేశాలు (European countries) నుంచి ఇంకా పరిస్థితులు మెరుగుపడలేదు. ఉత్పత్తి చేసిన మామిడి గుజ్జు ఎగుమతి జరగడం, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే మినహా రైతులకు చెల్లింపులు చేయడం సాధ్యం కాదు" అని గోవర్ధన్ బాబి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
రాష్ట్రంలో చిత్తూరుతో పాటు పొరుగునే ఉన్న కడప జిల్లాలో కూడా ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. కృష్ణాజిల్లా తర్వాత ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో మామిడి తోటలో సాగు చేయడంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాటల ప్రకారం.. 88 వేల మంది రైతులు 87 500 ఎకరాల్లో అంటే దాదాపు 2.80 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అందులో 70 శాతం తోతాపూరి రకం మామిడితోటలే. కృష్ణాజిల్లాతో సమానంగా కడప జిల్లాలో 75 వేల ఎకరాలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో ఎన్టీఆర్ విభజిత జిల్లాలో మాత్రమే 30 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నట్లు ఆ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి బాలాజీ వెల్లడించారు.
రైతులకు అండగా..
రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తోతాపురి మామిడికాయలు కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించింది. కిలో మామిడికి ప్రభుత్వం నాలుగు రూపాయాలు, గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు చెల్లించే విధంగా ధర నిర్ణయించారు. మామిడి రైతులకు ఇది సాంత్వన ఇచ్చింది. గుజ్జు పరిశ్రమల వద్ద మామిడికాయలు తోలుకు వచ్చిన రైతులకు పాస్ పుస్తకాలు పరిశీలించి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకొని టోకెన్లు జారీ చేయడం ద్వారా మామిడికాయలు పరిశ్రమల యజమానులు తీసుకునే విధంగా రెవెన్యూ, ఉద్యానవన శాఖ, పోలీసు యంత్రాంగం సమన్వయం చేయడం ద్వారా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రద్ధ తీసుకున్నారు.
సబ్సిడీ సొమ్ముతో ఊరట
ఈ ఏడాది మామిడి సీజన్ లో రైతులతో ధరలు దోబూచులాడాయి. అయితే తనకు మాత్రం మేలు జరిగిందని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శివశంకరరెడ్డి చెప్పారు.
"తిరుపతిలోని గుజ్జు పరిశ్రమకు 11 టన్నుల మామిడికాయలు సరఫరా చేశాను. నాకు రూ. 44 వేలు సబ్సిడీ జమ చేశారు. పరిశ్రమల యజమానులు నగదు ఇస్తే, మరో రూ. 80 వేల వరకు గిట్టుబాటు అవుతుంది. విపత్కర పరిస్థితిలో ఈ మొత్తం అందడం వల్ల న్యాయం జరిగింది" అని శివ శంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మామిడి తోటల రైతులకు ఇచ్చిన మాట మేరకు నాలుగు రూపాయల సబ్సిడీ ఈ నెల 14వ తేదీ నుంచి రైతుల ఖాతాలకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో రైతులకు కాస్త ఊరట దొరికింది. 34 మండలాల్లోని 31,929 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.67 లక్షల మెట్రిక్ టన్నులకు నాలుగు రూపాయలు సబ్సిడీ ద్వారా 146.84 కోట్ల రూపాయలు సబ్సిడీ జమ చేశారు. కొందరు రైతులకు నగదు జమ కాలేదనే మాటలు వినిపిస్తున్నాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. జిల్లాలోని బంగారుపాలెం మండల రైతులకు ఎక్కువ మొత్తం జమ అయ్యిందని చెప్పారు.
బిల్లుల పెండింగ్.. పరిశ్రమలపై వేటు
ల్లాలో 20 వేల మందికి పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ అందుకున్నారు అని కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. వారిలో రూ.5 లక్షలకు మించి సబ్సిడీ అందుకునే రైతుల్లో 21 మంది రైతులు ఉన్నారు. వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామని ఆయన తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధర ఇవ్వని గుడిపాల, పుంగనూరు, బంగారుపాళెంలోని ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లకు పరిశ్రమల శాఖ నుంచి సహకారం అందించకుండా వేటు వేశారు. మిగతా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు, సహకారం అందిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాజయకీయ, వ్యాపారపరంగా కాకుండా రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.
"అర్హత ఉండి, నగదు జమ కాని రైతులు ఆందోళన చెందవద్దు. అక్టోబర్ 30వ తేదీ వరకు ఆర్ఎస్కె, మండల, జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు వినతులు ఇవ్వండి. సందేహాలు ఉంటే 08572-242777 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించండి" అని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
"చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో వెయ్యి మంది రైతులకు సబ్సిడీ జమ కాలేదు. వారి పత్రాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తయ్యాక, సబ్సిడీ జమ చేస్తాం" అని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధనరెడ్డి స్ఫస్టం చేశారు. ఇదిలావుంటే,
తిరుపతి జిల్లాలో జూన్ ఈ ఏడాది జూన్ నుంచి జూలై నెల చివరి వరకు పల్ప్ పరిశ్రమలు, ర్యాంప్ ల ద్వారా 5,952 మంది రైతుల నుంచి 65014.159 టన్నుల కాయలను కొనుగోలు చేశారని కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్ చెప్పారు. సబ్సిడీ కింద రైతులకు 26 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశారన్నారు.
అన్నమయ్య జిల్లాలో
కడప జిల్లా (అన్నమయ్య) జిల్లా రాయచోటి, మదనపల్లె, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు తాలూకాల్లో 22,706 టన్నుల తోతాపురి మామిడి కాయలు పరిశ్రమలు కొనుగోలు చేశాయి. సబ్సిడీ ద్వారా 2,271 మంది రైతులకు 9.8 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
సబ్సిడీ అందని రైతులు, సమస్యలు ఉంటే జిల్లా ఉద్యానవనం శాఖ అధికారి సెల్ నంబర్ 8919527578లో సంప్రదించాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ వల్ల నాకు మేలు జరిగిందని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన సుధీర్ నాయుడు చెప్పారు. నాకు ఐదెకరాల్లో మామిడి తోట ఉంది. మామిడి గుజ్జు పరిశ్రమకు 14.76 టన్నులు తోతాపురి మామిడి కాయలు సరఫరా చేశా. దీనికి గానూ రూ.59,040 జమ చేశారు. పరిశ్రమలకు తోలాను. కిలోకు ఆరు ఐదు రూపాయలు ఇచ్చినా, మరో లక్ష రూపాయలు వస్తాయి. దీనివల్ల ఈసారి గిట్టుబాటు అయినట్టే" అని సుధీర్ నాయుడు చెప్పారు.
గుజ్జు ఎగుమతి జరిగితేనే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నుంచి కొనుగోలు చేసిన గుజ్జు నిలువలు పరిశ్రమల్లో ఉందని చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కట్టమంచి బాబ్జి చెప్పారు. ఈ గుజ్జు యూరోపియన్ దేశాలతో పాటు, యునైటెడ్ కింగ్డమ్ కు ఎగుమతి చేయడం ద్వారా జరిగే వ్యాపారంతో రైతులకు నగదు చెల్లించడం సాధ్యమవుతుందని బాబీ చెప్పారు. ఈ ఏడాది నవంబర్ తర్వాతే ఇది సాధ్యమవుతుందని విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
"జిల్లాలో నాలుగు లక్షల టన్నుల మామిడికాయలు పరిశ్రమలు కొనుగోలు చేశాయి. 38 యూనిట్ల ద్వారా దీని ద్వారా సుమారు రెండు లక్షల టన్నులకు పైగానే గుజ్జు తయారయింది," అని బాబి వివరించారు. రైతులకు నగదు చెల్లింపు అనేది ఒకటి లేదా రెండు నెలలు పట్టవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతులకు సుమారు 300 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
గోవర్ధన్ బాబీ ఇంకా ఏమంటున్నారంటే.
"యూకేతో Free Trade జరిగింది. యూరోపియన్ దేశాలతో ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. ప్రధాన బయ్యర్ గా ఉన్న కువైట్ ముందుకు రావాలి. 50 నుంచి 60 శాతం వరకు ఆచార్జనకంగా ఆర్డర్లు ఉన్నాయి. గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్ ద్వారా యూకే, ఈ యు దేశాలకు మామిడి గుజ్జు ఎగుమతి జరిగితే రైతులకు కూడా మేలు జరుగుతుంది" అని బాబి విశ్లేషించారు. బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే రైతులకు సకాలంలో చెల్లింపులు సాధ్యం అవుతుంది" అని కూడా బాబి స్పష్టం చేశారు. లేదంటే ఎగుమతుల ద్వారా జరిగే వ్యాపారంతో చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి వరకు కూడా మామిడి రైతుల కడగండ్లు పూర్తిస్థాయిలో తీరేలా కనిపించడం లేదు.
Next Story