
కాణిపాకం, శ్రీశైలం ఆలయాలు (ఫైల్)
TTD Formula |ఆలయాల ట్రస్టు బోర్డుల ఏర్పాటులో సంస్కరణలు..
కాణిపాకం ఆలయ బోర్డులో 16 మంది సభ్యుల నియామకం. శ్రీశైలంపై టీడీపీ నేతల అభ్యంతరం.
టీటీడీ పాలక మండలి కూర్పులో దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం యూనిట్ గా తీసుకుంటోంది. రాయలసీమలోని ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయడంలో ఈసారి రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంది. గత నెలలో అధ్యక్షులను నియమించారు. తాజాగా సభ్యుల జాబితా కూడా ప్రకటించారు. రానున్న వారంలో ఆ ఆలయాల పాలక మండళ్లు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డు అధ్యక్ష పదవి జనసేన నేత కొట్టే సాయిప్రసాద్ కు దక్కింది. కాణిపాకం ఆలయానికి ఐరాల మండలానికి చెందిన టీడీపీ నేత వి. సురేంద్రబాబు (మణి నాయుడు)ను నియమించారు. శ్రీశైలం దేవస్థానానికి అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన బీజేపీ నేత పోతుగంటి రమేష్ నాయుడుకు అవకాశం దక్కింది. ఆ మూడు ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ కూటమి నేతలకు అవకాశం కల్పించారు. ఆ కోవలోనే కాణిపాకం ఆలయానికి 16 మంది సభ్యులను నియమించారు.
ఆలయ పాలనలో భాగస్వామ్యం
ఆలయ వ్యవహారాల్లో కూడా పాలన వికేంద్రీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఆలయాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సభ్యులుగా నియమించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి ఆలయ పాలక మండలి కూర్పుపై టీడీపీ నేతల గుర్రుగా ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని మండిపోతున్నారు. ఆళ్ళగడ్డకు ప్రాధాన్యత లేకుండా చేయడంతో పాటు, వైసీపీ నేతలకు అవకాశం కల్పించారని ఎమ్మెల్యే వర్గీయులు గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాణిపాకం ఆలయ పాలక మండలి..
చిత్తూరు జిల్లాలో ప్రఖ్యాత ఆలయాల్లో వరసిద్ధి కాణిపాయం ఆలయ పాలక మండలి పూర్తి స్థాయిలో ఏర్పాటయింది. తాజాగా 16 మంది సభ్యులను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో శ్రీకాళహస్తి, శ్రీశైలం ఆలయాలకు మొదట చైర్మన్లను నియమించారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ చైర్మన్ గా వి.సురేంద్రబాబు (మణినాయుడు)ను ప్రభుత్వం నియమించింది. సభ్యుల నియామకం పెండింగ్ లో ఉంచింది.
టీడీపీ కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీల నేతలకు అవకాశం కల్పించడానికే సభ్యులను ప్రకటించలేదనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
బోర్డు సభ్యులే వీరే...
పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలోని కాణిపాకి వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా 16 మందిని నియమించారు. వారిలో.. టీడీపీ నుంచి చంద్రశేఖరరెడ్డి (పూతలపట్టు), తాడిపత్రి నుంచి పరిమి చంద్రకళ, కెఎస్. అనసూయమ్మ ( గంగాధరనెల్లూరు), కాధి సుధాకరరెడ్డి (పూతలపట్టు), దేవరకొండ సంధ్యారాణి (రాజంపేట, అన్నమయ్య జిల్లా), సునీతా గుంటపల్లి (ప్రత్తిపాడు), టివి. రాజ్యలక్ష్మి (కర్నూలు), ఉట్ల నాగరాజనాయుడు (పూతలపట్టు), శ్రీపతి సతీష్ (తెలంగాణ), కిలపర్తి రాజేశ్వరి (మాడుగుల), పద్మలత కనకరాజు (చంద్రగిరి), వసంత (కుప్పం), వి. శ్రీవాణి (పీలేరు),
జనసేన: డాక్టర్ బివి. నరేష్ (కుప్పం), కొత్తపల్లి శివప్రసాద్ (పూతలపట్టు)
బీజేపీ: పెరుమాళ్ సుబ్రమణ్యం రెడ్డి (పూతలపట్టు) ఉన్నారు.
టీటీడీ తరహాలో..
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్, సభ్యుడిగా అవకాశం కోసం తీవ్రంగా పోటీ ఉంటుంది. ఈ పదవులు జిల్లాకు మాత్రమే పరిమితం ఉండదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సభ్యులుగా నియమించడం ద్వారా ఆ ప్రాంత యాత్రికుల సౌలభ్యం కోసం పనిచేసే విధంగా పార్టీల నేతలు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
రాష్ట్రంలో మొదటిసారి తిరుమల తరహాలోనే ప్రధాన ఆలయాలకు పాలక మండళ్లను నియమించింది. అందులో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డును కూడా కూర్పు చేసింది. కాణిపాకం చుట్టు ఉన్న 14 గ్రామాలకు చెందిన వారికే పదవులు పరిమితం అయ్యేవి. ఈసారి మాత్రం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ కూటమిలోని పార్టీల నేతలకు అవకాశం కల్పించారు.
16 మంది నియామకం
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గా వి. సురేంద్రబాబు (మణినాయుడు) సారధ్యంలోకి కమిటీలో 16 మందికి సభ్యులుగా దేవాదాయ శాఖ నియమించింది. ఇందులో జనసేన పార్టీ నుంచి ఇద్దరికి, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించారు. మిగతా 14 మంది టీడీపీ నాయకులను పాలక మండలి సభ్యులుగా నియమించారు.
శ్రీశైలంలో రచ్చ
శ్రీశైలం మల్లన్న ట్రస్టు బోర్డు కూర్పుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులపై గుర్రుగా ఉన్నారు. ఈ కమిటీలో ఆళ్లగడ్డ నియోజకవర్గంపై సీతకన్ను వేయడం వెనక కారణం ఏమిటని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గం ప్రశ్నిస్తోంది. ఓ మంత్రికి బంధువు అయిన వైసీపీ మద్దతుదారులు డాక్టర్ సింధూకు పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల టీడీపీ శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతినదా? అని కూడా నిలదీస్తున్నారు.
ఆళ్లగడ్డలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా జనసేనకు ఇచ్చారు. శ్రీశైలం ట్రస్టు బోర్డులో వైసీపీ మద్దతుదారులైన వారికి అవకాశం కల్పించడం వెనుక ఆంతర్యంపై కర్నూలు జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా నియమితులైన పోతుగంటి రమేష్ నాయుడు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ముందే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు.
"చెంచుగూడేలలోని వారికి శ్రీశైలం మల్లన్న దర్శనం కల్పించడానికి శ్రద్ధ తీసుకోవడం. ఆధ్యాత్మికత, విద్యా పరంగా వారిని జనజీవనంలో కలిపే విధంగా కార్యాచరణ ఉండోబోతుంది" అని పోతుగుంట రమేష్ నాయుడు చెప్పారు.
మిగతా వివరాలు ఆయనతో సాగించిన ఇంటర్వ్యూలో ఏమి చెప్పారో తెలుసుకుందాం..
Next Story