చంద్రగిరి : కోటలో చరిత్ర చెబుతున్న సంగీతం
శౌర్యానికి ప్రతిక చంద్రగిరి కోట. ఆనాటి చరిత్ర పాటలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. చారిత్రక కోటలో ఉత్సవాలు కనువిందు చేశాయి.
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. వారి రాచరిక ఆనవాళ్లు చరిత్రగా మిగిలింది. వారసత్వ సంపద కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆలస్యంగా అయినా చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని 11వ శతాబ్దం నాటి చంద్రగిరి కోటకు కళ వచ్చింది. దశాబ్దాల కాలం తరువాత చంద్రగిరి కోటకు పర్యాటకులను ఆకర్షించడానికి వసతులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కోటలో సౌండ్ అండ్ సౌండ్ అండ్ లైట్స్ షో అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రగిరి కోటకు కొత్త సోబగులు దిద్దారు. దీంతో చంద్రగిరి సమీప ప్రాంతాల విద్యార్థులే కాకుండా, స్ధానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
చంద్రగిరి కోటలో సుమారు 3.50 కోట్లతో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్స్ షో సదుపాయం కల్పించామని జేసీ శుభం బన్సల్ తెలిపారు. భారత ఆర్కియాలజీ విభాగం, ఏపీటీడీసీతో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యలో 'లక్స్ డెసిబిల్స్' ప్రతినిధుల సహకారంతో చంద్రగిరి చరిత్రను వివరించే సౌండ్ అండ్ లైట్స్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కోట ఆవరణలో ఫుడ్ కోర్టు, బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సౌండ్ అండ్ లైట్స్ ఏర్పాటుతో కలిపి సుమారు రూ. ఆరు కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
చంద్రగిరిలో శుక్రవారం సాయంత్రం ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) డీవీఎం గిరిధర్ రెడ్డి, ఈఈ సుబ్రమణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్కియాలజీ సబ్ సర్కిల్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్, లక్స్ అండ్ డిసిబుల్స్ ప్రతినిధి శివ జేసీ శుభం బన్సల్ చంద్రగిరి క్లాక్ టవర్ సెంటర్ నుంచి కోట వరకు పాఠశాల విద్యార్థులు, ప్రజలతో కలిసి హెరిటేజ్ వాక్ ను ప్రారంభించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానం చేశారు.
చంద్రగిరి కోట
చంద్రగిరి కోటకు చారిత్రక నేపథ్యం ఉంది. చంద్రగిరి కోటకు విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ, దీనిని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు. చంద్రగిరిని మూడు శతాబ్దాలు యాదవ నాయక్కార్ పాలనలో, నియంత్రణలోకి వచ్చింది విజయనగర యాదవులు 1367 లో పాలకులుగా ఉన్నారు. సాలూవ నరసింహ రాయలు పాలనలో దీనికి ప్రాధాన్యత ఉండేది. తరువాత, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలో పరిమితం చేశారు. ఈ కోటలో తన కాబోయే రాణి చిన్నాదేవిని కలిశారని కూడా అంటారు. విజయనగర సామ్రాజ్యం నాల్గవ రాజధాని చంద్రగిరిగా ఉండేది. గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసినప్పుడు రాయలవారు తమ రాజధానిని చంద్రిగిరికి మార్చారు. 1646లో ఈ కోట గోల్కొండ భూ భాగానికి అనుసంధానించారు. తరువాత మైసూర్ పాలనలోకి వచ్చింది. ఇది 1792 నుంచి ఉపేక్షలోకి వెళ్ళింది. చంద్రగిరి కోటలోని రాజామహల్ ప్యాలెస్ ఇప్పుడు పురావస్తు మ్యూజియంగా మారింది. ఈ ప్యాలెస్ విజయనగర కాలం నాటి ఇండో-సర్సెన్ నిర్మాణానికి అద్దం పడుతుంది. ఈ కిరీటం టవర్లు హిందూ నిర్మాణ అంశాలను సూచిస్తాయని, ఈ ప్యాలెస్ నిర్మాణంలో రాయి, ఇటుక, సున్నం మోర్టార్, కలప లేనివి ఉపయోగించి నిర్మించినట్లు కేంద్ర ఆర్కియాలజీ సబ్ సర్కిల్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ వివరించాు. రాయల వారి ఆస్ధానంలో మహామంత్రి తిమ్మరసు జన్మస్థలం కూడా చంద్రగిరి అనేది చరిత్రం. అంతేకాకుండా, ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోసం బ్రిటిష్ వారికి భూములు ఇచ్చే ఒప్పందం కూడా 1639 ఆగష్టులో చంద్రగిరి కోటలో జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
Next Story