
ఒకేరోజు కడపకు చంద్రబాబు, జగన్!
పులివెందులలో జగన్ మూడు రోజుల పర్యటన
ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు సీఎం ఎన్. చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్. జగన్ సోమవారం రానున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. వారిద్దరి పర్యటనలు వేర్వరు అయినా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిష్ఠాత్మకంగా మారినట్లు తెలుస్తోంది.
"ఈసారి కూడా జగన్ నుంచి చీవాట్లు తప్పవా?" అని వైసీపీ పులివెందుల నేతలు మథనపడుతున్నట్లు సమాచారం. దీనికి కారణం గత పర్యటనల్లో కూడా జనసమీకరణ విషయంలో జగన్ నుంచి తిట్లు పడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు పులివెందుల వర్గాల సమాచారం. ఇదిలాఉండగా,
జగన్ పర్యటన ఇలా..
పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్. జగన్ సోమవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని సమాధి వద్ద మంగళవారం నివాళులర్పించనున్నారు. దీనికోసం సోమవారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకోనున్నారు.
సెప్టెంబర్ 1: మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుంటారు. పట్టణంలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు.
సెప్టెంబర్ 2: పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లింగాల మండలం అంబకపల్లి చేరుకుంటారు. గంగమ్మకుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని, క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
సెప్టెంబర్ 3: ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.
నివాళులు అర్పించడానికే..
తన తండ్రి దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించడానికి మాజీ సీఎం వైఎస్. జగన్ మూడు రోజుల పర్యటన కోసం పులివెందులకు మధ్యాహ్నం చేరుకుంటారు. రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. వారిద్దరి పర్యటనల నేపథ్యం వేర్వేరు అయినా, రాజకీయంగా ఆసక్తికరంగా మారడం వెనుక ప్రధాన కారణం ఒకటే.
ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్. జగన్, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి అడ్డాలోని పులివెందుల, రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపించాయి. ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందని మాజీ సీఎం వైఎస్. జగన్ మండిపడ్డారు. రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ను కూడా బహిష్కరించారు. ఆ తరువాత వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థులను తాడేపల్లికి పిలిపించుకుని, ధైర్యం కూడా చెప్పారు. ఇదంతా బయటికి కనిపిస్తున్నది మాత్రమే.
నేతలపై జగన్ ఆగ్రహం?
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత పులివెందులలో పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్. జగన్ తన కోటరీలోని నేతలపై సీరియస్ గా ఉన్నట్లు అక్కడి మీడియా, నాయకుల ద్వారా తెలిసింది. గతంలో కూడా పులివెందుల పర్యటనకు వచ్చిన సమయంలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిపై మండిపడడం, అవినాష్ తన పీఏపై చెయ్యి చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
"రెండు రోజలు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో బస చేస్తే, కనిపించిన వారే మళ్లీ మరుసటి రోజు కూడా వచ్చారు. ఇక్కడ ఏమి జరుగుతోంది?" అని ఎంపీ అవినాష్ పై గతంలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.
జగన్ ఎలా స్పందిస్తారో..?
పులివెందుల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి వల్ల ద్వితీయశ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పరిణామాలు, పార్టీ పరిస్థితిపై నాయకులతో జగన్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఐదు దశాబ్దాల చరిత్రలో వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందులలో పెద్దదెబ్బే తగిలిందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ నుంచి ఎలాంటి చీవాట్లు పడతాయో అని పులివెందుల వైసీపీ నేతలు గుబులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Next Story