మదనపల్లెలో రికార్డుల దగ్ధం:  చిన్నట్రిక్ నడిచొచ్చిన ఆధారాలు
x

మదనపల్లెలో రికార్డుల దగ్ధం: చిన్నట్రిక్ నడిచొచ్చిన ఆధారాలు

ఏపీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా సామాన్యుడు కాదబ్బా..! మదనపల్లెలో రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో సగం వంతు ఆయన ఛేదించారా? ఆయన ప్రయోగించిన ట్రిక్ వల్ల సాక్ష్యాలు ఎలా నడిచివచ్చాయి?


మదనపల్లి రెవెన్యూ రికార్డుల దహనంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పీ. సిసోడియా ప్రయోగించిన చిట్కా సాక్షాధారాలు నడుచుకుంటూ వచ్చాయి. పల్లెల్లో విచారణ చేయలేదు. కార్యాలయంలో భారీ దర్బార్ ఏర్పాటు చేయలేదు. బాధితులతో స్వయంగా మాట్లాడాలని ఆయన సంకల్పించారు. తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చిన సిసోడియా, కాలిపోయిన రికార్డుల లింకులు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని పత్రాలు అంటుంచితే, ఈ కేసులో సగం వంతు దర్యాప్తు మూడు రోజుల్లో 80 శాతం ఆయన సాధించగలిగారు.



ఇంతకీ ఆయన ఏం చేశారు.

మదనపల్లిలో మూడు రోజులు మకాం వేసిన ఆయన భూములు నష్టపోయిన బాధితుల కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఇందులో 22-ఏ నిషేధిత భూములు, అసైన్డ్ పట్టాలు తమ నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపిస్తూ వందలాది మంది బాధితులు అర్జీలు సమర్పించారు. తమ వద్ద ఉన్న పత్రాలు కూడా అందించారు. దీంతో ఈ కేసులో సగం వంతు 21ఏ నిషేధిత భూములతో పాటు ఇంకొన్ని వ్యవహారాల చిక్కుముడి వీడినట్లు కనిపిస్తోంది. ఈయన అనుసరించిన ఈ విధానంతో యువ ఐఏఎస్. ఐపీఎస్ అధికారులకు కూడా పాఠం నేర్పించకనే నేర్పించారు.
నిబంధన ఇది..
అసైన్డ్ భూముల విక్రయించడం, కొనుగోలు చేయడం నిషేధం. పట్టాలు పొందిన వ్యక్తి తమ తదనానంతరం వారసులకు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ విక్రయించాలి అనుకుంటే కలెక్టర్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఆ విధంగా అనుమతి ఇవ్వడానికి 1954 సంవత్పరానికి ముందు అసైన్డ్ భూములకు మాత్రమే ఎన్ఓసీ ఇవ్వాలనే నిబంధన ఉంది.
ఏమి చేశారంటే..
పాత రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉం ది. అయితే గ్రామాలు, చిన్నపట్టణాలకు సమీపంలో అనేక అసైన్డ్ భూములు చేతులు మారాయి. ఇందుకు ప్రధానంగా, గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ కాలంలో సడలింపు ఇవ్వడం వల్ల అసైన్డ్ భూములు పెద్దల పరం అయ్యాయి. మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 2003 ముందు పట్టాలు తీసుకున్న అసైన్డ్ భూములపై హక్కుదారులకు హక్కులు కల్పించారు.
"ఇది ప్రభుత్వం చేసిన చట్టం. మళ్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి" అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. మదనపల్లె రికార్డుల దగ్ధం కేసుో పోలీసులతో విచారణ జరుగుతోంది" అని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు.

గత వైెఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొందరికి వరంగా మారింది. అధికారం ఉంది కాదా. అని అవగాహన లేని రైతుల వద్ద నుంచి బేరాలు పెట్టి, అదిరించి, బెదిరించి కొనుగోలు చేయడమే కాకుండా, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి అసైన్డ్ భూములు 20 ఏళ్ల అనుభవం ఉన్నవాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతి ఉన్నట్లు చట్టం చెబుతోంది.

ఆ మేరకు నిబంధనలు ఆసరాగా చేసుకుని, 20 ఏళ్లు అనుభవంలో ఉన్నట్లు రికార్డులు సృష్టించడమే కాకుండా, నిబంధనలు సరళతరం కావడంతో గత ప్రభుత్వంలో కోందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వారికి కుడి, ఎడమ భుజాలుగా మసిలిన ప్రధాన అనుచరులు నయానో.. భయానో ఒప్పించి కొందరి వద్ద, బెదిరించి ఇంకొందరి వద్ద భూములు కొనుగోలు చేసి, తమ అధినేతల కుటుంబాల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారనే విషయం స్వయంగా బాధితులే వెల్లడించారు.


ఇదిగో సాక్షాలు..
"పట్టా భూములు కూడా నకిలీ సంతకాలతో దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు" అని మదనపల్లె పట్టణానికి చెందిన మార్పూరి వెంకటేష్‌ ఆరోపించారు. జనరల్ అథారిటీ రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు.
బీకేపల్లి సర్వే నెంబరు 420/10aలో 225 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.6.84లక్షలు, బీకేపల్లి సర్వే నెంబరు 420/14లో 1558 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.47.38లక్షలు, బీకేపల్లి సర్వే నెంబరు 410/10లో 6000 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.20.27లక్షల విలువైన భూములు గతేడాది మార్చిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరున రిజిస్ట్రేషన్ చేశారని, దీనిపై పూర్వ మదనపల్లె ఆర్డీఓ మురళిని ఆశ్రయించిన పట్టిచుకోలేదు అని వెంకటేష్ ఆరోపించారు.

నిర్మాణం అడ్డుకున్నారు..
సోసైటీ ద్వారా కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న సెటిల్మెంట్ భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే ఎస్సీ నాయకులు అడ్డొస్తున్నారని మదనపల్లెకు సమీపంలోని బీకేపల్లి సర్వే నంబర్ 67లోని ఇంటి స్థలాల యాజమానులు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియాకు పిర్యాదు చేశారు. నిర్మించిన ఇళ్లు కూడా కూల గొడుతున్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. కొన్నేళ్లుగా మాకు నరకం చూపిస్తున్న, ఎమ్మార్పీఎస్ నరేంద్రబాబు, టీడీపీ నాయకులు మేకల రెడ్డిశేఖర్, రామ్మోహన్ రాజు, వైసీపీ కౌన్సిలర్ ప్రసాద్‌బాబు, బ్లేడు మోహనకు రెవెన్యూ, విద్యుత్ అధికారులు సహకరిస్తున్నారని ఆవేదన చెందారు.


పుంగనూరులో డీకేటీ ఆక్రమణ
"రెండున్నరేళ్ల కిందట పెద్దిరెడ్డి అనుచరులు పుంగనూరు మండలం మంగళం శ్రీనాధరెడ్డి, పెద్దపంజానికి చెందిన మోహన్‌రెడ్డి దౌర్జన్యం చేసి నా భూమి లాక్కొన్నారు" అని పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ‌మండలం దిగువపల్లె‌ పంచాయతీ దేవిరెడ్డిచెరువుకు చెందిన ఎల్లప్ప భార్య దావ‌ లక్ష్మమ్మ ఆరోపించారు. సర్వే నెంబరు 24/15లోని మూడెకరాల డీకేటీ భూమి కబ్జా ఆక్రమించారని ఆమె ఫిర్యాదు చేశారు.

"చౌడేపల్లె పంచాయతీ దిగువపల్లి దేవిరెడ్డిచెరువుకు చెందిన మునివెంకటప్ప పేరున ఉన్న సర్వేనెంబరు 24/17, 19లోని 2.55ఎకరాల భూమిపెద్దిరెడ్డి అనుచరులు లాక్కొన్నారు" అని బాధితుడు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి ప్రధాన అనుచరుడిదే పాత్ర
మదనపల్లెలో భూముల భాగోతం సాగించడంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరు రైస్ మిల్లు మాధవరెడ్డి అనేది ప్రధాన అభియోగం. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో నిషేధిత, అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ బృందాలు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనతో పాటు సోదరుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, మాధవరెడ్డిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సందేహిస్తున్నారు. ఆయన బాధితులు ఒకరిద్దరు కాదు, వందల సంఖ్యలో ఫిర్యాదులు అందించారు. అందులో..

సైనికుల కోటానూ వదలలేదు...
తన భర్త తండ్రి మాజీ సైనికుడు అని మదనపల్లె మండలం బండమీద కమ్మపల్లె చెందిన ఆకుల అన్నపూర్ణ తెలిపారు. తన భర్తకు పిత్రార్జితంగా కొంత, వ్యక్తిగతంగా సంపాదించుకున్న వాటిలో మదనపల్లె బీకేపల్లి సర్వేనెంబర్లు 552/5లో 64సెంట్లు, 552/7లో 3.40ఎకరాలు, 552/8లో 50 సెంట్లు, 552/9లో 8 సెంట్లు, 7లో 2.5సెంట్ల ఇంటిస్థలం, 568/1లో 3సెంట్ల ఇంటిస్థలం, 346లో 2.5సెంట్ల ఇంటిస్థలం, 552/2లో 3.71 ఎకరాలు, 544/3లో 1.30ఎకరాలు ఉన్నాయని ఆమె వివరించారు. అందులో "నా భర్త పిత్రార్జితం‌గా మాజీ సైనికుల కోటాలో కేటాయించిన భూమి వారసత్వ హక్కు అనుభవంలో‌ ఉన్న భూమిని పెద్దిరెడ్డి అనుచరుడు రైస్‌మిల్ మాధవరెడ్డి ఆక్రమించారు" అని ఆమె రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేశారు.
" ఆ భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరుతో రిజిస్టర్ చేయించారు. బినామీగా ఉన్న మదనపల్లెకు చెందిన మిల్లు మాధవరెడ్డి భార్య, కుమారుడి పేరిట నికిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ తో కబ్జా చేశారని బాధితురాలు ఆకుల అన్నపూర్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు.


ఎమ్మెల్యే సోదరుల పేరిట
చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానథరెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి ప్రధాన అనుచరులుగా రాజకీయ వ్యవహారాలు సాగించిన నేతలు ఇష్టారాజ్యంగా భూ ఆక్రమణలకు పాల్పడడం, వాటిని ఆ ఎమ్మెల్యేలతో పాటు వారి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కుటుంబసభ్యుల పేరిట రిజిస్ట్రేషన్లు సాగించారు. అందులో ఎమ్మెల్యేలతో పాటు వారి సతీమణుల పేరిటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ల సాగించారు.
"అవన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశాం. వాటికి పక్కా రికార్డులు ఉన్నాయి" అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెండు రోజుల కిందట మీడియాకు చెప్పారు. "మా ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఆ వివరాలు ఉన్నాయి" అని కూదా ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా...
ఎంపీ మిథున్ పేరిట...
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన దివంగత సోదరుడు భాస్కరరెడ్డి సతీమణి ఇందిరమ్మ పేరిట నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల జరిగాయని పులిచెర్ల మండలం ముల్లంగివారిపల్లికు చెందిన టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ రెవెన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియాకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
"పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం సర్వే నెంబరు 295/1ఏలో 15 ఎకరాలు మాజీమంత్రి పెద్దిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.
సర్వే నెంబరు 295/1సీలో 21ఎకరాలు ఎంపీ‌ మిథున్‌రెడ్డి పేరిట, సర్వే నంబర్ 296/1వీ.లో 18.94ఎకరాలు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది" అని టీడీపీ నేత ముల్లంగి వెంకటరమణ ఫిర్యాదు చేశారు.
"మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే సోదరుడు పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్య ఇందిరమ్మ పేరుతో పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలోని సర్వే నంబర్ 296/1ఏలో 9.11 ఎకరాలు, 295/1బీలో 10.8 ఎకరాలు, 295/1డీలో 89సెంట్లు రిజిస్ట్రేషన్ జరిగింది" అని ముల్లంగి వెంకటరయణ ఫిర్యాదు చేశారు. ఇవి మచ్చకు కొన్ని మాత్రమే...

క్షేత్రస్థాయిలో పరిశీలన
సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధమైన రికార్డుల్లో సర్వే చేసిన భూముల రికార్డులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో రోజుల తరబడి మదనపల్లెలో మకాం వేసిన రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు.
మదనపల్లి మండలం వెంకటప్పకోట గ్రామంలో మ్యాపింగ్ చూసి సర్వే రాళ్లను పరిశీలించారు. అనంతరం సీటీఎం-1 గ్రామ సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేసారు. అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎల్ఆర్ రిజిస్టర్, అడంగల్, ఆర్ఓఆర్ 1(బి), 10(1) డిజిటల్ సర్వీసులకు సంబంధించిన రికార్డులను ఎలా నమోదు చేస్తున్నారో.. సిబ్బంది నుంచి తెలుసుకున్నారు.


బాధితులకు న్యాయం చేస్తాం...
రికార్డులు కాలిపోయిన సంఘటన రాష్ట్రంలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. భూములు కోల్పోయిన బాధితులతో స్వయంగా మాట్లాడాలనిచేసిన ప్రయత్నంలో ఊహించని విధంగా వందలాది మంది రావడం చూసి ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు. వారందరి కోరికతో ఆయన ఆరుబయటే ఫిర్యాదులు స్వకరించారు. గురువారం నుంచి రెండు రోజుల పాటు దాదాపు 600 మందికి పైగానే ఫిర్యాదులు అందించినట్లు తెలుస్తోంది.
"గత మూడేళ్లలో ఫ్రీహోల్డ్ అయిన దాదాపు రెండు లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో 4,500 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగింది" అని ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా మీడియాకు చెప్పారు.

గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తాం అని చెప్పగానే భారీగా బాధితులు వచ్చారు. సుమారు 600 మంది వినతిపత్రాలు సమర్పించారు. జబర్దస్తీతో భూములు స్వాధీనం చేసుకున్నట్లు ఫిర్యాదలు అందాయి. "వారందరికీ న్యాయం చేస్తాం. కోర్టు వివాదాలు ఉన్న వాటికి సంబంధించి ఆలస్యం కావచ్చు" అని స్పష్టం చేశారు. "దగ్ధమైన రికార్డులను రిట్రీవ్ చేస్తాం" అని స్పష్టం చేశారు.
" బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను వేర్వేరు చేసి ప్రభుత్వానికి పంపారు" అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. అక్కడి నుంచి తదుపరి ఆదేశాలు అందాలి అయన అన్నారు.
గత ఐదురోజులుగా పోలీసుల అదుపులో ఉన్న పూర్వపు ఆర్డీఓ మురళీ, బదిలీ అయిన ఆర్డీఓ హరిప్రసాద్, సీసీ మణి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్, వీఆర్ఏ (కాపలాదారు) రమణయ్యను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని సమాచారం సేకరిస్తుండగా, రెవెన్యూ, పోలీస్, సీఐడీ, ఫోరెన్సిక్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్, ఫైర్, ట్రాన్స్‌కో అధికారుల బృందాలచే విచారణ ముమ్మరం చేశాయి. ఈ దర్యాప్తును మొదటిరోజు నుంచి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మొత్తానికి రెవెన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా ప్రయోగించిన అస్త్రం ఫలించింది. దిగువస్థాయి సిబ్బంది కాకుండా, స్వయంగా ఆయనకే ఫిర్యాదుల అందాయి. అన్యాక్రాంతం అయిన భూముల వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తులో ఇవి ఎలా వినియోగిస్తార? బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందనేది వేచిచూడాలి.
Read More
Next Story