
తిరుచానూరు అమ్మవారి ఆలయ బంగారు శిఖరాన్ని శుద్ధి చేస్తున్న టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం, అధికారులు.
శ్రీవారి పట్టపురాణి ఆలయానికి బ్రహ్మోత్సవ మెరుగులు
పద్మావతీ అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు పద్మావతీ అమ్మవారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరమంజనం నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి వారం రోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పది రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఆలయంలో అన్ని ప్రదేశాలను మరింతగా శుభ్రం చేస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. ఆ తరువాత సుగంధ పరిమళాలు వెదజల్లే విధంగా పవిత్ర జలాలతో ఆలయ గోపురం, ప్రాకారం, గోడలపై ప్రత్యేకంగా జలాలు వెదజల్లారు. ఈ పవిత్ర జలాల తయారీకి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో పవిత్రజలాన్ని సిద్ధం చేస్తారు. అరంతరం ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఈ కార్యక్రమానికి టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కెవి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్వో ఎం. రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు హాజరయ్యారు.
10 పరదాలు అమ్మవారికి బహుకరణ
పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గర్భగుడి వద్ద అమర్చడానికి అవసరమైన ఏడు పరదాలు యాత్రికులు మంగళవారం సమర్పించారు. హైదరాబాద్ కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలు అందించారు. తిరుపతికి చెందిన మణి మూడు పరదాలను ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాథ్, అర్చకులు బాబుస్వామికి అందజేశారు. ఈ పరదాలను అమ్మవారి గర్భాలయంలో అలంకరించనున్నారు.
మరో తమిళనాడుగా తిరుచానూరు..
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు తరలిరావడం ప్రత్యేకత. వారికి మించి తమిళనాడు నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. బ్రహ్మోత్సవాల ముగింపు రోజు అమ్మవారి ఆలయం సమీపంలో పద్మపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులు హాజరు కావడం ఓ ప్రత్యేకత. అమ్మవారి వాహనసేవలో పాల్గొనడం అనడం కంటే, పల్లకీమోయడానికి తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయం నుంచి శ్రీవైష్ణవులు ప్రత్యేకంగా తరలి వస్తారు. వివిధ స్థాయిల్లో ఉన్నతోద్యోగాలు చేసే వారంతా సెలవు తీసుకుని శ్రీరంగం నుంచి తిరుచానూరుకు తరలివస్తారు.
వాహన సేవలు ఇలా..
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ షెడ్యూల్ నిర్ణయించింది. వాహనసేవల వివరాలు కూడా ప్రకటించారు. రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఆ సమయంలో పద్మావతీ అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
18-11-2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
19-11-2025 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
23-11-2025 (ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
నవంబర్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు.
Next Story

