
ప్రభుత్వ ఆఫీసులో చిందిన రక్తం ఎవరిది.. అవి పాదాల గుర్తులేనా?
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం ఉపాధి హామీ కార్యాలయంలో కలకలం.
ప్రభుత్వ కార్యాలయ గది రక్తంతో తడిసింది. కాలిగుర్తులు ఉండడం కలకలం రేకెత్తించింది. ఇంతకీ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని ఉపాధి కార్యాలయం గదిలో ఏమి జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. బి. మఠం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఉపాధి కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం మొదటి అంతస్తులో ఉంది. మంగళవారం విధులు ముగించుకున్న సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఉపాధి కార్యాలయంలో శుభ్రం చేయడానికి స్వీపర్ రవికుమార్ బుధవారం ఉదయం తలుపులు తెరిచారు. గదిలో కనిపించిన దృశ్యం చూసి స్వీపర్ భయపడిపోయారు. తలుపులు తెరవగానే, టైల్స్ పై రక్తంతో తడిసి ఉండడం కనిచింది. అందులో పాదముద్రలు కూడా ఉండడం గమనించిన స్వీపర్ ఆందోళన గురయ్యారు. వెంటనే ఈ సమాచారం అధికారులకు తెలిపారు. పరిశీలించిన అధికారులు ఈ ఘటనపై సమాచారం ఇవ్వడంతో బ్రహ్మంగారిమఠం ఎస్సై శివప్రసాద్ రంగంలోకి దిగారు. పోలీసు సిబ్బంది కూడా ఉపాధి కార్యాలయంలోని గదిని పరిశీలించారు. రక్తంపై పడిన పాదముద్రలు చెదిరిపోకుండా పోలీసులు జాగ్రత్తలు పాటించారు. కార్యాలయంలోని టేబుల్లు, కిటికీల వద్ద ఆధారాల కోసం పరిశీలించారు.
"మంగళవారం సాయంత్రం విధులు ముగించుకున్న తర్వాత తాళాలు వేసి వెళ్లాను"అని ఉపాధి కార్యాలయం వాచ్మెన్ రవికుమార్ చెబుతున్నారు.. బుధవారం ఉదయం వచ్చి తలుపులు తెరువగానే రక్తపు చారలు కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చాను" అని రవికుమార్ చెబుతున్నారు.

