BC leader letter to cm | టీటీడీకి భారీ విరాళం ఆఫర్ ఇచ్చిన బీసీ నేత
x

BC leader letter to cm | టీటీడీకి భారీ విరాళం ఆఫర్ ఇచ్చిన బీసీ నేత

టీటీడీకి 20 మిల్క్ డెయిరీలు ఏర్పాటు చేయిస్తా. "తిరుమల డెయిరీ" ఏర్పాటుపై విధానం ప్రకటించండి. అని బీసీ నేత సీఎంకు లేఖ రాశారు.


టీటీడీకి వెయ్యి ఆవులు ఓ దాత ఆఫర్ ఇచ్చారు. గోశాల ఏర్పాటుకు స్వార్జితం 22 ఎకరాలు రాసిస్తా అని ప్రకటించారు. రాష్ట్రంలో 20 పాలడెయిరీల ఏర్పాటుతో పాటు తానే భూమి కూడా సేకరించి, అందిస్తానని ఓ బీసీ నేత టీటీడీకి, సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించారు. దీనిపై స్పందన తెలపాలని ఈ బీసీ నేత కోరారు. "మీరు పిలిస్తే వచ్చి కలుస్తా. నా లేఖకు స్పందించకుంటే ఉద్యమిస్తా" అని కూడా హెచ్చరించారు.

తిరుమల పవిత్రత, పరిరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని బీసీ యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు.
శ్రీవారి సన్నిధిలో లడ్డూ ప్రసాదం తయారీలో శ్రేష్టమైన నెయ్యి వాడండి. దీనికి వెయ్యి గోవులతో పాటు, 22 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. "తిరుమల డైయిరీపై మీ నిర్ణయం ప్రకటించండి" అని సీఎం చంద్రబాబుకు ఆదివారం ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. టీటీడీ విషయంలో సీఎం చంద్రబాబు వైఖరి బాగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే వేయి గోవులు ఇవ్వడంతో పాటు, మరో లక్ష గోవులను సమీకరించే బాధ్యత తీసుకుంటానని గతంలోనే బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ గతంలో ప్రకటించారు. తాజాగా మరో ప్రతిపాదనతో ఆయన సీఎం ఎన్. చంద్రబాబుకు లేఖ రాశారు.

గౌరవ ఏపీ సీఎం
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి..
విషయం: తిరుమలలో డెయిరీ కోసం నా వంతుగా మరింత సహకారం, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు.
మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఆరునెలలు కావస్తోంది.. అరాచక పాలనను అంతం చేసి మీపై అనేక ఆశలు, అంచనాలతో మీకు రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారు.. ఏ ఒక్క అంశంలో కూడా జరిగిన తప్పిదాలను అన్వేషించి, వాటిపై శాశ్వత పరిష్కారాలు చూపుతారనుకుని ఆశించిన వారిలో నిరాశే ఎదురయ్యింది.. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో జరిగిన అపచారం, తప్పిదాలli మీరే స్వయంగా బయటపెట్టారు.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి, కోట్లాది మంది భక్తుల్లో అనుమానాలు ఎదురైన తరుణంలో ఈ అంశంపై ఒక స్పష్టత లేకుండా ప్రభుత్వg, ప్రధాన మీడియా పక్కన పెట్టడం బాధాకరమైన అంశం. కేవలం సీఐడీ లేదా సీబీఐ విచారణ మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం కాదు..!
మాటకు కట్టుబడి ఉన్నా..
తిరుమలలో పెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించాను. మీకు గతంలోనే లేఖను రాశాను.. "వేయి గోవులు నేను ఉచితంగా ఇవ్వడంతో పాటూ, లక్ష గోవులకు సమీకరించే బాధ్యతను తీసుకుంటానని ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల సమక్షంలోనూ, మీకు లేఖ రూపంలోనూ తెలియజేశాను.. ఈ డెయిరీ ఏర్పాటు ద్వారా "తిరుమల పవిత్రత, ఆర్ధిక అవకాశాలు, సామజిక లాభాలు, పూర్తి ప్రణాళికలు అన్ని రకాలుగా మీకు ఇప్పటికే వివరించడం జరిగింది. ఈ అంశంపై మిమ్మల్ని ఒకసారి నేరుగా కలిసి మాట్లాడడానికి నేను ప్రయత్నించినప్పటికీ మీరు సమయం ఇవ్వలేదు. తిరుమల అంశం తెరమీదకు వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ, అనేక మంత్రివర్గ సమావేశాల్లో కానీ దీనిపై ఏ మాత్రం చర్చించలేదు. నూతన బోర్డు కూడా అసలు దృష్టి పెట్టలేదు. సోషల్ మీడియా సహా అనేక ఇతర అంశాలపై చర్చించడానికి సమయం తీసుకుంటున్న మీరు.. స్వయానా మీరే లేవనెత్తిన అంశంపై ఎందుకు అలక్ష్యంగా ఉంటున్నారు. మీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వారు కూడా దీక్షలు, పాదయాత్రలు చేసినప్పటికీ దీనిపై అసెంబ్లీలో ఇసుమంత కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరం! మరోసారి చెప్తున్నాను.
"తిరుమలకు సొంత డెయిరీ ఏర్పాటు నూటికి నూరు శాతం సాధ్యం. దీనిపై ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలు, అన్నిటినీ నేను వివరించాను, మరోసారి వివరించడానికి సిద్ధంగా ఉన్నాను..!
ఇది నా మరో ప్రతిపాదన
ఒకేచోట లక్ష గోవులతో డెయిరీ ఏర్పాటు కష్టం అని మీరు భావిస్తే.. ఆ ఉద్దేశం మీలో లేకపోతే దీనిపై మరో ప్రత్యామ్నాయ మార్గం ఉంది.
"టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో అయిదు వేలు గోవులకు ఒక డెయిరీ చొప్పున మొత్తం లక్ష గోవులను పెంచేలా 20 డెయిరీలను ఏర్పాటు చేయవచ్చు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కూడా రైతులకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ ప్రణాళిక ప్రకారం జిల్లాల వారీగా డెయిరీల ఏర్పాటుకి మీరు సిద్ధమైతే..

"చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయే డెయిరీ పుంగనూరు ప్రాంతంలో చేయడానికి ఇక్కడి ప్రాంతం పూర్తి అనుకూలం, రైతులకు కూడా ఉపయోగంగా ఉంటుంది" ఇక్కడ ఏర్పాటు డెయిరీ ఏర్పాటుకు నా స్వార్జితం 22 ఎకరాల మామిడి తోట తిరుమల సేవతో గోశాల కోసం ఉచితంగా రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దీంతో పాటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా 20 డెయిరీల ఏర్పాటు కోసం అవసరమయ్యే భూ సేకరణ బాధ్యతను నేనే తీసుకుంటాను. దీనిలో ఎటువంటి రాజకీయ, స్వార్ధ, వ్యాపార కోణాలు కాకుండా కేవలం తిరుమల పవిత్రత మాత్రమే ఆలోచిద్దాం. ఆ దిశగానే అడుగులు వేద్దాం.

"స్వామివారి పవిత్రత కోసం, పరిరక్షణ కోసం వేయి గోవులను, 22 ఎకరాల భూమిని తిరుమల కోసం నేను ఉచితంగా ఇస్తాను.. మిగిలిన గోవుల, భూ సేకరణ బాధ్యతలు కూడా నా నెత్తినే వేసుకుంటాను.. మీరు మీ తరపున ఒక్క నిర్ణయం తీసుకోండి.. దీనిపై మరింతంగా మాట్లాడాలంటే నేను మీతో కలిసి నేరుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయం కోసం ఇంకొన్నాళ్ళు వేచి చూస్తాను.. మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే నా తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆ లేఖలో ప్రస్తావించారు.
టీటీడీకి తిరుపతిలో గోశాల ఉంది. పలమనేరు వద్ద కూడా ఓ గోశాల నిర్వహిస్తున్నారు. తిరుమలకు సొంత డెయిరీ ఉండాలనే ప్రతిపాదనతో బీసీవై పార్టీపై లేఖకు సీఎం చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.
Read More
Next Story