CM Public Court | తిరుపతి : బైరాగిపట్టెడ దుర్ఘటనపై సీఎం ప్రజాకోర్టు
టిటిడి అధికారులు, కలెక్టర్, ఎస్పీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బహిరంగంగానే వారిని దుమ్ము దులిపారు.
తిరుపతి ఘటనపై సీఎం ఎన్ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బహిరంగంగానే జిల్లా కలెక్టర్ సహా అధికారులందరినీ ఉతికి ఆరేశారు. ఆరుగురు మరణానికి కారణమైన సంఘటన జరగకుండా ఎందుకు తీసుకోలేకపోయారంటే తీవ్రస్థాయిలో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం యాత్రికులకు టికెట్లు జారీ చేయడానికి తిరుపతిలో టిటిడి ఎనిమిది ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్ సమీపంలోని పద్మావతి పార్కు వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 43 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
తిరుపతిలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తొక్కిసలాట జరిగి యాత్రికులు మరణించిన బైరాగిపట్టెడని హైస్కూల్ వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్ తో పాటు, గంటల తరబడి చిక్కుకుపోయి యాత్రికులు యాతన పడిన పార్కును కూడా ఆయన పరిశీలించారు.
అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం
ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావును బహిరంగంగానే ప్రశ్నలతో ఉతికేశారు.
"ఒక బాధ్యత తీసుకున్న తర్వాత సక్రమంగా నిర్వర్తించలేరా? ఈ సంఘటన జరగడానికి బాధ్యులు ఎవరంటూ" సీఎం చంద్రబాబు టిటిడి ఈవో శ్యామలరావును నిలదీశారు.
"యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. వచ్చిన విషయం కూడా గమనించారు. అయినా త్వరగా టికెట్లు జారీ చేయడంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు" అని అధికారులను ప్రశ్నించారు. యాత్రికుల ప్రాణాలను కాపాడడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని కూడా సీఎం చంద్రబాబు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ వెంకటేశ్వర్ పై తీవ్రంగా మండిపడని సీఎం చంద్రబాబు
ఏమి చేయాలి? ఇలా చేయాలి? అనే విషయాలు మీకు తెలియవా? అని టిటిడి ఈవో శ్యామలరావును నిలదీశారు.
ఇకపై తీసుకోవడం ఏంటయ్యా? సంఘటన జరిగిపోయిన తర్వాత. నష్టం జరిగిన తర్వాత ఏం చేస్తారు?మీరు ఏమి చేశారని సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనానికి యాత్రికులు అనుమతించేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా టికెట్టు జారీ చేసిన విషయాన్ని ఈవో శ్యామలరావు వివరించే ప్రయత్నం చేశారు.
"ఉండవయ్యా.. ఎవడో ఏదో చేశాడు. అదే కొనసాగించాలని ఏమి ఉంది" సమస్యకు ఆస్కారం లేకుండా. యాత్రికుల ఇబ్బంది లేకుండా మార్పులు చేసి పగడ్బందీ చర్యలు తీసుకోలేరా? ఇంత నష్టం జరిగాక ఏమి చేయాలనుకుంటున్నారు" అని సీఎం చంద్రబాబు ఆగ్రహంగా అన్నారు. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని టిటిడి ఈవో శ్యామలరావును సీఎం చంద్రబాబు బహిరంగంగా నిలదీశారు.
తిరుపతి డీఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పడానికి ప్రయత్నించగా, ఇచ్చారా.. అయితే ఆదేశం చూపించండని నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేని స్థితిలో ఈఓ శ్యామలరావు దగ్గరే ఉన్న ఎస్పీ సుబ్బారాయుడు వైపు చూశారు. బాధ్యులైన అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనేది తనకు నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుని ఆదేశించారు.
ఐదేళ్లుగా..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు రెండు రోజులకు బదులు గత ఐదేళ్ల నుంచి పది రోజులు పాటు తెరిచి ఉంచుతున్నారు. 2019 నుంచి ఈ తరహా పద్ధతిని మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి అమలు చేశారు. ఆశించిన సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని ఈ పద్ధతిని ఐదేళ్లుగా అమలు చేస్తున్నారు. దీనికోసం తిరుపతిలో ప్రత్యేకంగా కేంద్రాలను కూడా ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఏర్పాటు చేస్తున్నారు.
ఆ రోజులను ప్రస్తావించకుండా..
ఈ విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు మారుతున్న పరిస్థితి, యాత్రికులకు ఇబ్బంది లేకుండా మార్పులు ఎందుకు చేయలేకపోయారనే విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావుపై విరుచుకుపడ్డారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసిన పద్ధతిని ఈఓ వివరించే సమయంలో సీఎం చంద్రబాబు తీవ్రంగానే స్పందించారు.
మీరేమి చేశారమ్మా....
టీటీడీ జేఈవో గౌతమి పై అంతకుముందు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ కేంద్రాలను సమన్వయం చేసేది మీరేనా? వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారా? దుర్ఘటనపై మీకు ఎప్పుడు సమాచారం అందింది?" అని టిటిడి జెఈఓ గౌతమి పై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
"మీరేం చేస్తున్నారు. సంఘటనపై మీకు ఎప్పుడు సమాచారం అందింది. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు తీసుకుని ఎందుకు సమన్వయం చేయలేకపోయారు" అని సీఎం చంద్రబాబు నిలదీశారు. Jeo గా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తు లేదా? అధికారులకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలేదా? బాధిత భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా ఏమి చేశారు" అని జేఈవో గౌతమి పై ప్రశ్నల వర్షం కురిపించారు.
తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం పై సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఘటనా స్థలాన్ని అణువణువు అధికారులతో కలిసే పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా, టీటీడీ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతికి దిగొచ్చిన ప్రభుత్వం
తిరుపతి సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతికి దిగి వచ్చింది. సీఎం చంద్రబాబుకు ముందు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అనేక మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దలు తిరుపతికి తరలివచ్చారు.
తిరుపతి బైరాగి పట్టెడ హైస్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలు రుయా, సిమ్స్ మార్చురీలో ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు అక్కడ మృతుల బంధువులను పరామర్శించారు. ఈ రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించి మాట్లాడారు.
"గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించండి" అని రుయా, స్విమ్స్ వైద్యాధికారులను సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు కూడా వేరువేరుగా సందర్శించినప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
కుట్ర కోణంలో దర్యాప్తు
"తిరుపతి దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక అందింది" అని రాష్ట్ర హోం మంత్రి వనపూడి అనిత మీడియాకు చెప్పారు. "ఈ ఘటన వెనక కుట్ర కోణం ఉందా? యాదృచ్ఛికంగా జరిగిందనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది" అని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. "జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరైనా సరే. వదిలేది లేదు. చర్యలు తీసుకుంటాం" అని హోం మంత్రి హెచ్చరించారు.
రెండు కేసులు నమోదు
తిరుపతి తొక్కిసలాటలో యాత్రికులు మరణించడం, 43 మంది గాయపడిన సంఘటనపై రెండూ కేసులు నమోదయ్యాయి. బైరాగి పట్టడం సమయపురం పద్మావతి పార్కు వద్ద జరిగిన దుర్ఘటనపై నారాయణపురం తహసిల్దార్ ఫిర్యాదు చేశారు. విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కేసేలాట్లో గాయపడిన సంఘటన పైన బాలాయపల్లె తాసిల్దార్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ రెండు సంఘటనలపై వేరువేరుగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన జరగడానికి దారి తీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరుపనున్నట్లు సీఎం చంద్రబాబుతో పాటు, మంత్రులు కూడా ప్రకటించారు.
Next Story