అప్పులోడి గుండె కరక్కపోతే ఆటోవాలా ఆదుకున్నారు!
x

అప్పులోడి గుండె కరక్కపోతే ఆటోవాలా ఆదుకున్నారు!

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆటో డ్రైవర్ కుమార్తెకు సహచరులు కంటికి రెప్పలా నిలిచారు. ఆ బాలిక చదువుకయ్యే ఖర్చు భరిస్తానని ఓ దాత ముందుకు వచ్చారు.


రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దంపతులు తుది శ్వాస విడిచారు. ఆ దంపతులకు రెండేళ్ల చంటిబిడ్డ ఉంది. ఆ పసికందును చూసిన తరువాత కూడా ఫైనాన్సర్లు జాలి చూపలేదు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ ఆటో డ్రైవర్ చిత్తూరు జిల్లాలో సైకిల్ యాత్ర చేసి రూ.1.60 లక్షలు పోగు చేశారు. 11 సంవత్సరాల తర్వాత అప్పట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.60 లక్షలు 9వ తరగతి చదువుతున్న ఆ బాలిక రెడ్డి హర్షిత, అమ్మమ్మ, అత్తకు గురువారం నగదు అందించారు. దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, స్పందించి 103 మంది సభ్యుల జేబు నుంచి తక్షణమే సాయం అందించే వ్యక్తిత్వం కలిగిన సుదర్శన్ ఆటో సంఘం మానవీయ కోణం ఇది. మానవత్వానికి ప్రతిరూపం గా నిలిచి ఆదుకున్న సంఘటన పూర్వాపరాలను పరిశీలిద్దాం.

11 ఏళ్ల కిందట..

2013లో చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు వద్ద ఓ వాహనం ఢీకొనడంతో పాలమంద గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సిద్దయ్య, లక్ష్మీదేవి మరణించారు. వారి కుమార్తె నెలల పసికందు హర్షిత అనాథగా మిగిలింది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సిద్దయ్య తల్లి, బంధువులు అక్కడికి చేరుకొని గుండెలవిసేలా రోధించారు. వారి అంతిమయాత్ర కార్యక్రమాలు ముగిసిన తర్వాత, కొద్ది రోజుల అనంతరం పసికందు హర్షితను చంకన వేసుకొని అమ్మమ్మ నిర్మల.. తిరుపతిలోని ఆటో ఫైనాన్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆటో కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణంపై రాయితీ ఇవ్వడానికి, బాధితురాలు తీసుకోవడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఆటో డ్రైవర్ల ద్వారా ఈ సమాచారం తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుదర్శన్ సంఘం నాయకులకు తెలిసింది. వెంటనే వారంతా రంగప్రవేశం చేశారు.

సైకిలో తిరుగుతూ విరాళాల సేకరణ

రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మీదేవి, సిద్దయ్య దంపతుల నెలల పసికందు హర్షిత ఆమె అమ్మమ్మ దీనస్థితిని చూసిన ఐఎస్. ఖాజా చలించిపోయారు. హర్షిత అమ్మమ్మకు ధైర్యం చెప్పిన ఆయన.. సైకిల్‌కు హుండీలు ఏర్పాటు చేసుకొని తిరుపతి నుంచి చిత్తూరు అక్కడి నుంచి మదనపల్లి మళ్లీ తిరుపతికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ప్రతి ఆటో స్టాండ్ వద్ద సహచర ఆటో డ్రైవర్ల నుంచి ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సుదర్శన్ ఆటో డ్రైవర్ల అందరూ ఆయనకు తమ వంతు ఆర్థిక సహాయం అందించారు.

ఆ మొత్తాన్ని బ్యాంకులో హర్షిత పేరిట ఫిక్స్ డిపాజిట్ చేశారు. ఈ సంఘటనను వివరిస్తూ.. "ఫైనాన్స్ కార్యాలయం వద్ద హర్షిత అమ్మమ్మ పడుతున్న వేదన మమ్మల్ని కదిలించింది. మానవసేవే మాధవ సేవని మేము బలంగా నమ్ముతాం. సైకిల్ పై తిరిగి మా సహచర ఆటో డ్రైవర్ల నుంచి ఒక్క రూపాయి వసూలు చేశాం" అని ఖాజా.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఆ మొత్తం రూ. 2.60 లక్షలు అయిందని ఆయన వివరించారు.

కదిలొచ్చిన ఆటో డ్రైవర్లు

ఒంటరిగా మిగిలిన హర్షిత ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లు జడ్పీ హైస్కూలులో 9వ తరగతి చదువుతోంది. ఆటో డ్రైవర్లు అందించే ఆర్థిక సహాయం తీసుకోవడానికి ఆమె.. తన అమ్మమ్మ, అత్తమ్మతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చింది. "చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ, ఈరోజు నా చదువుకు భరోసా ఇవ్వడానికి ఇంత మంది ఆటో డ్రైవర్లు రావడం అనేది.. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం’’ అని హర్షిత గద్గద స్వరంతో వ్యాఖ్యానించింది.

‘‘ఆటో అంకుల్స్ కష్టం వృధా కానివ్వను. బాగా చదివి డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. రోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రులను కోల్పోయాను అని కాస్త ఊహ తెలిశాక చెప్పారు. ఇలాంటి కష్టం ఎవరికి రాకుండా అత్యవసర చికిత్స అందించడానికి డాక్టర్ కావాలనుకుంటున్నా" అని హర్షిత వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లు అందించిన ఆర్థిక సహాయం రూ. 2.60 లక్షలు హర్షితకు అందించారు. ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు హాజరయ్యారు. చదువులో చురుగ్గా ఉన్న హర్షితకు దాతలు మరింత సాయం అందిస్తే, ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని ఆటో డ్రైవర్లు అభిప్రాయపడ్డారు.

Read More
Next Story