Exclusive | నక్సల్స్ కు మరో ఎదురు దెబ్బ?
x

Exclusive | నక్సల్స్ కు మరో ఎదురు దెబ్బ?

తృటిలో మరో ఎన్ కౌంటర్ తప్పిందా?. తెలంగాణ సరిహద్దు బీజాపూర్ వద్ద శిక్షణా శిబిరంపై దాడి నేపథ్యంలో నక్సల్స్ తప్పించుకున్నారని సమాచారం.


మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర బలగాలు ఉక్కు పాదం మోపినట్లు వాతావరణం కనిపిస్తోంది. భారీ ఎన్కౌంటర్ లో 20 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. తాజాగా,తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు సమాచారం. బుధవారం ఈ ఘటన జరిగినట్లు మీడియాలో వార్తలు వెలవడ్డాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లా భట్టిగూడ అడవిలో సాయుధ భద్రతా బలగాలు గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా భట్టిగూడా అటవీ ప్రాంతంపై సాయుధ భద్రతా బలగాలు దాడికి దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు నిలబడ్డాయి. ఈ అడవిలో నక్సల్ శిక్షణ శిబిరం పైన భారీగా భద్రతా బలగాలు దాడి చేయనున్నాయని పసిగట్టిన మావోయిస్టులు పారిపోయారని తెలిసింది. శిక్షణ శిబిరం వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారకస్థూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేసినట్లు తెలుస్తోంది.

భట్టిగూడ అటవీ ప్రాంతంలో ఆ జిల్లా పోలీస్, సిఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు సమాచారం. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు పరారీ అయినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి భారీ నష్టం జరగకుండా మావోయిస్టు పార్టీ కార్యకర్తలు తృటిలో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో విశాలంగా ఉన్న మైదానంలో మావోయిస్టులు రేకులషెడ్డు ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే ప్రదేశంలో అమరవీరుల స్మారక స్థూపం కూడా నిర్మించారు. శిక్షణా శిబిరానికి భారీగానే మావోయిస్టులు హాజరైనట్లు అక్కడి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. హాల్ కు సమీపంలోనే పెద్ద వాట్ టవర్ కూడా వీడియోలో కనిపించింది. ఇక్కడ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు దాడులకు సిద్ధంగా తరలివచ్చాయని తెలుస్తోంది. వారి రాకను పసిగట్టిన మావోయిస్టులు శిక్షణా శిబిరం నుంచి పారిపోవడంతో వారి కోసం సాయుధ బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు వీడియోలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా..
నక్సల్స్ కు భారీ దెబ్బ
ఛత్తీస్ ఘడ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో గరియాబంద్ జిల్లా మెయిన్ పూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కులహరి ఘాట్ అటవీప్రాంతంలో సోమవారం నుంచి రెండు మూడు రోజుల కిందట జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఒడిస్సా రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మరణించినట్లు భద్రతా బలగాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనపై రెండు రాష్ట్రాల్లో అనేక కేసులతో పాటు కోటి రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు వార్తలు నిలబడ్డాయి.
ముమ్మరంగా గాలింపు
ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో ని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్ ఘడ్ కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బలగాలు సుమారు 1000 మందికి పైగానే ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో రామచంద్ర రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి తో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఛత్తీస్ ఘడ్, ఒడిశా, ఆంధ్ర సరిహద్దులోని దండకారణ్యం లో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మట్టుపెట్టాలనే లక్ష్యంగా కేంద్ర హోం శాఖ నిర్ణయానికి అనుగుణంగా భద్రతా బలగాలు అవిశ్రాంతంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా..
తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లా బట్టి కూడా అడవిలో భారీగా సమావేశమైన నక్సల్స్ శిక్షణ శిబిరం పై కూడా భద్రతా బలగాలు దాడి చేసేందుకే ముందు కదిలినట్లు తెలుస్తోంది. ఒకపక్క భారీగా భద్రత బలగాలు గాలింపు చర్యలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా మావోయిస్టులు శిక్షణ శిబిరం నిర్వహించడానికి సన్నద్ధం కావడం సాహసోపేతమే. ఇక్కడ సాగిస్తున్న గాలింపు చర్యలు, పరిణామాల పూర్తి సమాచారం తెలియలేదు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలైతే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లే కనిపిస్తోంది.
Read More
Next Story