
తిరుమలలో యాత్రికుల కదలికలను ఐఏ ద్వారా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిశీలిస్తున్న టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి
తిరుమలలో యాత్రికులను నడిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ప్రశాంతంగా సాగుతున్న శ్రీవారి దర్శనాలతో కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశాలు కల్పించడంలో టీటీడీ ముందస్తు కార్యాచరణ ఫలించింది. రద్దీని అంచనా వేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) కమాండ్ కంట్రోల్ సెంటర్ ( command control center) కీలకపాత్ర పోషించింది. అధికారులు కూడా కలవరం నుంచి తేరుకున్నారు. దీనికి తోడు..
జనవరి ఒకటో తేదీ సాయంత్రం (గురువారం) నుంచే సామాన్య యాత్రికులకు శ్రీవారి దర్శనం దక్కింది. శుక్రవారం ఉదయం నుంచి పది కిలోమీటర్లు విస్తరించి ఉన్న క్యూలోకి వచ్చిన యాత్రికులకు మూడు నుంచి ఐదు గంటల్లో దర్శనం కల్పించడం ఓ రికార్డు. కాగా, కైంకర్యాలు రద్దు చేయడం వల్ల సాయంత్రం ఆరు గంటలకే 50 వేల మందికి పైగానే యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రికి ఈ సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉన్నందున మరో రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమలలో శుక్రవారం శ్రీవారికి కైంకర్యాలు నిర్వహణకు కొన్ని గంటల సమయం పడుతుంది. దీనివల్ల సాధారణ రోజుల్లో 64 వేల నుంచి 65 వేల మందికి దర్శనాలు కల్పించడం సాధ్యం అవుతుంది. ఈ రోజు (జనవరి రెండో తేదీ) మాత్రం సాయంత్రానికే ఆ సంఖ్య 50 వేల మందిని దాటిందని టీటీడీ అధికారులు చెప్పారు.
మూడు రోజులు.. 1.77 లక్షల మందికి దర్శనం
తిరుమలలో మొదటి మూడు రోజులు (2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు) ఈ డిప్ ద్వారా టోకెన్లు తీసుకున్న వారిలో 1,77, 332 మంది యాత్రికులు శ్రీవారు, వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. జనవరి ఒకటో తేదీకి ఈ డిప్ (E- Dip) టోకెన్లు తీసుకున్న వారిలో పది వేల మంది రాకపోవడం వల్ల వారి స్థానంలో గురువారం సాయంత్రం నుంచే సామాన్య యాత్రికులకు ముందుగానే దర్శనం దక్కింది.
తిరుమలలో శుక్రవారం కైంకర్యాలు రద్దు చేయడం వల్ల ఉదయం నుంచే పది కిలోమీటర్ల వరకు ఉన్న ఎంట్రీ పాయింట్ నుంచి యాత్రికులు క్యూలోకి ప్రవేశించారు. దీంతో సాయంత్రం ఆరు గంటలకే 50 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంఖ్య 80 వేల మందికి దాటితే సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది.
"టీటీడీ తీసుకున్న చర్యలు. ముందస్తు ప్రణాళిక, పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు" అనుకూలించాయని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.
కలవరం తీరింది..!
తిరుమలలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల నుంచి ప్రస్తుతం జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనాల వరకు టీటీడీ, తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసింది. తిరుమలలో 2024 జనవరి తొమ్మిదవ తేదీ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు జారీకి తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వాటిలో బైరాగిపట్టెడ, టీటీడీ యాత్రికుల వసతి సముదాయం వద్ద కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం, 40 మంది వరకు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీటీడీ జేఈఓ గౌతమి, సీవీఎస్ఓ శ్రీధర్, ప్రస్తుత తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడును బదిలీ చేశారు. డీఎస్పీ రమణకుమార్ (క్రైం), టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది నెలల తరువాత మళ్లీ తిరుపతి జిల్లాకు ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు నియమితులయ్యారు.
తిరుమలలో గత ఏడాది నాటి సంఘటనలు పునరావృతం కాకుండా అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. 1,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 2000 మంది పోలీసులతో ఎస్పీ సుబ్బారాయుడు బందోబస్తు ఏర్పాటుతో పాటు సీనియర్ పోలీసు అధికారులను సెక్టోరల్ అధికారులుగా పర్యవేక్షణకు నియమించారు. గతానికి భిన్నంగా ఈడిప్ పద్ధతిలో టైంస్లాట్ టోకెన్లు కేటాయించిన పద్ధతి కూడా క్రౌడ్ కంట్రోల్ మేనేజిమెంట్ (Crowd control management) కు కలిసి వచ్చింది.
నాలుగు గంటల్లో దర్శనం...
తిరుమలలో రద్దీ పెరిగితే శ్రీవారి దర్శనానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం కూడా పట్టేది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో గతానికి భిన్నంగా కౌంటర్లు ఏర్పాటు చేయకుండా, ఆన్ లైన్ పద్ధతిలో 2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు టీడీ అధికారులు ఈ డిప్ ద్వారా రోజుకు 60 వేల మందికి దర్శనాలు కల్పించే విధంగా టోకెన్లు కేటాయించింది. తోపులాట, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా సామరస్యంగా వారందరికీ గంట నుంచి మూడు గంటల్లో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలనే సంకల్పం ఫలించింది.
సామాన్యలకు అదే పద్ధతి
తిరుమలలో జనవరి రెండో తేదీ నుంచి సామాన్య యాత్రికులకు దర్శనాలు కల్పించడానికి కూడా టీటీడీ, విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. ఎనిమిదో తేదీ వరకు 164 గంటలు సామాన్య యాత్రికులకు సమయం కేటాయించారు.
తిరుమలలో సామాన్య యాత్రికుల దర్శనాలు ప్రారంభమైన మొదటి రోజే ఉదయం నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి క్యూలోకి అనుమతించారు. తిరుమలలోని పాచికాలువ గంగమ్మ ఆలయం సమీపంలోని ఎంట్రీ పాయింట్ నుంచి క్యూలోకి వస్తే, రింగ్ రోడ్డులోని అక్టోపస్ భవనం సమీపం నుంచి శిలాతోరణం, నారాయణాద్రి ఉద్యానవనం, ఆళ్వార్ ట్యాంకు నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోలోకి యాత్రికులను దర్శనానికి అనుమతించారు ఇంతదూరం కూడా మూడు నుంచి ఐదు గంటల్లో యాత్రికులను ఆలయంలో దర్శనం అనంతరం వెలుపలికి రావడం వెనుక..
ఏఐ నిఘా....
తిరుమలలో తోపులాట, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ముందస్తు కార్యాచరణ పనిచేసింది. తిరుమల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( artificial intelligence) ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ( command control center) నుంచి యాత్రికుల రద్దీపై అంచనా వేశారు. యాత్రికుల కదలికలకలను గమనిస్తూ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచనలు జారీ చేశారు. ఆ మేరకు యాత్రికులను క్యూ నుంచి ముందుకు సాగడానికి మార్గం ఏర్పడింది.
ఏఐ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి యాత్రికుల కదలికలను గమనించారు. యాత్రికులు ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉన్నారు. క్యూలో ఎక్కడ ఖాళీ ఉంది. వారిని ఎటు మళ్లించాలనే విషయాలపై వైర్ లెస్ సెట్ ద్వారా సూచనలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ఆదేశాలు జారీ చేస్తే కాలం గడిపారు. దీనివల్ల తిరుమలలోని అన్ని ప్రదేశాల్లోని క్యూలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా, ముందుకు నడిపించడానికి ఆస్కారం ఏర్పడింది.
సామాన్య యాత్రికులకే ప్రాధాన్యం
"తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి యాత్రికులకు 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నాం" అని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్యచౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని క్యూలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ ను అదనపు ఈఓ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చలికాలం కావడంతో అన్నప్రసాదాలు చల్లబడకుండా మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు, మొబైల్ వాటర్ డ్రమ్స్, అందుబాటులో ఉంచారు. తిరుమలలో యాత్రికులు వెళ్లాల్సిన మార్గాలను సూచిస్త సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
మీడియాతో మాట్లాడినవెంకయ్య చౌదరి ఏమన్నారంటే..
"జనవరి ఒకటో తేదీ సాయంత్రం నుంచే యాత్రికులు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వస్తున్నారు. అదే రోజు రాత్రి నుంచి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాం. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేశాం" అని వెంకయ్య చౌదరి వివరించారు.
4000 వేల మంది శ్రీవారి సేవకులు
తిరుమలలో యాత్రికులకు సేవ చేయడానికి సాధారణంగా 3,500 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఆలయానికి వెలుపలి వరకు విస్తరించిన క్యూ, షెడ్లలోని యాత్రికులకు నాలుగు వేల మందికి పైగానే శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, కాఫీ పంపిణీ చేశారు. వారితో పాటు టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారని టీటీడీ అదపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
తిరుమలలో యాత్రికులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూలోకి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు ఆయన వివరించారు.
Next Story

