
తిరుమల ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మాట్లాడుతున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్..
మారిషస్ దేశాభివృద్ధికి ఏపీనే స్ఫూర్తి...
టీటీడీ సలహాలతో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన ధరమ్ బీర్ గోకుల్..
సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్నఏపీ మారిషన్ దేశాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వెల్లడించారు. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తాము కూడా అచరించడం ద్వారా మారిషస్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
"మా దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు కూడా ఏర్పాటు చేస్తాం" అని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ప్రకటించారు. అతిథులను గౌరవించడంలో భారతీయులు ముందంజలో ఉంటారని ఆయన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో బుధవారం ఉదయం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ఉపాధ్యాయుడిగా మారారు.
"ఉపాధ్యాయుడి నుంచి మారిషస్ దేశాధ్యక్షుడిగా ఎదిగాను." అని వ్యాఖ్యానించారు. టీచర్ గా ఉన్నప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన జ్ణాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. అదే తరహాలోనే వేదపాఠశాల విద్యార్థులతో మాట్లాడి ఆకట్టుకున్నారు.
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని మారిషస్ తిరిగి బయలుదేరడానికి ముందు బుధవారం ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం ఉదయం సందర్శించారు. వేద విజ్ఞాన పీఠం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
వేద పాఠశాలలో పూజలు..
వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీగోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపాన్యాసం చేశారు. వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు.
వేద పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులతో కూడా తరగతి గదిలో బోధించే విధానంలోనే తన భావాలు పంచుకున్నారు.
ఆయన ఏమన్నారంటే..
"నేను అధ్యాపక వృత్తి నుంచి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉంది. ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారరు" అని ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఆయన విద్యార్థులకు సూచనలతో పాటు ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని కూడా గుర్తు చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శింకోవడం మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందన్నారు. వసుదైక కుటుంబకమైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక, సాంప్రదాయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. అతిథులను గౌరవించడంలో, స్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని చెప్పారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. అనంతరం వేద పండితులు మారిషస్ దేశాధ్యక్షుడికి వేదాశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటం అందజేశారు.
Next Story

