ఓట్లకు నోట్ల ప్రవాహం..!
x

ఓట్లకు నోట్ల ప్రవాహం..!

వేసవి ఎండలను తలపించే రీతిలో ప్రచారం జరిగింది. పోలింగ్ ముందే నగదు పంపిణీ ప్రవాహంలా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇందులో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది.


తిరుపతి: ఈ ఎన్నికలు చాలా ఖరీదైనవి. అభ్యర్థులకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత ఎక్కడి నుంచి ఇస్తారబ్బా. మొన్నటిదాకా ఎక్కడ చూసినా ఇదే చర్చ. పోలింగ్ గడువు సమీపించింది. అంతే, పచ్చ నోట్ల ప్రవాహం ఊహించని విధంగా సాగినట్లు చెబుతున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా డబ్బు పంపిణీలో ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది. ప్రతి ఎన్నికలోను వివిధ శాఖల యంత్రాంగం నిఘా ఉన్నప్పటికీ, ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉంటుంది. ఆ కోవలోనే 2024 ఎన్నికల్లో కూడా.. ప్రతి నియోజకవర్గంలో రూ. 80 నుంచి 100 కోట్ల వరకు పంపిణీ జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ లెక్కన 175 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ. వేల కోట్లు ఓటు కోసం విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. లంచం ఇవ్వడం.. తీసుకోవడం ఎంత నేరమో.. ఓటును అమ్ముకోవడం కూడా అంతే నేరం. డబ్బు ఇవ్వడం అంతకన్నా ఘోరం. ఈ మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఇవి చట్టవ్యతిరేక కార్యకలాపాలు. అయితే ఓట్ల వేటలో, ఎవరికి ఎవరూ తీసుపోలేదని చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓట్లను ప్రసన్నం చేసుకోవాలని పోటీలోని అభ్యర్థులు తహతహలాడారు.

ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఎండలను సైతం లెక్కచేయకుండా ఓర్పుగా తిరిగారు. పోలింగ్ గడువు సమీపించిన తర్వాత గ్రామాల్లోనే కాదు. పట్టణాల్లోని కాలనీలు మధ్యతరగతి కుటుంబాల వారు కూడా నోటు కోసం నిరీక్షించారని చెబుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ స్లిప్పులను ఇళ్ల వద్ద బిఎల్వోలు పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆసక్తి చూపని ఓటర్లు.. డబ్బులు పంపిణీ జరుగుతోందని సమాచారం తెలిసి ఓటర్ స్లిప్పుల కోసం డివిజన్ సచివాలయాలు, గ్రామాల్లో పంచాయతీ సచివాలయాలకు పోటెత్తారని ఓ ఉద్యోగి చెప్పారు.

ఓటుకు రూ. 2 వేలు?

ఎన్నికలు అత్యంత ఖరీదైనవని చెబుతున్నట్లే.. ఓటు కూడా అంతే విలువైనదనే విషయం చాలాచోట్ల వెల్లడైందని చర్చించుకుంటున్నారు. ఓటుకు రూ. రెండువేల చొప్పున పంపిణీ చేయడంలో అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎక్కడా రాజీ పడలేదని చర్చ జరుగుతోంది. పల్లెల్లో అయితే ఒక రకం. పట్టణాల్లో పట్టపగలే వీధుల్లో నగదు పంపిణీ జరిగినట్లు అనేకమంది చెబుతున్నారు.

ప్రత్యేక యంత్రాంగం

పోటీలోని అభ్యర్థులు పల్లెలు, పట్టణాల్లోనే పోలింగ్ బూత్ వారీగా ఏజెంట్లను నియమించుకున్నట్టు తెలిసింది. ఓటర్ లిస్టు ఆధారంగా ఆ నివాసంలో ఓటరు ఉన్నారా లేదా నిర్ధారించుకుని, ఆ సమాచారం ఆ నాయకుడికి ఆయన నియమించుకున్న వ్యక్తికి చేరవేసినట్లు చెబుతున్నారు. వార్డువారీగా తాము నియమించుకున్న బాధ్యులకు నగదు అప్పగించి, ఓటరుకు చేరవేయడంలో ఎవరికి వారు రహస్యంగా కార్యకలాపాలు సాగించారని చెబుతున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఈ తతంగమంతా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

రూ. 80 నుంచి 100 కోట్లు

ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు రెండు నుంచి 2.50 లక్షలకు పైబడే ఉన్నారు. పోటీలోని ఇరు పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. రెండు వేలు చొప్పున పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన ఇద్దరు అభ్యర్థులు కూడా 90 శాతం మందికి పంచినా, కేవలం ఒక నియోజకవర్గంలోనే దాదాపు రూ. 80 కోట్ల రూపాయల వరకు పంపిణీ జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే, ఓటుకు నోటు పంపిణీ వంటి కార్యక్రమం సామాజికంగా ఆర్థికంగా ఉన్నతస్థాయిలోని వ్యక్తులు పోటీ చేస్తున్న సెగ్మెంట్లలోనే కాకుండా, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న వారి బాధ్యతను పర్యవేక్షించే పెద్దలు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారనేది ప్రచారంలో ఉంది.

ఓటర్లకు షరతు..!

కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏజెంట్లుగా పనిచేసిన వారు కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. మా పార్టీకే ఓటు వేస్తారా? అయితే, రూ. మూడు వేలు తీసుకోండి అని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తమకు ఈ ఓటు గ్యారెంటీ అని తెలిసిన వీధుల్లో ప్రాంతాల్లో అంతే మొత్తంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నగదు పంపిణీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు అక్కడక్కడ మాటలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోనీ రామచంద్రాపురం మండలంలో నగదు పంపిణీ చేయడానికి వెళ్ళిన ఓ ప్రధాన పార్టీ మద్దతుదారులను వెనక్కి పంపినట్లు సమాచారం.

ఇదే పరిస్థితి కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద కూడా చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. రెండు వేలు ఇస్తే, పంపిణీ చేసే వ్యక్తి ఆ మొత్తంలో తనకోసం రూ. 500 కమిషన్‌గా తీసుకుని పంపిణీ చేసినట్లు పుకార్లు వినిపించాయి. ఈ వ్యవహారాన్ని సొమ్ము చేసుకోవడానికి మరో పార్టీ అధిక మొత్తం పంపిణీ చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తాపత్రయం వల్ల పోటీలోని అభ్యర్థులు జేబులు గుల్ల చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలా అయినా సరే ఎమ్మెల్యే కావాలి. అనేది పోటీలో ఉన్న అభ్యర్థుల పట్టుదల. ఎందుకోసం సర్వశక్తులు ఒడ్డారు. నాయకులను ప్రసన్న చేసుకోవడం. ప్రచారం కోసం, కార్యకర్తలను సమీకరించడం అనే కార్యక్రమాల నిర్వహణలో అయిన ఖర్చును ఏమాత్రం వెనకంజ వేయకుండా వెచ్చించారు.

పోలింగ్ గడువు సమీపించిన వేళ నగదు అనేక చోట్ల కానుకలు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. హీరో పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు నోటు అన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో డబ్బు తీసుకున్నారా లేదా అనేది పక్కకు ఉంచితే ఓటర్లు ఏ అభ్యర్థిని కరుణిస్తారు అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. వారి భవిష్యత్తు వచ్చేనెల మొదటి వారంలో బహిర్గతం కానున్నది. ఇందులో ఓటర్లు ఎవరిని ఆదరించాలని తెలియాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడక తప్పదు.

Read More
Next Story