వారికి ఓట్లు కావాలి.. వారి ఓటు వారు వేసుకోలేరు.!
x

వారికి ఓట్లు కావాలి.. వారి ఓటు వారు వేసుకోలేరు.!

అభ్యర్థులకు అందరి ఓట్లు కావాలి. వారిని ప్రతిపాదించే పార్టీ అగ్రనేతలకు కూడా. వారిలో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేని పరిస్థితి.


తిరుపతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో తుది ఘట్టం పోలింగ్ ఇంకొన్ని నిమిషాల్లో ప్రారంభం కానున్నది. తమ పార్టీలను ఓటుతో ఆదరించాలని వైఎస్ఆర్ సీపీ, టిడిపి, జనసేన, బిజెపి ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీలు పోటీలో నిలిపిన అభ్యర్థులతో పాటు ప్రధాన నాయకులు గెలవడానికి కూడా ఓట్లు అవసరమే. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా!? కొందరి నాయకులు తమకు కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇదేంటి విడ్డూరంగా ఉందనుకుంటున్నారా!? ఇది నిజమే. ఆ విషయం ఏంటో చూసొద్దాం రండి.

బాబు ఓటు వేసుకోలేరు..!

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లె స్వగ్రామం. ఆయనను కుప్పం ఓటర్లు ఓటు వేసి గెలిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన ఓటు ఆయనకు వేసుకోలేదు. కారణం ఏమిటి అంటే.. శాంతిపురం మండలం సమీపంలో ఇటీవల కొత్త ఇల్లు నిర్మించినా, ఆయనకు హైదరాబాదులో శాశ్వత నివాసం ఉంది. 2014 ఎన్నికల తర్వాత విజయవాడ నగర సమీపంలోని ఉండవల్లి కరకట్టపై ఓ నాయకుడి ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడ ఆయన ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. కుప్పంలో ఓటరుగా నమోదు కాని చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఉండవల్లి లోని గాదె రామయ్య- సీతారావమ్మ

మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీని ద్వారా కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన ఓటు ఆయన వేసుకొలేని పరిస్థితి. వారు నివాసం ఉంటున్న ప్రాంతం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఆయన కుమారుడు టిడిపి నారా లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

జనసేనాని కూడా..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు తాను వేసుకోలేని పరిస్థితి. 2024 ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాదులో నివాసముండే ఆయన.. గత కొన్ని సంవత్సరాల క్రితమే విజయవాడలో కూడా సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఆయనకు అక్కడే ఓటు ఉంది. "మంగళగిరి నియోజకవర్గం లక్ష్మీ నరసింహ కాలనీలో పవన్ కళ్యాణ్ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు" అని జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన పట్టణంలో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆయన తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

నా ఓటు నాకే..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు పులివెందులలో వినియోగించుకోనున్నారు. మొదటి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉన్న కాలం నుంచి ఆ కుటుంబీకులు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ పులివెందులలోనే ఓటు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్. భారతీయ రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. రాత్రి పులివెందులలోనే బస చేసేవారు సోమవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం వైఎస్. జగన్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆ దృశ్యం కనిపిస్తుందా..

సార్వత్రిక ఎన్నికలైన, పార్లమెంటు ఎన్నిక వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే.. పోలింగ్ రోజు వైయస్సార్ కుటుంబీకులంతా కలిసి వెళ్లి స్థానిక ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేయడం వారికి అలవాటు. పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువసేపు సమయం గడిపే వైఎస్సార్ కుటుంబ సభ్యులు స్థానికులతో మాటలతో కాలక్షేపం చేస్తూ కనిపిస్తారు. ఈసారి ఆ దృశ్యం కనిపిస్తుందా? సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డి తో కలిసి ఓటు వేయడానికి కుటుంబ సభ్యులు ఎంతమంది వస్తారు అనేది వేచి చూడాలి.

విజయమ్మ కనిపించరు

రాజకీయంగా కుటుంబంలో కలతలు రేగిన నేపథ్యం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ సతీమణి వైఎస్. విజయమును తీవ్రంగా బాధించిందని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏకైక కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకపక్క, ఏకైక కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి మరోపక్క ప్రత్యర్థులుగా మారారు. ఈ పరిణామాలు నటిని గమనిస్తూ తీవ్రంగా కలత చెందిన విజయమ్మ, ప్రశాంతత కోరుతూ అమెరికాకు వెళ్లారని తెలుస్తోంది. మనవడు అయిన రాజారెడ్డి (వైఎస్. షర్మిలా రెడ్డి కుమారుడు) వద్దకు వైఎస్. విజయమ్మ గత నెలలోనే అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.

అందువల్ల ఆమె గతంలో జరిగిన అనేక సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కుమారుడు, కుమార్తె, తోడికోడళ్ళు, ఆడబిడ్డ తో కలిసి ఈసారి ఆమె పోలింగ్ సందర్భంగా కేవలం కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. ముక్తాయింపు: రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో ఇంకొందరు కూడా తమ ఓటు తమకు వేసుకోవాలని పరిస్థితి ఉన్నదని తెలిసింది. హైదరాబాద్, బెంగుళూరులో నివాసం ఉండడమే కాదు. ఆ నగరాల్లోనే వాళ్లకి ఓటు హక్కు కూడా ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story