
పరకామణి చోరీ:ఆ చేతులకు అరదండాలు వేస్తారా? శ్రీవారికి దండం పెట్టేస్తారా
తిరుమలలో తిరిగి విచారణ చేపట్టిన ఏపీ సీఐడీ.
తిరుమల శ్రీవారి పరకామణి (హుండీ కానుకల లెక్కింపు)లో జరిగిన చోరీపై ఏపీ సిఐడి ( AP CID) తిరిగి విచారణ ప్రారంభించింది. తెరవెనుక ఉన్నారంటున్న వారికి అరదండాలు వేస్తారా? పక్కాగా దొరికిన వ్యక్తినే దోషిగా నిలిపి స్వామివారికి దండం పెడతారా? అనేది తేలడానికి ఎన్నాళ్లు పడుతుందనేది ఆ దేవుడికే తెలియాలి.
తిరుమల క్షేత్రం టీడీపీ కూటమి, వైసీపీ నేతల రాజకీయ క్రీడకు కేంద్ర బిందువుగా మారిందనడంలో సందేహం లేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలకర్మాగారాల ప్రతినిధులు జైలుకు వెళ్లారు. దీనిపై సిట్ విచారణ సా...గుతూనే ఉంది. మినహా అసలు మూలకారకులు ఎవరైంది తేల్చడంలో తాత్సారం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి రాని స్థితిలో..
హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ఏపీ సీఐడీ తిరుమల విచారణకు రంగంలోకి దిగింది.
మొదటి రోజు: ఏపీ సీఐడీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రవిశంకర్ అయ్యన్నార్ సారథ్యంలోని బృందం తిరుమలలో సోమవారం ఉదయం నుంచి పరకామణి చోరీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు బృందం పరకామణి (హుండీ కానుకల లెక్కింపు కేంద్రం)లో పరిశీలించారు. అక్కడి రికార్డులు తనిఖీ చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రికార్డులు, చోరీ వ్యవహారంపై అధ్యయనం చేశారు. ఈ చోరీ తరువాత టీటీడీ ఏవీఎస్ఓ ( TTD Assistant Vigilance and Security Officer AVSO) సమర్పించిన విచారణ నివేదిక కూడా తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న రికార్డులతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్,
ఫిర్యాదుదారుడి విచారణ
తిరుమల పరకామణిలో చోరీ, లోక్ అదాలత్ లో చట్టానికి విరుద్ధంగా రాజీ చేసుకోవడం తోపాటు జరిగిన పరిణామాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డిని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారణకు పిలిపించారు. భానుప్రకాష్ రెడ్డి నుంచి ఆధారాలతో కూడిన పత్రాలు కూడా తీసుకున్నారు.
హైకోర్టు మందలించడంతో..
తిరుమల శ్రీవారి పరకామణిలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ 920 డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు అక్షింతలు వేసిన నేపథ్యంలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ సారథ్యంలోని బృందం విచారణ తిరుమలలో ప్రారంభించింది.
2023లో తిరుమల పరకామణిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాల్లోకి వెళ్లేముందు, చోరీకి పాల్పడిన టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారు. దీనిపై పాలక మండలిలో కూడా తీర్మానం చేశారు. ఆ తరువాత రవికుమార్ ఆస్తులను టిటిడి కి స్వాధీనం చేసుకుంది.
అదాలత్ లో రాజీ ఎప్పుడంటే..
టీటీడీలో తప్పు చేస్తూ ఉద్యోగ పట్టుబడితే అది పెద్ద నేరం. పోలీసులు కేసు నమోదు చేస్తారు. కోర్టులో విచారణ తర్వాత నేరం రుజువు అయితే శిక్ష పడాలి. ఇది చట్టం చెబుతున్న మాట. ఇద్దరు వ్యక్తులు లేదా కుటుంబ గొడవ నేపథ్యంలో కోర్టుకు వెళితే రెండు పక్షాలు లో లో అదాలత్ లో రాజీ కావడానికి చట్టం వెసులుబాటు కల్పించింది.
శ్రీవారి ఆలయంలో డాలర్ల చోరీకి సంబంధించి నిందితుడు టిటిడి ఉద్యోగి. యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం. కేసు పెట్టింది పోలీసులు. కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ఓ సంస్థకు సంబంధించి ఎలా రాజీ చేసుకునేందుకు వీలుంటుంది? అనే ధర్మ సందేహాలను తెరమీద తీసుకువచ్చిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టిటిడి పాలకమండలి సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
"ఈ వ్యవహారంలో రవికుమార్ వెనక ఉన్న వ్యక్తులు ఎవరున్నారనేది తెరపైకి వస్తాం. నిందితుడే కాదు. ఈ నేరానికి ప్రోత్సాహం ఇచ్చిన వారు కూడా ఉన్నారు. శ్రీవారి చెంత తప్పు చేసినవాడు శిక్ష అనుభవించి తీరాల్సిందే" అని బిజెపి నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పదేపదే చెబుతూనే ఉన్నారు.
పరకామణిలో ఎలాగంటే..
శ్రీవారి సేవకుల మాదిరే సాధారణ దుస్తుల్లో వెళ్లి పరిశీలిస్తున్న గత ఈఓ సాంబశివరావు (ఫైల్)
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజు హుండీకి అందిన కానుకలను పరకామణిలో లెక్కిస్తారు. పరకామణి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంటుంది. చుట్టూ సీసీ కెమెరాలతో పాటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది పహారాగా వస్తుంటారు. హుండీ లో కానుక లెక్కించడానికి టీటీడీ సిబ్బంది కూడా సేవ చేయడానికి వెళతారు. ఇందులో శ్రీవారి సేవకులు కూడా ఉంటారు. వారితో పాటు జాతీయ బ్యాంకుల సిబ్బంది, టిటిడి అధికారులు, టీటీడీ జీతంగార్ మఠం నుంచి కూడా ఓ క్లర్క్ స్థాయి ఉద్యోగి ఉంటారు. ఈయన శ్రీవారి సేవకులు, సిబ్బంది లెక్కించే నాణేలు కరెన్సీ నోట్ల వివరాలను నమోదు చేసుకుంటూ ఉంటారు. పరకామణి సేవకు వెళ్లి ఉద్యోగులు కానీ సేవకులు కానీ పంచ, బనియన్ మినహా లోదుస్తులు కూడా ధరించడానికి పేరు లేకుండా ఆంక్షలు అమలు చేస్తూ ఉంటారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ.
తిరుమలలో మంగళవారం ఏపీ సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా పరకామణిలోకి వెళ్లారు. మిగతా వారి మాదిరే సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లిన ఆయన పరకామణిలో సేవకులు, అధికారులు సిబ్బందితో మాట్లాడారు.
చోరీ ఎలా జరిగింది
పరకామణిలో రికార్డులో నమోదు చేస్తున్న రవికుమార్ (వీడియో క్లిప్పంగ్ ఫోటో)
తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి డ్యూటీకి వెళ్ళిన టీటీడీ ఉద్యోగి రవికుమార్ గుట్టు చప్పుడు కాకుండా 920 అమెరికన్ డాలర్లు చోరీ చేశాడు.
దీనిని గమనించిన టిటిడి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకొని తనిఖీ చేస్తే, కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
వైసిపి అధికారంలో ఉండగా చోటు చేసుకున్న ఈ పరిణామం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనిపై అప్పటి టీటీడీ పాలక మండలి 2023 సెప్టెంబర్ 9వ తేదీ లో పదాలతో కేసులు వ్ చేయడం ద్వారా, సమస్య పరిష్కరణ అయినట్లు తీర్మానం చేశారు.
"తిరుమల పరకామణిలో రవికుమార్ చోరీకి పాల్పడిన ఘటనపై విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 100 కోట్లకు పైగానే అనేక నెలలుగా రవికుమార్ చోరీకి పాల్పడ్డాడు. వైసిపి ప్రభుత్వంలో టీటీడీ ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారు. చెట్టు కింద పంచాయితీ చేసినట్లు అప్పటి పెద్దలు లోకదాలత్ కాంప్రమైజ్ చేశారు" అని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
టీటీడీ విజిలెన్స్ చేసిన విచారణలో సీఐ స్థాయిలోని ఓ ఏవిఎస్ఓ (assistant vigilance and security officer ) తన నివేదికలో సివిల్ సీఐ తీవ్ర ఒత్తిడి చేశారు అని రాసిన నివేదికను కూడా భాను ప్రకాష్ రెడ్డి బయట పెట్టారు. ఈ కేసును విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు పోలీసు శాఖ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది.
"ఏపీ సిఐడిలో ఐజి స్థాయి అధికారులు లేరా? మేము ఆదేశించిన తర్వాత కూడా రికార్డులు సమర్పించరా "అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగంలోకి సిఐడి
తిరుమలలో పరకామణిలో చోరీకి సంబంధించి ఏపీ సిఐడి డిజి రవిశంకర్ ఐఎన్ఆర్ సారధ్యంలోని బృందం విచారణకు దిగింది. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కూడా సిఐడి డీజీ అయ్యన్నార్ ను కలిసి ఈ కేసు విచారణ పై చర్చించారని తెలిసింది.
ఏపీ సిఐడిలోని కొంతమంది అధికారులు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదు చేసిన కేసు, పరిణామాలపై రికార్డును పరిశీలించినట్లు తెలిసింది. తిరుమలలో పర్యవేక్షించే టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారితో కూడా సిఐడి అయ్యన్న మాట్లాడారని తెలిసింది. చోరీ జరిగిన సమయంలో టిటిడి విజిలెన్స్ ఎం సెక్యూరిటీ విభాగం చేసిన దర్యాప్తు, avso టీటీడీ ఈవో కు సమర్పించిన నివేదికను కూడా పరిశీలించారని విశ్వసనీయ సమాచారం.
విచారణకు రండి..
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలతో పోరాటం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, టిటిడి పాలకమండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి కూడా ఏపీ సిఐడి డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ విచారణకు పిలిపించారు.
తిరుమల పోలీస్ అతిథి గృహంలో మకాం వేసిన సిఐడి డీజీ అయ్యన్నార్ ను బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి కలిశారు. తన వద్ద ఉన్న ఆధారాల పత్రాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా సిఐడి డీజీతో భాను ప్రకాష్ రెడ్డి సుమారు అరగంట పాటు కేసు కు సంబంధించిన పత్రాలపై మాట్లాడారని తెలిసింది.
ఎక్కడ దాక్కున్నా వదలం..
ఆ తర్వాత బయటకు వచ్చిన భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించిన రవికుమార్ మాత్రమే చోరీ చేస్తూ దొరికిన విషయాన్ని పునరుద్ఘాటించారు.
"పరకామణిలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ కు అండగా నిలిచిన అధికారులు, వైసీపీ నాయకులు ఎవరైతే త్వరలోనే తేలుతుంది" ఎన్ హెచ్చరించారు. టిటిడి కి సంబంధించిన కేసును లోకదాలతో రాజీ చేయడం, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచిన నిందితులు ఎక్కడ దాక్కున్న బయటికి తీసుకొస్తాం అని భాను ప్రకాష్ రెడ్డి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
తిరుమల పరకామానికి సంబంధించి నా ఈ కేసు రెండు సంవత్సరాలుగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. అధికారులు లేరనే సాకుతో సిఐడి భాగం టీటీడీ పరకామణి, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏవీఎస్ ఓ సమర్పించిన విచారణ నివేదికను తీసుకోవడంలో తాత్సారం చేశారు. హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో సిఐడి ఈ కేసును మళ్లీ విచారణకు చేపట్టింది. ఈ విచారణ ఎంతకాలం సాగుతుంది? పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ కు అండగా నిలిచిన వారు ఎవరనేది బయటికి వస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Next Story