Tirumala| ఒకనాటి తిరుపతి వైకుంఠం ఆ మాల్వాడిగుండం
x

Tirumala| ఒకనాటి తిరుపతి వైకుంఠం ఆ 'మాల్వాడిగుండం'

తిరుమల శేషాచలం కొండల నుంచి వచ్చే జలపాతం కనువిందు చేస్తుంది. ఈ కొండ దిగువన వెంకన్న విగ్రహాన్ని అభిషేకిస్తుంది.


తిరుపతికి ఉత్తరాన పెట్టని కోటగోడల్లా విస్తరించిన శేషాచలం కొండలు. వీటికి పైభాగాన తిరుమల క్షేత్రం. తిరుపతికి మొదటిఘాట్ రోడ్డులో తిరిగి వచ్చేటప్పుడు అడవిలో ప్రయాణం ఆహ్లాదం పంచుతుంది. సరిగ్గా కపిలతీర్థానికి పైభాగంలో అంటే మొదటి ఘాట్ రోడ్లో చివరి మలుపు తిరగగానే ఎత్తయిన శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది. యాత్రికులకు ఇంత వరకే తెలుసు. ఇది మాల్వాడి గుండంగా పేరుపడిన చరిత్ర ఇంకొందరికే తెలుసు. ఇక్కడే మరుగున పడిన మరో వైకుంఠం ఎంతమందికి తెలుసు.


కలియుగ వైకుంఠం తిరుమల తరహాలోని ఈ శేషాచలం పర్వతాలకు దిగువన శ్రీవెంకటేశ్వర స్వామి శిలా విగ్రహం దర్శనమిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి జాలువారే జలపాతం ఆ విగ్రహాన్ని అభిషేకిస్తూ సమీపంలోని ఓ గుండాన్ని (సహజ సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి) నింపుతుంది. అక్కడికి వెళితే కనిపించే సుందర దృశ్యం ఇది. దీని వెనక ఓ కథను చరిత్ర నిక్షిప్తం చేసుకున్నది.


తిరుపతికి దూరంగా ఉన్నా.. కనుచూపు మేరకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు కనిపిస్తాయి. కపిలతీర్థం సమీపానికి రాగానే ఈ మాల్వాడి గుండం పైనుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది.
కపిలతీర్థం ఆలయాల సముదాయంలోనికి వెళ్లడానికి ముందే ఎడమవైపు తిరిగితే చాలు. దట్టమైన అడవి స్వాగతిస్తుంది. ఎర్రచందనం చెట్లు, ఔషధ గుణాలు కలిగిన అనేక మొక్కల మధ్య దారిలో లోపలికి వెళితే మాల్వాడిగుండం పైనుంచి వచ్చే నీరు ప్రవహించడానికి కాలువపై నిర్మించిన ఓ చిన్నటి వంతెన పైనుంచి నడక సాగించాలి. ఆ ప్రదేశం నుంచే కుడివైపు ఆకాశాన్ని తాకే ఎత్తులో కనిపించే పర్వతాలు. దట్టంగా పచ్చటి చెట్లతో కనువిందు చేసే ప్రకృతి తెలియని అనుభూతిని కలిగిస్తుంది.

చారిత్రక కథనం..
కాలం మారింది. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తిరుమలకు వెళ్లొచ్చు. శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ దళిత, గిరిజనులకు గతంలో ఆలయ ప్రవేశం లేదనేది చరిత్ర చెప్పే కఠిన సత్యం. ఆ రోజుల్లో.. దళితులు, ఇతర నిమ్నవర్గాలు తిరుమల శ్రీవారి పై అచంచల విశ్వాసం భక్తి భావం ఉన్న ప్పటికీ కొండపైకి వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతారు. దీంతో,
ఆ వర్గాలకు చెందిన భక్తులు మాల్వాడిగుండం వద్దకు వచ్చేవారట. తిరుమల శేషాచలం కొండలపై నుంచి జాలువారే జలపాతం కపిలతీర్థం తోపాటు సమీపంలోని మాల్వాడిగుండం పైనుంచి వర్షాకాలంలో జాలువారుతుంటుంది. ఆ నీరు ప్రవహించే కాలువ వద్ద ఈ నిమ్నవర్గాలు పుణ్యస్నానాలు ఆచరించడం, అంతకుముందే తలనీలాలు సమర్పించే వారిని చెబుతారు. ఆ తర్వాత పొంగళ్ళు సిద్ధం చేసుకుని ఈ కాలువ ప్రవహించే కుడివైపు కొండపైకి కష్టంగా ఎక్కేవారు.ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అటవీశాఖ రాళ్లపైన మడిగలు (మెట్లు)గా తీర్చిదిద్దడంతోపాటు లోయలో ప్రమాదం జరగకుండా ఇనుప బారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది.

పురాతన కాలంలో ఆ పరిస్థితి లేదు.
తలనీలాలు సమర్పించిన నిమ్నవర్గాల భక్తులు, ఆ మార్గంలో కొండ దిగువకు నడుచుకుంటూ వెళ్లేవారు. పైకి వెళ్ళిన తర్వాత తిరుమల శేషాచలం నుంచి వచ్చిన జలపాతంతో నిండిన ఓ గుండం (పుష్కరిణి) లో స్నానం చేసిన తర్వాత ఎదురుగా కొండకు దిగువన కొలువైన శ్రీవారిని దర్శించుకుని, పొంగళ్ళు సమర్పించి, మొక్కుబడులు చెల్లించేవారనేది కథనం. మాల, మాదిగలను తిరుమల కొండపైకి అనుమతించని రోజుల్లో ఈ మాల్వాడి గుండం వద్ద కొలువైన శ్రీవారి విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేసే వారిని చెబుతారు.

దళిత సామాజిక వర్గంలోని ప్రజలు ఈ ప్రదేశంలోనే పూజలు సమర్పించేవారు. అందువల్లే మొదటి ఘాట్ రోడ్డులో కొండలపై నుంచి జాలువారే జలపాతం ప్రదేశం ఇప్పటికీ మాల్వాడి గుండంగానే పరిగణిస్తున్నారు. అదే పేరుతో పిలుస్తున్నారు. అంటే దీనిని బట్టి అర్థం అయ్యేది ఒకటే. తిరుమల శ్రీవారి చెంత దళితులకే కాదు. యాదవులు, నాయీబ్రాహ్మణులు, ఓ ముస్లిం భక్తునికి కూడా శ్రీవారి అనుగ్రహం ఉందనే విషయం చెప్పకనే చెబుతుంది. అంటే గోవిందుడు అందరివాడు.
ఆహ్లాదంగా కనిపించింది..

కపిల తీర్థానికి సమీపంలో ఉన్న మాల్వాడిగుండం చూడాలని సోమవారం మధ్యాహ్నం వెళ్లాను. రోడ్డు పక్కనే ఉన్న ఈ ప్రదేశం దట్టమైన కీకారణ్యంలో యాత్రికులు, యువతీ యువకులు ఎక్కువమంది ఈ ప్రదేశంలో ఆహ్లాదం పొందుతూ కనిపించారు. శేషాచలం కొండల అంచున జనానికి తెలియని వైకుంఠాన్ని చూడాలని మనసు చెబుతుంటే, నడవడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి లేకున్నా, కాస్త కష్టంగానే పైకి వెళ్ళా. పిచ్చి మొక్కలు నిండి ఉన్న ప్రదేశం అటవీ శాఖ అధికారులు శుభ్రంగా తీర్చిదిద్ది ఉండడం కనిపించింది. దీనిపై వాకబు చేస్తే.. ఆదివారం చదును చేశామని సమాధానం వినిపించింది.

కలెక్టర్ సందర్శన
మాల్వాడి గుండం కథ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కపిలతీర్థం ప్రాసస్యం, చరిత్ర తెలియని వారు ఉండరు. కానీ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తన భార్యతో కలిసి ఆదివారం సాయంత్రం మాల్వాడిగుండాన్ని సందర్శించారని అక్కడ సిబ్బంది చెప్పారు. కొండ అంచున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకుని, పూజలు కూడా చేసినట్లు అటవీశాఖలోని సిబ్బంది ద్వారా తెలిసింది. దిగువ నుంచి దాదాపు ఒక 10 నిమిషాల పాటు అంటే కొండపైకి ఎక్కడానికి కలెక్టర్ వెంకటేశ్వర ఆసక్తి చూపించారని సమాచారం. అక్కడ విశేషాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
వారి నుంచి విశేషాలు తెలుసుకొని, అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని కిందికి దిగువ నడుచుకుంటూ వస్తున్నా. మధ్యలో కొందరు తారసపడ్డారు. వారి మాటలను బట్టి తిరుపతి పట్టణానికి చెందిన వారే అని అర్థమైంది. ఇక్కడ ఏముందని భావిస్తున్నారు అంటే, వాతావరణం మాకు బాగుంది. పైన దేవుడు ఉన్నాడంట కదా! చూద్దామని వచ్చాం. అని చెప్పారు. దీంతో ఆ చరిత్ర ఏమిటో వారికి తెలియదనే విషయం అర్థమైంది. ఈ ప్రదేశం పేరు ఏంటి అంటే మాల్వాడి గుండం అనిమాత్రమే చెప్పారు. అంటే, మరుగునపడిన విషాద చరిత్ర గురించి చాలామందికి తెలియదనే విషయం అర్థమైంది. వారి నుంచి బై..బై చెప్పి కిందికి వస్తూ ఉంటే, ఓ కుటుంబం భోజనం చేస్తూ కనిపించింది. వారిని పలకరిస్తే, చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి.

తిరుపతి పరసాలవీధికి చెందిన లక్ష్మి (62) ఏమన్నారంటే, "మాది తిరుపతే సార్. ఈ ప్రాంతాన్ని మాల్వాడిగుండం అంటారు. దీని వెనక కథ మా నాయనమ్మ చెప్పింది" అని లక్ష్మి గుర్తు చేసుకున్నారు. పాత రోజుల్లో మాల, మాదిగలకు కొండపైకి అనుమతి లేని రోజుల్లో ఈ ప్రదేశం లోనే తలనీలాలు సమర్పించి, ఆ తర్వాత పొంగళ్ళు పెట్టి,
కొండ అంచున ఉన్న గుండంలో స్నానాలు చేసేవారంట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించి ముక్కులు కూడా చెల్లించేవారంట. ఈ విషయాలు మా నాయనమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది" అని లక్ష్మి గుర్తు చేసుకున్నారు.
"మా తాతలకాలంలోనే తిరుమల కొండపై వాహనాలు నిలిపే స్థలాన్ని తిరుమల వెంకన్నకు ఇచ్చారంట. మాకు మిరాశీ అందేది" అని తిరుమలతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
"ఆ రోజుల్లో ఎందుకు జరిగిందో తెలియదు. కానీ, అలా చేసి ఉండకూడదు. దేవుడి ముందు అందరూ సమానమే. మనమంతా మనుషులమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని లక్ష్మి తన మనసులో మాట సూటిగా చెప్పారు.
వాతావరణం బాగుందని వచ్చాం..

మాకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుంది. మానసిక ఆందోళన ఉంటే సేద తీరడానికి ఇక్కడికి వస్తూ ఉంటామని స్నేహితులైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు వి.కుమార్, జీ .ప్రేమ్ కుమార్ రెడ్డి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్'ప్రతినిధికి చెప్పారు. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాం. మాకు సమయం దొరికినప్పుడల్లా ఈ ప్రదేశానికి వస్తూ ఉంటాం అని చెప్పారు. దీని పేరు కూడా మాకు సరిగా తెలియదు అని ఆ మిత్రులు వ్యాఖ్యానించారు.
"మాది శ్రీకాళహస్తి కావడంతో ఆ ప్రదేశం బాగా పరిచయం. అక్కడ విషయాలు తెలుసు" అని వి. కుమార్ వ్యాఖ్యానించారు. "ఇలాంటి చరిత్ర బయటి ప్రపంచానికి తెలియదు. వివక్ష లేని సమాజం. వ్యక్తుల జీవనం సాగించే విధంగా విలువలతో కూడిన సమాచారం విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది" ఆ ఇద్దరు మిత్రులు అభిప్రాయపడ్డారు.
తిరుమల పర్యటనకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా కపిలే తీర్థం సందర్శిస్తారు. దీనికి దగ్గరలోనే ఉన్న మాల్వాడి గుండం దిగువ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన ప్రదేశంలోకి వెళ్లడానికి అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఒక మనిషికి పది రూపాయలు టికెట్ వసూలు చేసి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రదేశంలో సంచరించడానికి అనుమతిస్తున్నారు. చాలామందికి ఆహ్లాదం పంచే ఈ ప్రదేశంలో చరిత్ర మరుగున పడిన ఓ విషాద ఘట్టం ఉందనే విషయం బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు. కాలం మారింది. పరిస్థితులు మారాయి. చదువు చైతన్యం తీసుకువచ్చింది. సమాజంలో మార్పు వచ్చింది. చట్టాలు కల్పించిన రక్షణతో సమైక్య జీవనానికి బాటలు వేసింది. ఈ పరిస్థితుల్లో కొన్ని చేదు జ్ఞాపకాల లాంటి చరిత్ర మరుగున పడేలా చేసింది. కానీ మాల్వాడి గుండం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉండడమే ఇక్కడ విశేషం.
Read More
Next Story