మదనపల్లి చరిత్రపై మరో సంతకం.. నూతన శకం ప్రారంభం..
x

మదనపల్లి చరిత్రపై మరో సంతకం.. నూతన శకం ప్రారంభం..

అన్నమయ్య జిల్లా కేంద్రంగా పరిపాలనకు శ్రీకారం.


మదనపల్లె చారిత్రక ఘట్టంలో బుధవారం మరో పేజీపై సంతకం చేశారు. 2026 డిసెంబర్ 31వ తేదీ అన్నమయ్య జిల్లా బుధవారం ఫార్మేషన్ డేగా నమోదైంది. కొత్త ఆశలతో కొంగొత్త పరిపాలనకు మదనపల్లె కేంద్రాన్ని ఆంగ్ల నూతన సంవత్సరం 2026 స్వాగతించింది.

"ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది" అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యాఖ్యానించారు.

మదనపల్లె డివిజన్ ప్రాధాన్యత
మదనపల్లె పెద్ద రెవెన్యూ డివిజన్ గా బ్రిటీషర్ల కాలంలోనే 1850లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. కడప మొదటి కలెక్టర్ గా పనిచేసిన సర్ థామస్ మన్రో కాలంలోనే మదనపల్లె కలెక్టర్ బంగ్లా కూడా నిర్మించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా, ఆసియోలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మదనపల్లె చరిత్ర పుటల్లో నిలిచింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచింని జణ గణ మణ జాతీయ గీతం బిసెంట్ థియాసాఫికల్ (బీటీ కాలేజీ) కాలేజీలో ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం తోపాటు, బాణీలు సమకూర్చడంతో దేశంలో మొదటిసారి ఆలపించిన చరిత్ర దక్కించుకుంది. 1915లో ఐరిష్ మహిళ డాక్టర్ అనీబిసెంట్ స్థాపించిన బీటీ కాలేజీ రాయలసీమలోనే మొదటిది. ఇదే కాలేజీ వేదికగానే హోంరూల్ ఉద్యమానికి కూడా నాంది పలికారు. క్లుప్తంగా మదనపల్లె శిగలో ఏర్పాడిన విద్య సంస్థలు, చరిత్రపుటల్లోని అధ్యాయాలు ఇవి.
మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నప్పటికీ, వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రాథాన్యత ఇవ్వలేదు. 2022 ఏప్రిల్ 4 తేదీ విభజిత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేశారు. బ్రిటీషర్ల కాలంలో ఏర్పాటైన మదనపల్లె, రాజంపేటను కాదని రాయచోటి నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో అటు మదనపల్లె, ఇటు రాజంపేటలో జిల్లా కేంద్రం కోసం పోరాటాలు జరిగాయి.
175 ఏళ్ల నాటి భవనంలో..

ఎన్నికల హామీ మేరకు మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ, టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెకు మారింది. 175 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే అన్నమయ్య జిల్లా పరిపాలన బుధవారం నుంచి ప్రారంభమైంది.

మదనపల్లెలో నూతన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. నూతన కలెక్టరేట్ కారంభానికి ముందు కలెక్టరేట్ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సాదరంగా స్వాగతించారు. అనంతరం నూతన జిల్లా కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.
"ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లెను ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. ప్రజలకు మరింత మెరుగైైన సేవలు అందించడానికి అంకితభావంతో పనిచేద్దాం" అని కలెక్టర్ నిశాంత్ కుమార్ సిబ్బంది, అధికారులను ఉద్దేశించి అన్నారు.

మదనపల్లెకు మొదటి కలెక్టర్ గా నిశాంత్ కుమార్ కు గుర్తింపు దక్కింది. చివరి సబ్ కలెక్టర్ గా చల్లా కల్యాణి చరిత్ర పుటల్లో నిలిచారనడంలో సందేహం లేదు.
కొత్తకోటలో సంబరాలు

మదనపల్లెలో జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో సంబరాలు మిన్నంటాయి. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు బి.కొత్తకోటలో పాలాభిషేకం చేశారు. ధ్యాంక్యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ, బిజేపీ, జనసేన పార్టీల నేతలు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. జ్యోతిచౌక్ లో మానవహారంగా ఏర్పడ్డారు.

టీడీపీ రాష్ట్ర నాయకురాలు పర్వీన్ తాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు టీడీపీ కూటమి ప్రాధాన్యత ఇచ్చిందని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆమె విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిపాలన సంస్కరణల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం తోపాటు అమలు చేస్తోందని చెప్పారు.
Read More
Next Story