నెల్లూరు వద్ద పేలిన బాయిలర్
x

'నెల్లూరు' వద్ద పేలిన బాయిలర్

పరిశ్రమల్లో పేలుళ్లు ఉలికిపాటుకు గురిచేశాయి. అచ్యుతాపురం వద్ద రియాక్టర్ పేలిన ఘటన విషాదం మిగిల్చింది. కొన్ని గంటల వ్యవధిలో నెల్లూరు జిల్లాలో ఓ బాయిలర్ పేలుడుతో జనం ఉలిక్కిపడ్డారు.


ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇందులో ఎలాంటి నష్టం జరిగిందనేది తెలియలేదు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం సమీపంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి జరిగింది. ఫ్యాక్టరీలో నైట్రోజన్ ట్యాంకు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా సమాచారం అందింది. భారీ శబ్డంతో బాయిలర్ పేలడంతో పంటపాలెం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు వల్ల మంటలు భారీగా చెలరేగడంతో పాటుగ్రామాన్ని దట్టమైన పొగ అలుకుముకుంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి విఫలయత్నం చేశారు.

సంఘటన నేపథ్యంలో కృష్ణపట్నం, నెల్లూరు నుంచి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని వంటలు అదుపు చేశాయి. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు..


ముత్తుకూరు మండలం కృష్ణపట్టణం సమీపంలోని పంటపాలెం వద్ద ఎఫ్ఎఫ్ఎఫ్ పాయియిల్ ఫ్యాక్టరీ ఉంది. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అగ్నికీలలు వ్యాపించడంతో సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కపడ్డారు. ఫామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనాలతో వచ్చి మంటలు ఆర్పారు.

కృష్ణపట్నం పోర్టుకు సింగపూర్, మలేషియా నుంచి ఓడల ద్వారా క్రూడాయిల్ వస్తుంది. అక్కడి నుంచి పంటపాలెంలోని కొన్ని పామాయిల్ ఫ్యాక్టరీలకు పైపుల ద్వారా ఆయిల్ సరఫరా అవుతుంది. ఆయిల్ శుద్ధి చేసి, ప్యాకెట్లు, డ్రమ్మల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తుంటారని తెలుస్తోంది. ఈ ప్రక్రియ సాగించే సమయంలో బాయిలర్ పేలిందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు బయటికి రాలేదు. కాగా, పోలీస్, రెవెన్యూ శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ సాగించారని తెలుస్తున్నది.

విశాఖపట్టణానికి సమీపంలోని అచ్యుతాపురం వద్ద ఉన్న ఎస్ఈజెడ్ (Self Economic Zone)లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో దాదాపు 14 మంది వరకు ఘటన స్ఠలంలోనే చనిపోయారు. దాదాపు 50 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా ముత్తుకూరు సమీపంలో బాయిలర్ పేలిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియలేదు. అయితే "ప్రాణ నష్టం జరగలేదు" అని నెల్లూరు అదనపు ఎస్పీ (అడ్మిన్) సౌజీ చెక్కా 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డితో మాట్లాడాలని ప్రయత్నిస్తే, ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది.
ముత్తుకూరు సమీపంలోని "ట్రిపుల్ ఎఫ్ పామాయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బాయిలర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు" అని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లిందని ఆయన చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
Read More
Next Story