కుప్పంలో వైసీపీకి మరో దెబ్బ
x

కుప్పంలో వైసీపీకి మరో దెబ్బ

కుప్పంలో వైసీపీ వ్యూహం బెడిసింది. తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపాలిటీపై మళ్లీ టీడీపీ జెండా ఎగురనుంది.


రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కోలుకోలేని దెబ్బలే తగులుతున్నాయి. ఆ పార్టీని వీడిన వారిలో రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిపీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే,

కుప్పంలో వైసీపీ నేతలు కూడా మాజీ సీఎం వైఎస్. జగన్ కు ఝలక్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ తన పదవి తోపాటు, పార్టీకి కూడా రాజీనామా చేశారు. అమరావతిలోమంగళవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మున్సిపాలిటీ టీడీపీకి దక్కే వాతావరణం ఏర్పడింది.
నాలుగు నెలల కిందట..
కుప్పంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తీవ్రంగా శ్రమించింది. ఆ బాధ్యతలను చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఆపరేషన్ అప్పగించింది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అంచనాలు తలకిందులై, అధికారానికి దూరమైంది. ఈ పరిస్థితుల్లో ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే రాష్ట్రంలో టీడీపీ కూటమి కొలువుదీరిన తర్వాత, కుప్పంలో సీఎం ఎన్ చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ దాదాపు ఏకాకిగా మిగిలినట్లు కనిపిస్తోంది. కారణం..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తనకు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లతో టిడిపిలో చేరడానికి ప్రయత్నం చేశారు. వారందరితో కలిసి ఆయన మూడు నెలల కిందట అమరావతి వెళ్లారు.
టీడీపీ నేతల అభ్యంతరం
ఆ సమాచారం తెలిసిన ఆ పార్టీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. "డాక్టర్ సుధీర్ ను పార్టీలో చేర్చుకోవద్దు" అని ఆందోళనకు దిగారు. అంతటితో ఆగక కుప్పంలోని డాక్టర్ సుధీర్ ఆస్పత్రిపై రాళ్ల రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. వారి ఆగ్రహానికి కారణం
"వైసీపీ అధికారంలో ఉండగా మాపై కేసులు పెట్టించాడు. ఎన్నో బాధలకు గురి చేశాడు" అని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని నినదించారు. దీంతో అప్పట్లో ఆయన చేరికకు తాత్కాలికంగా అవరోధం ఎదురైంది.
ఎమ్మెల్సీ చొరవతో..
కుప్పం నియోజకవర్గం బాధ్యతలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. తీవ్రంగా ప్రయత్నించిన డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ద్వారా అమరావతి వెళ్లిన కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తూ, కుప్పం మున్సిపల్ చైర్మన్కు లేఖ పంపారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పెరిగిన టీడీపీ బలం
2020 నవంబర్ లో కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. 27 వార్డులకు ఆ పార్టీ నుంచి 19 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఆరుగురు టీడీపీ నుంచి విజయం సాధించారు. దీంతో కుప్పం చంద్రబాబు కోటలో వైసీపీ పాగా వేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని నెలలకే వైసీపీలో ఆత్మరక్షణ భయం ఏర్పడింది. దీంతో, కొన్ని రోజులకే కుప్పం వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరాలని ప్రయత్నం చేశారు. వారిలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మినహా, ఎనిమిది మంది కౌన్సిలర్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వారంతా టీడీపీ కండువాలు వేసుకుని కుప్పంకు తిరిగివచ్చారు. డాక్టర్ సుధీర్ పట్టుదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి, ఎట్టకేలకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సారధ్యంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఇప్పటివరకు ఆయన చేరికను వ్యతిరేకించిన టీడీపీ నాయకులు, శ్రేణులు ఇలా స్పందిస్తాయనేది వేచిచూడాలి. సీఎం చంద్రబాబుకు ఆత్మాహుతి దళంలో వ్యవహరించే, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ వంటి వారందరూ "కుప్పంలో ట్రబుల్ షూటర్స్"గా పనిచేస్తారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఎలాంటి అసంతృప్తి రగలకుండా నివారించగలరని అంచనా వేస్తున్నారు.
Read More
Next Story