Andhra Prabha | ఆంధ్రప్రభ యాజమాన్యానికి రూ. 55 వేలు జరిమానా
x

Andhra Prabha | ఆంధ్రప్రభ' యాజమాన్యానికి రూ. 55 వేలు జరిమానా

జర్నలిస్టుకు పీఎఫ్ చెల్లించని యాజమాన్యానికి కోర్టు జరిమానా విధించింది. తీర్పులో ఇంకా ఏమని ఆదేశించారంటే...


జీతం నుంచి మినహాయించిన ప్రావిడెంట్ ఫండ్ ( Providend Fund) మొత్తాలను పీఎఫ్ సంస్థకు జమ చేయకుండా ఉద్యోగిని మోసం చేసిన ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ యాజమాన్యం చేసిన మోసపూరిత చర్యల కారణంగా అనుభవించిన మానసిక వేదనకు కృష్ణా జిల్లా వినియోగదారుల కోర్టు రూ. 55 వేల జరిమానా విధించింది. వినియోగదారుల న్యాయస్థానం అధ్యక్షులు నేలపూడి చిరంజీవి, సభ్యులు ఎవి. రమణ, కంభంపాటి శశికళ ఆ మేరకు తీర్పు చెప్పారు.

ఈ కేసు జడ్జిమెంట్ కాపీలు మంగళవారం అందినట్లు జర్నలిస్టు గణపతిరావు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై 2023లో కేసు దాఖలు చేశానని, సరిగ్గా 19 నెలల తరువాత తీర్పు వచ్చిందని ఆయన చెప్పారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
దివంగత రాంనాథ్ గోయంకా నిర్వహణలో ఉన్న సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ (INDIAN EXPRESS) పబ్లికేషన్స్ గ్రూప్ లోని ఆంధ్రప్రభ దినపత్రికలో విజయవాడకు చెందిన పొలమరశెట్టి గణపతిరావు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ యాజమాన్యం మారిన తరువాత కూడా గణపతిరావు 2022 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. అంటే దాదాపు 29 ఏళ్లు ఆయన పనిచేశారు. అయితే తన వేతనం నుంచి మినహాయించిన పీఎఫ్ మొత్తాన్ని ఆ సంస్థకు జమ చేయలేదు. దీంతో తాను ఆర్థిక ఇబ్బండితో మానసికంగా వేదకు గురవుతున్నానంటూ, గణపతిరావు విజయవాడలోని కృష్ణా జిల్లా వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారించిన వినియోగదారుల న్యాయస్థానం అధ్యక్షులు నేలపూడి చిరంజీవి, సభ్యులు ఎవి. రమణ, కంభంపాటి శశికళ తీర్పు వెలువరించారు.
"పాత్రికేయుడి జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ నిమిత్తం మినహాయించిన 1,23,048 మొత్తానికి అంతే మొత్తం కలిపి ఆంధ్రప్రభ యాజమాన్యం నుంచి వసూలు చేయండి" అని తీర్పు చెబుతూ, హైదరాబాద్ పీఎఫ్ కమిషనర్ ను ఆదేశించారు. అంతేకాకుండా, 50వేల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం ఐదు వేలు, ఆరు శాతం వడ్డీ తోసహా చెల్లించాలని కూడా కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"తీర్పే ఆలస్యం కావచ్చేమో. కోర్టులో న్యాయం జరుగుతుంది" అని జర్నలిస్టు గణపతిరావు వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన తరువాత ఆయన 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.

" పాత్రికేయ వృత్తిపై ఆరాధ్యభావంతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ సారధ్యంలో దివంగత రాంనాధ్ గోయంకా నిర్వహిస్తున్న ఆంధ్రప్రభ దినపత్రికలో చేరాను. యాజమాన్యం మారిన తరువాత కూడా... ఆంధ్రప్రభపై అభిమానంతో నైతిక విలువలకు కట్టుబడి పనిచేశాను" అని తెలిపారు. నూతన యాజమాన్యం సీనియర్లపై చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. చట్టపరంగా నాకు రావాల్సిన సొమ్ము కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. "న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ... సరే న్యాయం గెలుస్తుందనే నా నమ్మకం వమ్ము కాలేదు" అని వ్యాఖ్యానించారు.
Read More
Next Story