సముద్రంలో.. ఆంధ్రా వలలు విలవిల
x

సముద్రంలో.. ఆంధ్రా వలలు విలవిల

పూడికతీసే జాడ లేక, సముద్ర ముఖద్వారం తెరుచుకునేలా లేదు. పెద్దమనుషుల ఒప్పందం అలల్లో కలిసింది. వెరసి ఆంధ్రా జాలర్లకు కడగండ్లు మిగులుస్తున్నాయి.


పులికాట్ సరస్సు సముద్రం ముఖద్వారంలో ఇసుక మేటలు పేరుకునిపోయాయి. పూడిక తీయడానికి కేంద్రం సాగరమాల పథకంలో ప్రకటించినా, నిధులు రాలేదు. ఈ పరిస్థితుల్లో సముద్రంలోకి చేపలవేటకు వెళుతున్న ఆంధ్రా ప్రాంత జాలర్లు తమిళ మత్స్యకారుల దాడులకు గురవుతున్నారు. వారి మెకనైజ్డ్ బోట్ల ధాటికి వలలు తెగిపోయి, పట్టకున్న చేపలు కూడా దోచుకునిపోతుండడంతో వలవల రోధిస్తున్నారు.



ఇటు నుంచి పడవలపై వెళుతున్న మత్స్యకారులు. మరోపక్క నుంచి మరబోట్లపై వస్తున్న జాలర్లు. నడిసముద్రంలో యుద్దం. ఇది రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు. చేపలవేట భుక్తిగా జీవిస్తున్న ఆంధ్ర -తమిళ జాలర్ల మధ్య జరుగుతున్నఈ ఘర్షణ సినీస్టంట్లను మరిపిస్తున్నాయి. వేటాడిన చేపలు దోపిడీకి గురికావడం, రూ. వేలు, లక్షలు విలువైన వలలు ఛిద్రమై, వలవల ఏడుస్తున్నారు. మారణాయుధాలతో జరిగే దాడుల్లో గాయపడి సముద్ర జలాల్లో విలవిలలాడుతున్నారు.

నెల్లూరు జిల్లా కావలి నుంచి తమిళనాడు సరిహద్దులో తడ వరకు ఉన్న సముద్రజలాల్లో తెలుగు మత్స్యకారులు అనుభవిస్తున్న నరకయాతన ఇది. జిల్లాలోని కోట, వాకాడు మండలాల్లో 14 మత్స్యకార గ్రామాల్లో 29 వేలకు పైగానే చేపలవేట ఆధారంగా జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. తూపిలిపాలెం నుంచి చేపల వేటకు వెళితే, తమిళ జాలర్ల దాడులు తట్టుకోలేక, తిరిగి వచ్చామని కోట మండలం గోవిందపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీవిసాసత్రం, యమదిన్నెపాలెం, గున్నంపడియా గ్రామాల మత్స్యకారులు చెబుతున్నారు. తమిళనాడులోని నాగూరు, నాగపట్టినం, తూత్తుకుడి ప్రాంతాల నుంచి జాలర్లు హైస్పీడ్ మోటార్లు ఉన్న పడవలతో వేటకు వస్తున్నారు. సరిహద్దులు దాటుతున్న తమిళ జాలర్లు సముద్రతీరం నుంచి 120 కిలోమీటర్లు దాటి వస్తున్నారు.

నెల్లూరు జిల్లా తీర ప్రాంతాలకు వస్తున్న "తమిళనాడు నుంచి భారీ పడవల్లో వస్తున్న తమిళ జాలర్లను అడ్డుకోండి "అని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి అభ్యర్థించారు. స్పందించిన రాష్ర్ట గనులు, భూగర్భ, ఎక్సైజ్, మత్య్స శాఖ మంత్రి కొల్లు రవీంద్ర "ఈ విషయంపై చర్యలు తీసుకోండి" అని మత్స్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. అంతటితో సరిపుచ్చడం మినహా, తీసుకున్న చర్యలేవీ లేవు.


తాజాగా 61 రోజుల తరువాత సముద్రంలోకి చేపలు వేటకు వెళ్లారు. తమిళ జాలర్ల దాడులకు గురై, వలలు తెగిపోవడం, పట్టుకున్న చేపలు కూడా దోపిడీకి గురికావడంతో ఆంధ్రా ప్రాంత మత్స్యకారులు కన్నీటితో ఒడ్డుకు చేరారు.

తీరప్రాంత పరిస్థితిని పరిశీలిస్తే...
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఉన్న వాడరేవు నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ వరకు 169 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంలో పెద్దబోట్లు లేవు. దీంతో తమిళ జాలర్ల ఆగడాలకు అంతులేకుండా ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని ఘటనల్లో మాత్రమే ఆంధ్ర ప్రాంత జాలర్లు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కట్టడి చేసి, పోలీసులకు అప్పగించినప్పుడు మాత్రమే పోలీసులు, మత్య్సశాఖ యంత్రంగా స్పందిస్తోంది. ఆ తరువాత షరా మామూలే. రాతకోతలు, పెద్దమనుషుల ఒప్పందాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి.


పులికాట్ సరస్సుకు ముఖద్వారమైన సముద్రంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు వద్ద పెద్దమనుషుల ఒప్పందం కుదిరిన విషయాన్ని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"తమ తీరప్రాంత జలాల్లో తాటిచెట్ల మొద్దులు నాటి, హద్దులు దశాబ్దాల కాలం కిందటే నాటారు" అని ఆయన గుర్తు చేశారు. తమిళ జాలర్లు వాటిని ఖాతరు చేయకుండా, మత్స్య సంపద దోపిడీతో పాటు ఆంధ్ర జాలర్లపై దాడి చేసి, రూ. 50 వేల నుంచి రూ. 70 వేల విలువైన వలలు కూడా మెకనైజ్డ్ బోట్లతో ధ్వంసం చేస్తున్నారు" అని ఆందోళన చెందారు. "రెండు రాష్ట్రాల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన నొక్కి చెప్పారు.

శత్రువుల్లా చూస్తున్నారు...

తడ మండలంలో కూడా 17 కుప్పాలు (జాలరి గ్రామాల నుంచి చేపల వేటకు వెళ్లే ఆంధ్ర జాలర్లకు, తమిళనాడు సరిహద్దుల్లో 19 కుప్పాలు ఉంటే, అందులో పెద్ద, చిన్నమాంగోడు గ్రామాలు, కీరపాకం పుదికుప్పం జాలర్లతో సత్సబంధాలు ఉన్నాయి. మిగతా 11 కుప్పాల వారే సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. తడ మండలంలో పలయక్కాడుకు 18 కిలోమీటర్ల దూరంలోనే 15 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి సముద్రముఖద్వారం నుంచి పులికాట్ సరస్సుకు నీరు వస్తుంది. ఇందులో నీరు ఇంకితే సముద్రంలోకి చేపలవేట కు వెళ్లాల్సిన అనివార్యమైన పరిస్థితి.
దీనిపై మత్స్యకార సంఘం ప్రతినిధి వల్లంబేడు జయపాల్ ఏమంటున్నారంటే..
"వాకాడు మండలం పూడిరాయదూరు, సూళ్లూరుపేట షార్ సెంటర్కు సమీపంలో సముద్రముఖ ద్వారం వద్ద పులికాట్ సరస్సులో ఇసుక పూడిక తీయాల్సిన అవసరం ఉంది" అని గుర్తు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో రూ.40 కోట్లు మంజూరైనా, పర్యావరణాన్ని సాకుగా చూపించి, అటవీశాఖ అనుమతి ఇవ్వలేదు" అని జయపాల్ ఆరోపించారు.

"కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి" అని ఆయన కోరుతున్నారు. పార్లమెంటు సభ్యులు అనుకుంటే, సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తీయించడం, షార్ రాకెట్ సెంటర్ వద్ద పనులు చేయించడానికి అనుమతి మంజూరు చేయించడం పెద్ద సమస్య కాదు" అనేది జయపాల్ వ్యక్తం చేసిన అభిప్రాయం. చేపలవేటకు ఫ్రీజోన్ నిర్ణయించాలని ఆయన కోరుతున్నారు. ఇదిలావుండగా..


నిబంధనలు ఇవి

సముద్రతీరం నుంచి ఎనిమిది కిలోమీటర్లలోపు ఆ తరువాత కొంత దూరం వరకు చిన్న ఇంజిన్ ఉన్న బోట్లతో చేపలవేటకు అనుమతి ఉంది. ఈ ప్రదేశంలో మెకనైజ్డ్ బోట్లతో చేపల వేటకు నిబంధనలు అనుమతించవు. అయితే,
పొరుగు రాష్ట్రాల జాలర్లు ఒడ్డు నుంచి 23 కిలోమీటర్ల ఆవతలే చేపలు పట్టకోవడానికి అనుమతి ఉంది. వీరంతా కొన్ని రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి, అందుకు సరిపడ సామగ్రి, ఆహారం నిలువ చేసుకుంటారు. ఈ పడవల్లో పది మందికి వరకు ప్రయాణం సాగిస్తారు. ఒకేసారి టన్నుల కొద్దీ చేపల వేటాడే ఆధునాతన వలలు, సాంకేతిక పరిగ్నానం వారి సొంతం. వలలకు చిక్కిన చేపలను సముద్రంలోనే బోటులోకి చేర్చడం కష్టంగా కావడం వల్ల చిన్నపాటి యంత్రంతో చేపలు నిండిన వలలు, సముద్రంలో నుంచే బోటులోకి లాగేందుకు వాడుతుంటారని చెబుతున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోయి, ఆంధ్రా జలాల్లోకి ప్రవేశిస్తున్నారని చెబుతున్నారు.

180 హార్స్ పవర్ కాకుండా, 500 పవర్ ఇంజిన్లు వాడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాధారణ వాహనాల్లో మాదిరి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న పడవులు వాడుతూ తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. వారి పడవల ధాటికి వలలు ధ్వంసం అవుతున్నాయని ఆంధ్రా మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. తమ నుంచి చేపలు దోచుకుని వెళుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు.


ప్రకటనకే సాగరమాల పథకం
పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీయిస్తే, సముద్ర జలాలు ప్రవహించి, మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. పర్యాటకరంగం అభివృద్ధి జరుగుతుందని తిరుపతి జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

"పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిరాయ దరువు వద్ద పూడికతీయించి, మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించాలి" అని కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ జేసీ శుభం బన్సల్ తో కలిసి సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఇంతవరకు సవ్యంగానే ఉన్నప్పటికీ, అది సాధ్యం కాదనే విషయం వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ శామ్యూల్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఏ.నాగరాజు అధికారిక సమీక్షలో చెప్పిన విధానంతో స్పష్టం అవుతోంది.

"పులికాట్ సరస్సు ముఖద్వారంలో పూడికతీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు సమకూర్చే విధంగా రూ. 97.09 కోట్లకు సాగరమాల పథకం కింద అనుమతులు లభించాయి. నిధులు విడుదల కాలేదు" అని వారు స్పష్టం చేశారు.

వారు ఇంకా చెప్నారంటే..

తమిళనాడు ప్రాంతంలోని పులికాట్ సరస్సు సముద్రముఖ ద్వారం పెజావర్ గాడ్ వద్ద ఒకటే ఉంది. అయినా ఏడాది పొడవునా నీరు ఉంటుంది. ఎందుకంటే ఈ సరస్సు ఉత్తరం నుంచి దక్షిణానికి ఏటవాలుగా ఉండడమే.

తమిళనాడుకు వరం

పులికాట్ సరస్సు 461 కిలోమీటర్లలో విస్తరించి ఉండగా, ఏపీలో 400 కిలోమీటర్లు ఉంది. ఏపీలోని రెండు ముఖద్వారాల వద్ద పూడిక తీయడం వల్ల సముద్రం నీరు పులికాట్ లో చేరి, చేపల వేట వల్ల మత్స్యకారులకు జీవనోపాధికి అవకాశం ఉంటుంది. అయితే,

ఆంధ్రా ప్రాంతం వైపు పులికాట్ సరస్సుకు పూడి సమీపంలోని రాయదరువు, తూపిలిపాలెం సమీపంలోని కొండూరుపాలెం వద్ద సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అయినా, ఈ ప్రాంత సరస్సుకు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఏపీలోని ఈ రెండు ముఖద్వారాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. సముద్రం నీరు పులికాట్ సరస్సులోకి ప్రవహించే పరిస్థితి లేదు.

"పులికాట్ సరస్సు ఉత్తరం నుంచి దక్షిణానికి ఏటవాలుగా ఉంటుంది. దీనివల్ల జూన్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే పులికాట్ లో నీరు ఉంటుంది.

"ఏడాది పొడవునా, నీరు ఉండే, తమిళనాడు వైపు పులికాట్ సరస్సులోకి మార్చి నుంచి జూన్ లో ఏపీ మత్స్యకారులను అటువైపు అనుమతించడం లేదు. దీంతో ఈ సమస్య ఎప్పుడూ ఉంటోంది" అని వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ శామ్యూల్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఏ.నాగరాజు స్పష్టం చేశారు.

ఈ సమీక్ష ద్వారా పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద ఇసుకమేటలు లోడేది లేదు. నీరు వచ్చేది లేదు. ఇవన్నీ జరగాలంటే, కేంద్రం సాగరమాల పథకం కింద మంజపూరు చేసిన రూ. 97.09 కోట్లు మంజూరు చేసే వరకు ఆంధ్రప్రాంత ప్రాంత మత్య్సకారులకు కష్టాలే తీరే వాతావరణం కనిపించడం లేదు.
Read More
Next Story