అబ్బాయిది అనంతపురం జిల్లా. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అమ్మాయిది తెలంగాణ. ఆమె ఎస్టీ సామాజికవర్గానికి చెందిన యువతి డిగ్రీ మధ్యలో ఆపేసింది. అయిన వారెవ్వరూ వారిని పట్టించుకోవడం మానేశారు. స్వశక్తి, దాతల సహకారంతో అబ్బాయి డిగ్రీ చదివాడు. ఆ అమ్మాయి డిగ్రీ మానేసింది. కొన్ని సంస్థల కార్యక్రమాల్లో పాల్గొన్న వారిద్దరికీ పూర్వ పరిచయం ఉంది. డిగ్రీ చదివిన యువకుడికి ఓ స్వచ్ఛంద సంస్థ సాంకేతిక విద్య బోధించింది. ఆ సంస్థ ప్రతినిధి సహకారం, జిల్లా ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో వారిద్దరూ దంపతులయ్యారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, దంపతులైన వారిద్దరూ అంధులు కావడమే. వారిని రక్తసంబంధీకులు కాదనుకున్నారు. స్వచ్ఛంద సంఘాలు అక్కున చేర్చుకున్నాయి. వారి మనసులోని మాట తెలుసుకుని వివాహం చేయడంతో పాటు జీవనోపాధికి కూడా అండగా నిలిచే విధంగా అనంతపురంలోని 'సాయి ట్రస్ట్' ఆధ్వర్యంలో అంధుల ఆదర్శ వివాహం చేయడంతో పాటు సాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా డీ. హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన లోకేష్ అంధుడు. ఆయనతో తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా సిర్పూర్ తాలూకా అచ్చల్ల గ్రామానికి చెందిన గిరిజన యువతి రాథోడ్ సునీతతో సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీసీఈఎస్ (Visually challenge Employee association) సహకారంతో గురువారం సాయి ట్రస్ట్ ద్వారా అనంతపురం నగరంలోని తపోవనంలోని చిన్మయ జగదీశ్వరాలయంలో వివాహం జరిపించారు. మొదట సీతారాములకు పూజలు నిర్వహించి అనంతరం వివాహతంతు దేవరకొండ బాలాజీ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ , చిన్మయ మిషన్ ఆత్మ విధానంద, అనంతపురం నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాకుండా, వారికి నగదు పారితోషికం అందించారు. భవిష్యత్తులో తమవంతు సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "బాహ్యసౌదర్యం కంటే ఆత్మసౌందర్యం ప్రధానం" అని అన్నారు. కులాలు వేరైనా పరస్పర అవగాహనతో ఒక్కటి కావడం అభినందనీయం అన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ మతం కన్నా మానవత్వం మిన్న అంటూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని కోరారు.
102 వివాహాలు
తమ సంస్థ ద్వారా ఆ యువతీ, యువకులను దంపతులను చేశాం అని సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయసాయికుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన లోకేష్ కు మా సంస్థలోనే కంప్యూటర్ శిక్షణ కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. ఎక్కడ ఉద్యోగం దొరకని స్థితిలో మా సంస్థ అండగా నిలిచిందని తెలిపారు. "తన సొంతకాళ్లపై జీవించాలని లోకేష్ చిన్నపాటి సౌండ్ సిస్టంతో కూడళ్లలో పాటలు పాడుతూ, సంపాదించుకుంటున్నాడు" అని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా ఈ తరహా 102 ఆదర్శ వివాహాలు జరిపించాం" అని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. "తాజాగా వివాహం చేసిన వరుడు లోకేష్ మంచి గాయకుడు. ఆయన జీవనానికి ఇబ్బంది లేకుండా కలెక్టర్ ద్వారా సంగీత పరికరాలు మంజూరు చేయిస్తాం" అని తెలిపారు. "ఆ దంపతులిద్దరికీ ఒక్కొక్కరికి నెలకు రూ. ఆరు వేలు పింఛన్ వస్తోంది. వారి జీవనానికి ఏమి ఇబ్బంది లేదు. మేము అండగా ఉంటాం" అని విజయసాయికుమార్ చెప్పారు. దేవాలయ కమిటీ సభ్యులు రామంజి, మురళి తోపాటు సాయి సంస్థ సభ్యులు రాఘవేంద్ర, నారాయణ నాయక్, ప్రవీణ్, National federation of Blind (NFB) అధ్యక్షుడు విజయభాస్కర్, Visually challenge Employee association అధ్యక్షుడు జలంధర్, పార్టీలు, సంస్థల నేతలు పాల్గొన్నారు. వధువు కోసం అనంతపురం జోయ లుకాస్ సంస్థ మాంగల్యం కానుకగా అందించిందని విజయసాయికుమార్ వివరించారు.