అనంత వేదికగా.. దేశవాళీ క్రికెట్ సంబరం
x

'అనంత" వేదికగా.. దేశవాళీ క్రికెట్ సంబరం

అనంతపురం క్రికెట్ పండుగకు వేదికగా నిలిచింది. దులీప్ ట్రోఫీ-2024 సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఇక్కడ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.


దేశవాళీ క్రికెట్ సంబరానికి అనంతపురం సిద్ధమైంది. సెప్టెంబర్ ఐదో తేదీ ( గురువారం) నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ నిర్వహణ అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అనంతపురం క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో 22వ తేదీ వరకు క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. అనంతపురంలోని ఆర్డీటి ( rural development trust stadium- cricket ground in Anantapur) ఈ క్రికెట్ క్రీడా సంబరం జరుగుతుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో దులిప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు జరుగుతాయని ట్రోఫీ త్రీ మెన్ కమిటీ సభ్యుడు, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ ఫాదర్ మాంఛు ఫెర్రర్ తెలిపారు.




"4,100 మంది కూర్చునేందుకు స్టేడియం వెసులుబాటు ఉంది. ఆ మేరకు పాసులు కూడా జారీ చేస్తాం" అని ఫెర్రర్ వెల్లడించారు.


2024-25 భారత క్రికెట్ జట్టు దేశీయ సీజన్ ను ప్రారంభించడానికి దక్షిణాది రాష్ట్రాలకు బీసీసీఐ ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరు చినస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ క్రీడా సంబరాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.


భారత క్రికెట్ జట్టు దేశీయ సీజన్ లో ఏడాది ప్రతిష్టాత్మకమైన దేశీయ టోర్నమెంట్ చాలామంది క్రికెట్ క్రీడాకారులకు కీలకమైనది. ప్రదర్శించే ఆట తీరు ప్రామాణికంగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇందులో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులను బంగ్లాదేశ్ తో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపిక చేసే అవకాశంఉంది.


రాష్ట్రంలో వాతాపరణ పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే, దులిప్ ట్రోఫీ -2024 నిర్వహణకు అనంతపురం అనబోయిన ప్రాంతంగా గుర్తించినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రోహిత్ వర్మ చెప్పారు. "రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం బాగా లేకపోవడం వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలను పరిగణలోకి తీసుకున్నాం" రోహిత్ వర్మ స్పష్టం చేశారు.

బిజీబిజీగా ప్రాక్టీస్ మ్యాచ్


దులీప్ ట్రోఫీలో పాల్గొనడానికి అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు ఆర్డిటి క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంతర్జాతీయ క్రీడాకారులు రావడంతో ప్రాక్టీస్ మ్యాచ్లను చూడడానికి పట్టణంతోపాటు రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి క్రికెట్ క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఆర్డిటి మైదానం వద్దకు చేరుకున్నారు. అభిమానుల నుంచి క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనంతపురం ఎస్పీ జగదీష్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ క్రీడాకారులు బస్ చేసిన హోటళ్ల వద్ద కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. వారితో సెల్ఫీలు దగడానికి క్రీడాభిమానులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఆర్ఢీటీ స్టేడియం వద్ద భారీగానే మోహరించిన పోలీసులు అభిమానులను కట్టడి చేస్తున్నారు.


క్రీడాకారులకు కీలకం


దులీప్ ట్రోఫీ 2024- 25 భారత క్రికెట్ జట్టు దేశీయ సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ చాలా మంది భారతీయక్రీడాకారలుకు కీలకమైనది. ఈ ఏడాది చివరిలో బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్లో జరగనున్న టెస్ట్ సిరీస్ జట్లలో చోటు దక్కించుకోవాలంటే, ఇక్కడ ప్రదర్శనలలు కీలకం కానున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఇదే అంశంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ వర్మ మాట్లాడుతూ, "ఈ నెల 22వ తేదీ వరకు అనంతపురంలో మ్యాచ్ లు జరుగుతాయి. కొన్ని రోజుల్లో భారత జట్టు క్రీడాకారుల ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్రీడాకారుల స్థానంలో ఇంకొందరు కలుస్తారు" అని వివరించారు.

దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు ఇలా..
గతానికి భిన్నంగా మ్యాచ్ లు నిర్వహించనున్నారు. గతంలోని జోనల్ ఫార్మాట్ మాదిరిగా కాకుండా, బీసీీసఐ నాలుగు జట్ల ఫార్మాట్ ఏర్పాటు చేసింది. ఏ,బీ,సీ, డీ పేర్లతో జట్టు ఏర్పాటు చేశారు.

సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు: ఏ వర్సెస్ బీ: చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు: సీ వర్సెస్ డీ : ఆర్డీటీ స్టేడియం అనంతపురం
సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు: ఏ వర్సెస్ డీ: ఆర్డీటీ స్టేడియం అనంతపురం
సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు: బీ వర్సెస్ సీ: ఏసీఏ, ఏడీసీఎ అనంతపురం
సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు: బీ వర్సెస్ డీ: ఏడీసీఏ అనంతపురం
సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు : ఏ వర్సెస్ సీ : ఆర్డీటీ స్టేడియం, అనంతపురం

అందరికీ అవకాశం ఉండాలి
అనంతపురం కరువు ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ అంతర్జాయ క్రీడాకారులతో క్రికెట్ పోటీలు నిర్వహించే అవకాశం దక్కింది. దీనిపై త్రీమెన్ కమిటీ సభ్యుడు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్ మాట్లాడారు. 2004లో మొదట ఇక్కడ రంజీ మ్యాచ్ జరిపాం. ఆ అనుభవం నేర్పిన పాఠాలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. అన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఐదు మ్యాచ్ లు జరుగుతాయి. యువ క్రికెటర్లు, అభిమానులు వచ్చిన వారే మళ్లీ.. మళ్లీ కాకుండా, అందరూ స్టేడియంలోకి రావడానికి సహకారం అందించాలి" అని ఫెర్రర్ సూచించారు.
"పిచ్ బాగుంది. గ్రౌండ్ కూడా క్రీడాకారులకు సదుపాయంగా ఉంది" అని చెప్పిన ఫెర్రర్, బీసీసీఐ నుంచి వచ్చిన ఇద్దరు క్యూరేటర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు" అని ఫెర్రర్ చెప్పారు.
"మారుమూల ఎందుకు ఎంపిక చేశారబ్బా అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తరువాత వాతావరణం చాలా అనుకూలంగా ఉంది" అని చాలా మంది అంతర్జాతీయ వేదికల అనుభవం ఉన్న క్రికెట్ అనుభవజ్నులు కూడా మనసులో మాట వెల్లడించారు" అని ఫెర్రర్ ఉత్సాహంగా తెలిపారు.
"వర్షాలు కురిసినా ఇబ్బంది లేదు. విశాఖ అంతర్జాతీయ స్టేడియం నుంచి యంత్రాలు తెప్పించాం. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగానే ఉంది" అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషియన్ కార్యదర్శి రోహిత్ వర్మ చెప్పారు. గంటల వ్యవధిలో గ్రౌండ్ శుభ్రం చేయడం ద్వారా క్రికెట్ కొనసాగించడానికి అవసరమమైన సదుపాయాలు ఉన్నాయి" అని వర్మ వివరించారు.


రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ సంబరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా సంసిద్ధమైంది. అనంతపురం జిల్ల ా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్టేడియంలో ఆయన పర్యటించి, జిల్లా అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.
Read More
Next Story