
గుర్రంపై తాడిపత్రిలో పర్యటిస్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి (ఫైల్)
తాడిపత్రి నా అడ్డా.. నా ఊరు.. మంటలు రేపిన మాటలు..
ఏఎస్పీపై జేసీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యలతో పోలీసులు సీరియస్.
రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్రదర్స్ అంటే తెలియని వారు లేరంటే అతిశేయోక్తి కాదు. మంత్రి జేసీ. దివాకరరెడ్డి ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి కూడా ఓకే సారూప్యం. వారిద్దరి మాటతీరు, హావభావాలు మిగతా నేతలకు భిన్నంగా ఉంటాయి. వారిద్దరు ఏమి చేసినా సంచలమే. మాట్లాడితే వివాదాల భూపంకమే. ప్రస్తుతం ఇదే జరుగుతోంది.
పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం రోజు తాడిపత్రిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోనే మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ఆయనపై చర్యలు తప్పవని అనంతపురం ఎస్పీ జగదీష్ కూడా స్పష్గం చేశారు.
తాడిపత్రి రూటే వేరు..
అనంతపురం జిల్లాలో 13 నియోజకవర్గాలు ఒక ఎత్తు. తాడిపత్రి మాత్రం నిత్యం వివాదాల సుడిగుండంగా మారింది. రాజకీయంగా కాకమీద ఉండే తాడిపత్రిలో టీడీపీ వర్సస్ పోలీస్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ జగదీష్ సీరియస్ గా తీసుకోవడంతో రగడ మరోమలుపు తిరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది.
తాడిపత్రి నాది. ఇక్కడ నేను రాజును అన్నట్లే జేసీ ప్రభాకరరెడ్డి వ్యవహారం సాగుతుంటుంది. వీధుల్లో చెత్తవేస్తే దండన తప్పదని కర్రపట్టుకుని కూర్చొన్న హోర్డింగ్ పెట్టినా.. అనుచరులతో గుర్రంపై తిరగడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం షాపులకు టెండర్లు పిలిచినప్పుడు కూడా..
"మద్యం షాపుల్లో కమీషన్ ఇవ్వాలి" అని హెచ్చరిక జారీ చేసిన ప్రభాకరరెడ్డి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ డబ్బు తాడిపత్రి అభివృద్ధికి ఖర్చు చేయడానికే అని చెప్పిన వివాదం ఆ తరువాత సద్దుమణిగింది. ఇదిలావుంటే..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి రానివ్వకుండా చేయడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ. ప్రభాకరరెడ్డి రాజకీయంగా ఆధిపత్యం సాధించారు. ఇది వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ వివాదం సాగుతుండగానే
ఈ నెల 21వ తేదీ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం రోజు తాడిపతి అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
జేసీ ప్రభాకరరెడ్డి, అనంతపురం ఎస్పీ జగదీష్ కు పుష్నగుచ్చం ఇస్తున్న తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
జేసీ ప్రభాకరరెడ్డి ఏమన్నారంటే..
ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగిస్తూనే ఉన్నారు. ఈసారి జేసీ ప్రభాకరరెడ్డి ఏకంగా పోలీసులపైనే విమర్శలు సంధించి, దూషణలకు దిగారు.
"ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పనికిమాలిన వాడు.ఎస్ఐ, కానిస్టేబుళ్లు లేకుండా బయటకు రాలేదు. తాడిపత్రిలో నేరాలు తగ్గడానికి ఏఎస్పీ వల్ల జరగలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వల్లే జరిగింది" అని జేపీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని జేసీ పట్టణంలో రాళ్లదాడి జరుగుతుంటే, కార్యాలయం నుంచి కూడా ఏఎస్పీ బయటకు రాలేని స్థితిలో మిగిలిపోయారు" అని ఎద్దేవా చేశారు. బహిరంగ వేదిక నుంచి ఆయన మాట్లాడడం పోలీసులను ఆలోచనలో పడేసింది.
జేసీ బ్రదర్స్ అడ్డా...
తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ గా ఉన్న మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఆయన తమ్ముడు జేసీ దివాకరరెడ్డిదే పెత్తనం. 1985 నుంచి 2009 వరకు జేసీ దివాకరరెడ్డి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు.
రాష్ర్ట విభజన తరువాత జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరారు. 2014లో దివాకరరెడ్డి అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన తమ్ముడు జేసీ. ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నాటికి దివాకరరెడ్డి కొడుకు పవన్ రెడ్డి ఎంపీగా, దివాకరరెడ్డి కొడకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
2024 ఎన్నికల నుంచి మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి సైలెంట్ అయ్యారు. రాజకీయాల్లో కూడా ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా అస్మిత్ రెడ్డి విజయం సాధించారు. దివాకరరెడ్డి కొడుకు పవన్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ హవాలో కూడా 2019 తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జేసీ ప్రభాకరరెడ్డి విజయం సాధించడం ద్వారా ఆధిపత్యం చాటుకున్నారు. గతానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన రాజకీయ వ్యవహారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలో పడేస్తున్నన్నట్లు ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
పోలీస్ అధికారులు సీరియస్
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మాటతీరు వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ ఏమన్నారంటే..
"పోలీస్ అధికారిని దూషించిన జేసీపై చర్యలు తప్పవు. ఆయన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీలు స్వాధీనానికి దీనికి న్యాయ సలహా తీసుకుంటాం" అని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు.
జేసీ క్షమాపణ చెప్పాల్సిందే..
పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల దినోత్సవం రోజే ఐపీఎస్ అధికారిని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అవమానించారు. ఆయన పోలీస్ అధికారికి క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తీసుకున్న చర్యల వల్లే సాధ్యమైందని పోలీస్ అధికారుల సంఘం గుర్తు చేసింది. పోలీస్ అధికారులను అవమానించడం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డికి మంచిది కాదని కూడా హితవు పలికారు. ఏఎస్పీతో ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ, పోలీస్ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడడం తగదని హితవు పలికారు.
అసలు కారణం ఇది
కొన్ని రోజుల కిందట యాడికి మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జేసీ ప్రభాకరరెడ్డి మద్దతుదారులు దౌర్జన్యం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నిందితులపై కేసులు నమోదు చేయడం జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహానికి కారణమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత కూడా ఏఎస్పీ తన మాట ఖాతరు చేయడం లేదని ఆగ్రహం ఉన్నట్లు చెబున్నారు.
"నేను వినతిపత్రం ఇవ్వడానికి వెళితే ఏఎస్పీ రోహిత్ తిరస్కరించారు" అని జేసీ ప్రభాకరరెడ్డి నిరసనకు దిగారు.
"ఏఎస్పీ కార్యాలయం ఎదురుగానే మంచంపై పడుకున్నారు" పోలీస్ కార్యాలయం వద్ద ఇలా చేయడాన్ని కూడా ఆ శాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
తాడిపత్రిలో ఏమి జరుగుతోంది?
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్మేగా విజయం సాధించారు. జేసీ ప్రభాకరరెడ్డి ఇంట్లోకి దూరి, స్వైరవిహారం చేయడం అనేది రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రిలో ప్రతీకార రాజకీయాలకు తెరతీసినట్టే కనిపించింది. జేసీ ప్రభాకరరెడ్డి మద్దతుదారులు తీవ్రస్థాయిలో తిరగబడి పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించడం, ఆ మిద్దెపైనే టపాసులు పేల్చి సంబరాలు చేసిన నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులతో అట్టుడికింది. ఆ తరువాతి నుంచి మాజీ ఎమ్మెల్యే అనంతపురం పట్టణానికి మాత్రమే పరిమితం చేశారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకోవడం, పెద్దారెడ్డి పట్టణంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు ఆంక్షలు విధించడం,
"ఎలా వస్తావో చూస్తా" అని జేసీ ప్రభాకరరెడ్డి రోడ్డుపైకి రావడం వంటి ఘటనల నేపథ్యంలో ఉద్రిక్తలు సర్వసాధారణంగా మారాయి. ఈ పరిస్థితులు చక్కబడని స్థితిలో పోలీసులు కూడా నిత్యం అప్రమత్తంగా మెలగక తప్పని వాతావరణంలో..
తాడిపత్రి ఏఎస్సీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. ఈ మంటలు ఎలా చల్లారుస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Next Story