Operation Sindhur | కల్లితండాలో కన్నీటి ధార..బోరున ఏడ్చిన పవన్ కల్యాణ్
x
మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Operation Sindhur | కల్లితండాలో కన్నీటి ధార..బోరున ఏడ్చిన పవన్ కల్యాణ్

ఆ వీరుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల పరిహారం అందిస్తామని కల్యాణ్ ప్రకటించారు. నాయక్ భౌతికకాయానికి మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. ఇంకా ఏమి చెప్పారంటే..


కాశ్మీర్ వద్ద యుద్ధభూమిలో వీరమరణం చెందిన ఎం. మురళీనాయక్ భౌతిక కాయానికి రాష్ట్ర మంత్రులు ఆదివారం ఉదయం ఘన నివాళులర్పించారు. కల్లి తండాకు చేరుకున్న మంత్రులు నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వ నుంచి ఆదుకునేందుకు ప్రకటన కూడా చేశారు.


వీరజవాన్ భౌతికకాయానికి నివాళులర్పించడానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ ఎక్కువ సమయం మురళీనాయక్ శవపేటిక వద్దే కూర్చొన్నారు. నాయక్ తల్లిదండ్రులను సముదాయించి, ధైర్యం చెప్పారు ఆ తరువాత అక్కడికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు.
"నన్ను కలవాలని ఉవ్విళూరిన నా అభిమాని మురళీనాయక్ ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేదనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, ఎస్. సవితమ్మ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తదితరులు కల్లి తండాకు చేరుకున్నారు.

వీరజవాన్ ఎం. మురళీనాయక్ భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనంగా నివాళులర్పించారు. మురళీనాయక్ తండ్రి భోరున విలపిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాళ్లపై పడ్డారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ తీవ్ర ఉద్విజ్ణతకు లోనై, కన్నీరు పెట్టారు. నేలపై కూర్చొనే శ్రారం నాయక్ ను అక్కున చేర్చుకున్న పవన్ కల్యాణ్ ఓదార్చారు.
రూ. 50 లక్షల పరిహారం

యుద్ధభూమిలో వీరమరణం చెందిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కల్లి నాయక్ తండాకు ముందుగా మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకుని నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి అందించే సాయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్..
"వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి రాస్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు పరిహారం అందివ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆ కుటుంబానికి ఐదెకరాలు పొలం, వారు కోరుకున్న చోట 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరు, లేదా మురళీనాయక్ మామకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం" అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
"మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు అందిస్తా" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
"మురళీ నాయక్ తన అభిమాని అని చెప్పారు. కానీ ఆయనను ఇలా చూస్తానని అనుకోలేదు" అని చెబుతూ పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కల్లి తండాలోని నివాసం వద్ద వీరజవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి మంత్రలు నారా లోకేష్, సవితమ్మ, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ ఎంపి పార్థసారథి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్ అధికారులు, పార్టీల నాయకులు, అశేషంగా తరలివచ్చిన ప్రజాలు ఘన నివాళులర్పించారు.
ఆయన త్యాగం నిరుపమానం
దేశ రక్షణ మన కర్తవ్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కోరారు. మురళీనాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించిన తరువాత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా,

"వీరజవాన్ మురళీ నాయక్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వీరాభిమాని" అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు.
పవన్ కల్యాణ్ ను ఒక్కసారి అయినా కలవాలని మురళీనాయక్ చెబుతూ ఉండేవారని ఆయన స్నేహితులు తనతో అన్నారు" అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
"మురళీనాయక్ ను పవన్ కల్యాణ్ ఇలా చూస్తారు" అని అనుకోలేదని మంత్రి సత్యకుమార్ మీడియోతో చెబుతుండగా, పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ మరింత భావోద్వేగానికి గురయ్యారు.
"ఇలాంటి పరిస్థితి మన పౌరులకు రాకూడదు. కానీ దేశం కోసం త్యాగం చేసిన వీరుడు మురళీనాయక్" అని పవన్ కల్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత కూడా పాకిస్థాన్ కుటి బుద్ధిని మరోసారి బయటపడిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో దేశం కోసం, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలకు జాతి మొత్తం అండగా ఉంటుంది" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తండా ప్రజలతో లోకేష్ మమేకం

వీరజవాన్ భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోరంట్ల మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కల్లి నాయక్ తండాలోని మురళీనాయక్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే తండా మొత్తం జిల్లా నుంచే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, జనంతో కిటకిటలాడుతోంది.

వీరజవాన్ భౌతికకాయం పేటిక వద్ద మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం ఉంచి, నివాళులర్పించారు. నాయక్ తల్లిదండ్రులు ఎం. జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చిన మంత్రి లోకేష్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడి తండా ప్రజల మధ్యే శవపేటిక వద్ద కుర్చీలో కూర్చున్నారు. మురళీనాయక్ కుటుంబ పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన వారి కుటుంబంలో ఒకరిగా మారిపోయారు. నాయక్ బంధువులందరితో మాట్లాడుతూ కనిపించారు.
కొందరి నుంచి సమస్యలు కూడా తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సమీపంలోనే ఉన్న హోంమంత్రి వంగలపూడి అనితను దగ్గరకు పిలిచి సూచనలు ఇస్తూ, అక్కడి ప్రజలతో మమేకం అయ్యారు.

జనసంద్రమౌన కల్లి తండా

కాశ్మీర్ యుద్ధభూమిలో వీరమరణం చెందిన మురళీ నాయక్ భౌతికకాయం పేటిక శనివారం రాత్రి గోరంట్ల కూడలికి తీసుకుని వచ్చారు. అంతకుముందు రాష్ట్ర సరిహద్దులోని సత్యసాయి జిల్లాలోకి మురళీనాయక్ భౌతికకాయం పేటిక ఉన్న అంబులెన్స్, మిలిటరీ వాహనం రాగానే జోరు వర్షం కురుస్తున్నా, లెక్కచేయని ప్రజలు ప్రతిగ్రామం వద్ద వాహనాలపై పూల వర్షం కురిపించారు. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన ప్రజలు దిక్కులు పిక్కటిల్లే నినాదాలు చేస్తూ, అడుగడుగునా నీరాజనాలు పలికారు. వర్షంలోనే మంత్రి ఎస్. సవితమ్మ జాతీయజెండా చేతపట్టి గోరంట్ల కూడలి నుంచి కల్లి తండా వరకు అశేష ప్రజానీకం వెంట వస్తుండగా నడిచి వెళ్లారు. దీంతో గోరంట్ల తోపాటు గ్రామాలు, రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.



Read More
Next Story