
ఆలయంలో పూజలు చేస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
కుప్పకూలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే.. నిలకడగా ఆరోగ్యం
అమ్మవారి గండదీపం మోస్తూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ స్పృహ తప్పి కింద పడిపోయారు.
దాదాపు 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలకు హాజరైన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆలయంలో పూజల తర్వాత గండదీపం మోసిన కాసేపటికి ఆమె స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో భూమా మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. వెంటనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నె (w govidinne) లో మూలపెద్దమ్మ దేవరకు కర్నూలు జిల్లాలో విశిష్టత కలిగిన ఉత్సవం. డబ్ల్యూ. గోవిందిన్నే దేవర ఉత్సవాలు గడచిన 11 ఏళ్లుగా నిర్వహించడం లేదు.
డబ్ల్యు. గోవిందిన్న గ్రామంలో మూలపెద్దమ్మతల్లి దేవర ఉత్సవాలకు హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఈ ఏడాది ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. గ్రామంలో మూల పెద్దమ్మ దేవర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని ప్రతి ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ గ్రామంలో నిర్వహించే ఉత్సవం ఏర్పాట్లును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఆదివారం ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమ్మవారికి పూజలు కూడా నిర్వహించారు. డబ్ల్యూ గోవిందిన్నే గ్రామంలో ఆదివారం ప్రారంభమైన మూల పెద్దమ్మ దేవర ఉత్సవాలు మూడు రోజులు పాటు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు అందులో భాగంగా..
గండదీప పూజలు
గ్రామంలోని మూల పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం గండ దీప పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు అమ్మవారికి పూజల అనంతరం కొద్దిసేపు గండదీపాన్ని మోయడం ద్వారా మొక్కుబడి చెల్లించారు. ఈ కార్యక్రమం కాసేపట్లో ముగుస్తుంది అనుకుంటుండగా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఉత్సవాలకు హాజరైన ఆమె మద్దతుదారులతో పాటు గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బిపి కారణంగానే ఆమె కళ్ళు తిరిగి పడిపోయినట్లు సమాచారం అందింది
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వెంటనే అంగరక్షకులు, ఆమె మద్దతుదారులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమెకు వైద్య సేవలు అందుతున్నట్లు తెలిసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలబడగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు, భూమా కుటుంబీకుల అభిమానులు, మద్దతుదారులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు సమాచారం అందింది.
Next Story