దారులన్నీనెల్లూరు వైపే  రొట్టెలే.. అక్కడ పండుగ
x

దారులన్నీనెల్లూరు వైపే రొట్టెలే.. అక్కడ పండుగ

ఏడాదికి ఒకసారి అక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇంకొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ ఉత్సవానికి దక్షిణ భారతదేశంలోని దారులన్నీ అటే సాగుతున్నాయి. విదేశాల నుంచి కూడా తాకిడి ఎక్కువగా ఉంటుంది.


ఆ ప్రదేశం మతసామరస్యానికి ప్రతీక. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా, స్వర్ణాల చెరువు రొట్టెల పండుగకు సిద్ధమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలే కాకుండా, హిందువులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇందుకోసం స్వర్ణాల చెరువు సమీప ప్రాంతాలను జిల్లా యంత్రాంగం శోభాయమానంగా తీర్చిదిద్దింది.



నెల్లూరులోని బారాషాహీ దర్గా వద్ద బుధవారం వేకువజామున బారాషాహీ దర్గా వద్ద గంథమహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత రొట్టెలు మార్చుకునే పండుగ ప్రారంభం అవుతుంది. 18వ తేదీ ఉరుసు జరుగుతుంది. 19వ తేదీ ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 21వ తేదీతో ముగుస్తుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మొహరం ముగిసిన పదో రోజు తరువాత వేకువజామున స్వర్ణాల చెరువు వద్ద జరిగే ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.


400 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. అరబ్బు దేశానికి చెందిన ఇస్లాం మత ప్రచారకులు బోధనలు చేశారు. వారికి ఇస్లామేతరులకు నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన పవిత్ర యుద్ధంలో తురుక్ మాన్లు 12 మంది షహీద్ల మొండాలు తీసుకుని వచ్చి, స్వర్ణాల చెరువు వద్ద వదిలారు. వారికి అక్కడ సమాధి చేశారు. కాలక్రమంలో వారి సమాధులు అక్కడ నిలిచాయి. ఆర్కాట్ నవాబు కోరిక నెరవేరిన నేపథ్యంలో మరుసటి ఏడాది నుంచి ఇక్కడ బారా షాహీద్ దర్గాకు వచ్చి, మొక్కులు చెల్లించడంతో పాటు స్వర్ణాల చెరువులో రెట్టె విడిచినట్లు ఓ కథనం.ఆ తరువాత 1930 నుంచి ఈ పండగ ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది.

మొహరంలో పదో రోజు పీర్లు ఊరేగించిన తరువాత, విశ్రాంతి కల్పిస్తారు. ఆ అమరజీవులను స్మరిస్తూ, ఇంటి వద్దనే స్వచ్ఛమైన గోధుమపిండి, నెయ్యితో తయారు చేసిన చపాతీలు (రొట్టెలు) తీసుకుని నెల్లూరు సమీపంలోని బారాషాహీ దర్గా వద్దకు చేరుకుంటారు. అక్కడ సమాధి అయిన 12 మంది గుమ్మజ్ (సమాధులు) వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం సమీపంలోని స్వర్ణాల చెరువులో తమ మొక్కుబడులను చెల్లిస్తూ, తీసుకుని వచ్చిన రొట్టెలను మార్పిడి చేసుకుంటారు.


అనేక రకాలుగా మొక్కుకుంటున్నారు. తమ కోర్కెలు ఫలించిన వారు మరుసటి ఏడాది రెండు రొట్టెల వంతున అందుకు సంబంధించిన పేరుతో మనసులో అనుకుని రొట్టెలు తయారు చేసుకుని, దర్గా వద్దకు చేరుకుంటారు. చెరువు వద్ద వాటిని పంచుతారు. మిగిలిన వాటిని చెరువులో వదులుతారు. ఇది ఫలానా కోరిక రొట్టె అని చెరువు వద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. రొట్టెల పండుగ ముందు బారాషాహీ దర్గా వద్ద జరిగే గంథ మహోత్సవానికి ప్రాధాన్యత ఉంది.


ఇంతటి ప్రాధాన్యం కలిగిన నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పారిశుద్ధ్య పనుల కోసం దాదాపు ఐదు వేల మంది సిబ్బందిని నియమించారు. దర్గా ప్రాంగణాన్ని ఏడు జోన్లుగా విభజించి, ఏర్పాట్లు చేశారు.రెండు వేల మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, నెల్లూరు మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద, ఆర్డీఓ మాలోల, వివిధ శాఖల అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు.రొట్టెల పండుగకు వివిద ప్రాంతాల నుంచి వస్తున్న వారితో నెల్లూరు, నగరం, బారాషాహీ దర్గా ప్రాంతం కిక్కిరిసింది. వాహనాలను పార్కింగ్ చేయడానికి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంది.
Read More
Next Story