
AIYF | ఉపాధి ప్రాధమిక హక్కు కోసం లాంగ్ మార్చ్
తిరుపతిలో ముగిసిన AIYF మహాసభలు జాతీయ సభల తీర్మానాలను ఆ సంఘం ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు సమగ్రంగా అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ( AIYF) 17వ జాతీయ మహాసభలు డిమాండ్ చేశాయి. తిరుపతిలో 15వ తేదీ నుంచి-18వరకు తిరుపతిలో జరిగిన మహాసభల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. యువజనుల సమస్యలపై ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలను సోమవారం ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల రామన్ వివరించారు.
తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 680 మంది యువతీ, యువకులు ప్రతినిధులుగా హాజరయ్యారు. ఈ సభల్లో దేశ సమగ్రతలో యువకుల పాత్రపై కీలక అంశంగా చర్చించామని ఆయన చెప్పారు. ఈ సభల్లో AIYF జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రౌషన్ కుమార్ సిన్హా , ప్రధాన కార్యదర్శి సుగ్జిందర్ సింగ్ మహేసరితో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు.

1. జూలై నెలలో ఎన్నికల సంస్కరణల కోసం 5 కోట్ల సంతకాల ప్రచారం.
2. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం BNEGA ను అమలు కోసం అక్టోబర్ నుంచి లాంగ్ మార్చ్ నిర్వహించాలని సమావేశాలు తీర్మానించాయి.
ఐదు కోట్ల సంతకాల సేకరణ
దేశంలో ఎన్నికల నిర్వహణపై కూడా ఆందోళన వ్యక్తమైందని తిరుమల రామన్ చెప్పారు. గతంలో ఇంద్రజిత్ గుప్తా సారధ్యంలోని కమిటీ చేసిన సిఫారసులు అమలు చేయాలని మహాసభ తీర్మానించిందన్నారు. ఎన్నికల వ్యయం పూర్తిగా ప్రభుత్వమే భరించడం ద్వారా ధనస్వామ్య రాజకీయాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా యువతను చైతన్యం చేయడానికి
"ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేయాలనే డిమాండ్ తో జూలై నెలలో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేయాలి" అని తీర్మానించినట్లు తిరుమల రామన్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల నిర్వహణ తీరును ప్రజలకు వివరించడం తోపాటు ప్రభుత్వం అలాగే సీఈసీపై ఒత్తిడి తీసుకుని రావడానికే ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు.
అక్టోబర్ లో లాంగ్ మార్చ్
"యువత ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామనే ఎన్నికల హామీకి దిక్కులేకుండా పోతోందనే జాతీయ మహాసభల్లో ప్రతినిధులు, వివిధ వర్గాల మేధావుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం అయింది" అని తిరుమల రామన్ చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. దీంతో యువతకు ఉపాధి లేకుండా అల్లాడుతున్నారు.
"ఉపాధిని ప్రాధమిక హక్కు"గా చేర్చాలి అని రామన్ డిమాండ్ చేశారు. యువత కోసం కేంద్రంలో బీజేపీ సారధ్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం ( BNEGA ) చేసింది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు అందులో పనిచేసే సిబ్బంది వేతనాలు రూ. 30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..
"జూలై నెలలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని జాతీయ మహాసభ తీర్మానించింది" అని రామన్ వెల్లడించారు.
కార్యవర్గం ఎంపిక

అధ్యక్షుడు రౌషన్ కుమార్ సిన్హా, ప్రధాన కార్యదర్శి సుగ్జిందర్ సింద్
తిరుపతిలో జరిగిన AIYF జాతీయ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మూడేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తమిళనాడుకు చెందిన తిరుమల రామన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగారు. దీంతో AIYF జాతీ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన రౌషన్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ మహాసభ వరకు అధ్యక్షుడిగా పనిచేసిన పంజాబ్ కు చెందిన సుగ్జిందర్ మహేసరి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

ఉపాధ్యక్షులు: భారతి, ప్రదీప్ సేథి, హిమాన్షు, ఆర్తి రేడేకర్ ఎన్నికయ్యారు.
కార్యదర్శులు: టి.టి.జిస్మోన్, కర్ణాటకకు చెందిన హరీష్ బాలా, తెలంగాణ నుంచి డాక్టర్ సయ్యద్ వల్లి ఉల్లా ఖాద్రి, ఆంధ్రా నుంచి పర్చూరి రాజేంద్ర బాబుకు స్థానం దక్కింది.
ముందే చెప్పిన 'ఫెడరల్'
తిరుపతిలో జాతీయ మహాసభలు ప్రారంభం కావడానికి ముందే 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రత్యేక కథనం రాసింది. అందులో ఎవరు ఏ పోస్టుకు ఎంపిక అయ్యే అవకాశం ఉందనే విషయాలను స్పష్టం చేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం కర్ణాటక నుంచి హరీష్ బాల, హైదరాబాద్ నుంచి డాక్టర్ సయ్యద్ వల్లి ఉల్లా ఖాదిరి, బీహార్ నుంచి రౌషన్ కుమార్ సిన్హా పోటీ పడ్డారు.
వాడివేడిగానే చర్చ
జాతీయ కార్యవర్గం కూర్పులో వేడివాడిగానే చర్చ జరిగినట్లు తెలిసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ, ఏఐవైఎఫ్ జాతీయ ఇన్ చార్జి, సీపీఐ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కార్యవర్గంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్డారని సమాచారం. దీంతో కార్యవర్గాన్ని సమన్వయం చేయడానికి భేటీ అయిన సీపీఐ అగ్ర నేతలు అధ్యక్ష పదవికి బీహార్ రాష్ట్రానికి చెందిన రౌషన్ కుమార్ సిన్హా పక్కనే మొగ్గు చూపడం, తెలంగాణ నుంచి ఖాద్రి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు ప్రకటించిన సీపీఐ నేతలు వెళ్లిపోయిన ఘటన మొదటిసారి జరిగిందని ఓ AIYF ప్రతినిధి చెప్పారు.
Next Story