కరెంట్ చార్జీలు తడిసి మోపెడు: జగన్ బాటనే చంద్రబాబు
x

కరెంట్ చార్జీలు తడిసి మోపెడు: జగన్ బాటనే చంద్రబాబు

చార్జీల మోత ఉండదంటూనే కూటమి ప్రభుత్వం వినియోగదారులకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. ట్రూ అప్ పేరిట బాదుడుకు రంగం సిద్ధమైంది.


అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నేతలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆదాయ వనరులు పెంచుకోవడంలో మార్గాలు అన్వేషిస్తున్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల బాదుడుకు రంగం సిద్దం చేసింది. గత వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ట్రూ అప్ చార్జీల పేరిట ఆదాయం పెంచుకోవడానికి మార్గం సుగుమం చేసుకుంది.


వైసీపీ పాలనలో అమలు చేసిన భారం తగ్గిస్తామని సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. ఆ బాటలోనే యూనిట్ పై 83 పైసలు అదనంగా ట్రూ అప్ పేరిట డిసెంబర్ నుంచి వసూలు చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ విధంగా వినియోగదారులపై 6,072 కోట్ల రూపాయాలు భారం మోపనున్నారు. 2022 -23 వరకు వాడుకున్న విద్యుత్ కు యూనిట్ పై 83 పైసలు వసూలు చేసే విధంగా డిస్కంలు రూ. 8,114 కోట్లను ప్రతిపాదించాయి. అయితే, ఔదార్యం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) ఆ మొత్తంలో రూ,2042 కోట్లు తగ్గించింది. మిగతా రూ. 6,072 కోట్లు ఈ ఏడాది నవంబర్ నెల బిల్లులకు జత చేసి, డిసెంబర్ నుంచి వసూలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. 2022-23 సంవత్సరానికి ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌(FPPCA) వసూళ్లకు (Trueup Charhes) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (APERC) శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో డిస్కంలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు APERC ప్రకటించింది.
సామాన్యులపై భారం
మార్కెట్లో పెరిగిన ధరలతో ఇప్పటికే సామాన్య జనం సతమతం అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ట్రూ అప్ చార్జీల భారం భరించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారు వాడని విద్యుత్ భారం కూడా భరిస్తున్నారు. ఇది చాలదన్నట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తరువాత వైసీపీ పాలన తరహాలోనే ట్రూ అప్ బాదుడుకు APERC అనుమతించడం కూటమి ప్రభుత్వం విమర్శలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎస్‌పీడీసీఎల్‌ (APDCL) పరిధిలో సరాసరిగా నెలకు యూనిట్‌కు అత్యధికంగా 83 పైసలు, సీడీపీడీసీఎల్‌ (CDPDCL) పరిధిలో 79పైసలు, ఈడీడీసీఎల్‌ (EDDCL) పరిధిలో 80 పైసలు అదనంగా వసూలుకు అవకాశం కల్పించింది. 2022-23లో వాడిన కరెంట్ కు నెలవారీగా యూనిట్‌కు ఎంత వసూలు చేయాలనేది కూడా సూచించింది. ఈ మొత్తాన్ని డిసెంబర్‌ నెల నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.
అదే తప్పు.. చేస్తున్నారు..
గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరునే టీడీపీ కూటమి ప్రభుత్వం పాటిస్తున్నట్లు ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు విమర్శించారు." ట్రూ అప్ చార్జీలు అమలు చేసే పద్ధతిని విరమించుకోవాలి. సామాన్యులపై భారం మోపడం సరికాదు" అని రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈ చార్జీలు రద్దు చేయాలనే డిమాండ్ తో ఆందోళలు సాగిస్తామని, దీనిపై పార్టీలో చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. అయినా, ఎప్పుడో వాడిన కరెంట్కు ఇప్పుడు భారం మోపడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
భారంలో కూడా వెసులుబాటు
విద్యుత్ చార్జీల్లో ట్రూ అప్ పేరిట వసూలు చేయడంలో కూడా వెసులుబాటు కల్పించారు. ఎలాగంటే...
1. 2022 ఏప్రిల్‌లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్‌ ఛార్జీలను ఈ ఏడాది నవంబరు, డిసెంబరులో వసూలు చేయనున్నారు.
2. మేనెల ఖర్చు 2025 జనవరి, ఫిబ్రవరిలో వసూలు చేస్తారు.
3. జూన్‌ వినియోగాన్ని 2025 మార్చి, ఏప్రిల్‌లో
4. జులై నెల వినియోగాన్ని 2025 ఫిబ్రవరి
5. ఆగస్టు నెల వాడకాన్ని 2025 మార్చి
6. రు వాడిన విద్యుత్ కు ఏప్రిల్‌లో
7. రులో వాడిన విద్యుత్ కు అదనంగా మేనెల
8. రు వినియోగాన్ని జూన్‌, డిసెంబరు వినియోగాన్ని జులై వసూలు చేస్తారు.
2023 జనవరిలో వినియోగించిన మొత్తాన్ని 2025 ఆగస్టు, సెప్టెంబరు
1. ఫిబ్రవరి వినియోగాన్ని 2025 అక్టోబరు, నవంబరు నెలల్లో..
2. మార్చి వినియోగాన్ని 2025 డిసెంబరు, 2026 జనవరిలో వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.
అదనపు చార్జీలు వసూలు చేయడాన్ని సీపీఎం వ్యతిరేకించింది. పేదలపై భారం మోపే పద్ధతులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. "విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఉత్తర్వులు రద్దు చేయాలి" అని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన ధరలు, ఉపాధి కష్టమైన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలపై భారం సరికాదు. ఎప్పుడో వాడిన కరెంట్ కు ఇప్పుకు అదనంగా వసూలు చేయడం ఏమిటి?" అని ప్రశ్నించారు.
పేదలకు భారం తప్పదా?
తాజాగా జరిగిన నిర్ణయం వల్ల పేదలపై కరెంట్ చార్జీల భారం పడనుంది. 2022-23 వాడిన కరెంట్ పై ట్రూ అప్ చార్జీ పేరిట అదనపు భారం మోపనున్నారు. అది కూడా ఈ ఏడాది డిసెంబర్ నెల బిల్లు నుంచి 2026 వరకు రెండేళ్ల పాటు భారం భరించాలి.
ఉదాహరణకు : పల్లెల్లోనే కాదు. పట్టణ ప్రాంత పేదలు కూడా విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అందులో ఓ వినియోగదారుడు నెలకు కనీసం 30 నుంచి 50 యూనిట్ల విద్యుత్ వాడుతున్నారే అనుకుందాం. ప్రస్తుతం ఒక యూనిట్ కు రూ. 1.40 పైసలు చెల్లిస్తుంటే, ట్రూ అప్ చార్జీ వల్ల ఆ మొత్తం రూ. 2. 75 భారం పడనుంది. అంటే దాదాపు 50 శాతం చార్జీల భారం పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
హామీ గాలికి...
అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీల భారం తగ్గిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. సీఎం ఎన్. చంద్రబాబుతో సహా, డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా హామీ ఇచ్చారు. తాజాగా గతంలో వైసీపీ తరహాలోనే ఆదాయ వనరులు పెంచుకోవడానికి చేస్తున్నయత్నాల్లో ప్రపంచబ్యాంకు మార్గదర్శాలకు లోబడి ఏపీఈఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి నిరసన ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది.
వీరికి కూడా కష్టమేనా..?
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని వారికి 199 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది. అలాగే నాయీ బ్రాహ్మణులు, రజకులకు కూడా 160 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. పొరబాటుగా వారికి ఇచ్చిన పరిమితికి ఒక యూనిట్ అదనంగా కరెంట్ వినియోగిస్తే, పూర్తి బిల్లుతో పాటు ట్రూ అప్ భారం కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఏపీఈఆర్సీ డిస్కం సంస్థలకు ఇచ్చిన అనుమతి వల్ల పెద్దలే కాదు. సామాన్యులు కూడా భారం మోయాల్సిన అనివార్యమైన పరిస్థితి లేకపోలేదని భావిస్తున్నారు.
ఈ ప్రభావం కూటమి ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. దీనిపై బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్ రెడ్డి అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలు పూర్తిగా పరిశీలించాలని ఆయన వ్యాఖ్యానించారు.
Read More
Next Story