ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం.. మదనపల్లెలో అసలు కథ ప్రారంభం
రెవెన్యూ రికార్డుల దహనంలో కేసు ప్రాధమికంగా కొలిక్కి వచ్చిందా? ఫోరెన్సిక్ నివేదిక తరువాత ఏమి జరగబోతోంది? ఆ తరువాత సీఐడీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో రెవెన్యూ రికార్డులు దగ్ధమైన ఘటన ప్రకంపనలు ఆగడం లేదు. పట్టణం నుంచి మూరుమూల గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశమైంది. "మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఆశీస్సులతో ఎదిగిన నేతల జాడ లేదు. ఆరోపణలపై కూడా వారి స్పందన లేదు". ఈ కేసును సీఐడీ చేపట్టిన తరువాత వారికి కొత్తకష్టాలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ. సిసోడియా వేసిన ఎత్తుగడతో ఆధారాలు
"ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక అందడమే ఆలస్యం. నిందితులపై చర్యలు తీసుకుంటాం" అని
రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ. సిసోడియా స్పష్టం చేశారు. ఆయన మాటలను పరిశీలిస్తే, రెవెన్యూ రికార్డులు దగ్ధం వెనుక పాత్రధారులు, ఎవరనే విషయంలో దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది.ఫోరెన్సిక్ నివేదిక తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించే అవకాశం ఉంది. ఆ మేరకు ఉత్తర్వులు వెలువడితే, భూముల రిజిస్ట్రేషన్లో కీలకంగా వ్యవహరించిన వైఎస్ఆర్ సీపీ నేతలకు కష్టాలు తప్పేలా లేవు. ఈ పాటికే కొందరికి తప్పలేదని, చాలా మంది అగ్నాతంలో ఉన్నట్లు సమాచారం.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తానికి 2,440 ఫైళ్ళు కాలిపోయినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో 22-ఏ, ఈనాం, ఎస్టేట్, అసైన్డ్, చుక్కల భూములు, అటవీ శాఖలో వివాదాస్పద భూముల రికార్డులు కాలిపోయిన పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరించాల్సి ఉంది. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఫైళ్లు తిరిగి సంపాదించేందుకు ఉన్న మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా 22ఏ కేసుల ఫైళ్లు 120 కాలిపోయినట్లు సమాచారం. పుంగనూరు మండలం రాగానిపల్లె వద్ద ఉన్న 982 ఎకరాల ఎస్టేట్ భూమికి సంబంధించిన ఫిజికల్ ఫైల్స్ లో కొన్ని ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదీ ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలిన అంశాలు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటనపై అవిశ్రాంతంగా దర్యాప్తు సాగుతోంది. అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్ కమల్ సారధ్యంలో రెవెన్యూ బృందాలు వేర్వేరుగా, విచారణ సాగిస్తున్నారు. వారిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమన్వయం చేస్తున్నారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ. సిసోడియా, సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా మదనపల్లెలో మకాం వేసిన బుధవారం రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పీ. సిసోడియా శుక్రవారం మీడియాతో క్లప్తంగా మాట్లాడారు.
"ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ రకలా భూములు 2.16 లక్షల ఎకరాలు అనాధీనం అయ్యాయి" అని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. రికార్డుల దగ్ధం వ్యవహారంలో ఏడుగురిని విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఇద్దరు ఆర్డీవోలు మురళీ, హరికృష్ణ, రికార్డుల దగ్ధమైన సెక్షన్ ఇన్చార్జి, జూనియర్ అసిస్టెంట్ గౌతం తేజతో పాటు డీటీ, ఇంకొందరిని పోలీస్ ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నట్లు స్పష్టమైంది.
రెవెన్యూ శాఖకు సంబంధించి "ఈ కేసులో దోషులను పట్టుకుంటాం" అని సిసోడియా ధీమాగా చెప్పారు.
ప్రమాదం కాదు..!
ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అనే కోణంలో మొదటి రోజే దర్యాప్తు జరిగింది. అగ్నిమాపక శాఖ, ట్రాన్స్కో అధికారులు "ఇది ప్రమాదం ఎంత మాత్రం కాదు" అని ప్రాథమికంగా గుర్తించి నివేదిక అందించారు. ఇదే సమయంలో జెన్కో సీఎండీ సారథ్యంలోని ఓ బృందం, అగ్నిమాపక శాఖ సంబంధించిన ఉన్నత స్థాయి బృందం ఘటనా స్థలంలో నమూనాలు సేకరించింది. ల్యాబ్ లో వాటిని పరీక్షించి ఏ కారణంతో ఈ ఫైళ్లు దగ్ధమయ్యాయి అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా..
దీనిపై స్పందించిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా "ఉన్నతస్థాయి నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కోసం చూస్తున్నాం" అని చెప్పారు. అంటే, ఈ కేసులో సేకరించిన ఆధారాల ద్వారా పగడ్బందీగా నిందితులను చట్టం ముందు నిలపాలనే లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మదనపల్లెలో మకాం వేసిన, స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. కాలిపోయిన రికార్డుల మూలాల కోసం తహసీల్దార్ ఆఫీసులు, సబ్- రిజిస్టర్ కార్యాలయాల్లో 22-ఏ, మిగతా వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ ల వివరాలను కూడా సేకరిచారు.
"ఈ పరిశీలన ద్వారా దాదాపు 780 ఫైల్స్ రిట్రీవ్ చేసినట్లు" సిసోడియా వెల్లడించారు. మిగతా రికార్డులు కూడా సేకరిస్తామని ఆయన అంటున్నారు. ఇదిలావుండగా, వినతిపత్రాలు స్వీకరించడానికి స్వీకరించడానికి నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు బాధితులు వెల్లువత్తడం చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. భూములు కోల్పోయిన బాధితులు వందల సంఖ్యలో పోటెత్తారు.
ఆసలు కథ అప్పుడే ప్రారంభం
ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు అందిన తరువాత అసలు కథ ప్రారంభమయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో సీఐడీ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది.
"ఈ కేసుకు సంబంధించి సీఐడీ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ కావాల్సి ఉంది" అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఫెడరల్ ప్రతినిధికి సూచన ప్రాయంగా తెలిపారు. "భూముల రిజిస్ట్రేషన్ లో ఇంకొందరిని కూడా విచారణ చేయాల్సి ఉంది" అని కూడా ఆయన చెప్పారు.
పోలీస్, రెవెన్యూ బృందాలు వేర్వేరుగా సాగిస్తున్న దర్యాప్తును సీఐడీ చీఫ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చాలా వరకు ఆధారాలు ఈపాటికే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, మొదట ఇంటి దొంగల సంగతి తేల్చడంతో పాటు జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించిన మాజీ మంత్రి అండతో 22ఏ, ఈనాం, జమిందారీ భూములు, అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారి భరతం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్ట్టం అవుతోంది.
ఈ పాటికే మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడైన మదనపల్లోలోని మిల్లు మాధవరెడ్డి, ఆయన సోదరుడు రఘునాథరెడ్డిని విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. మాధవరెడ్డి నివాసంలో భారీగానే రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదేకోవలో మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు చెందిన ఇంకొందరు వైఎస్ఆర్ సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ మాటల ఆధారంగా తెలుస్తోంది.
కనిపించని నేతలు?
రికార్డుల దగ్ధం వ్యవహారం తరువాత మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, వారి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అత్యంత సామీప్యంగా రాజకీయ వ్యవహారాలు సాగించిన నేతలు కనిపించడం కాదు. కనీసం ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే, " ఈ వ్యవహారంలో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ఇందులో మాకేం సంబంధిం లేదు" అని పుంగనూరు ఎమ్మెల్యే కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. " మా ఎన్నికల అఫిడవిట్లలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి" అని ఆయన ప్రకటించారు.
Next Story