
సీబీఐ దర్యాప్తులో ఏమి ప్రశ్నించారు? ధర్మారెడ్డి ఏం సమాధానం చెప్పారు??
13 విచారణకు హాజరుకావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డికి నోటీసు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే కేసులో సిబిఐ-సెట్ బృందం టీటీడీలో పనిచేసిన రాజకీయ ప్రతినిధులపై దృష్టి సారించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams TTD) అదనపు ఈవోగా పనిచేసిన ఏవీ. ధర్మారెడ్డి తిరుపతిలో సిబిఐ దర్యాప్తు బృందం ముందు మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1:30 వరకు ధర్మారెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా అనేక అంశాలపై విచారణ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఏమాత్రం బెరుకు లేకుండా ధర్మారెడ్డి నింపాదిగా బయటికి వచ్చారు. ఆయన మొహంలో ఏమాత్రం ఆందోళన కనిపించలేదు.
సీబీఐ విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన టీటీడీ అదనపు మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి
శ్రీవారి లడ్డూ ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో ఈ నెల 13వ తేదీ విచారణకు హాజరుకావాలని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి.సుబ్బారెడ్డి సీబీఐ అధికారులు ఆన్ లైన్ లో నోటీసులు జారీ చేశారు.
"ఆ రోజు వీలుకాదు. 15వ తేదీ విచారణకు వస్తాను" అని వైవీ. సుబ్బారెడ్డి సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
"ఆ రోజు కాకున్నా, 15వ తేదీ తరువాత ఎప్పుడు పిలిచినా రావాలి" అని ప్రతిసమాధానం ఇచ్చినట్లు సీబీఐ అధికారుల ద్వారా తెలిసింది.
ఇదీ కేసు..
తిరుమలకు కల్తీ నెయ్యిని సరఫరా చేశారని ఆరోపణలు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో 470//2024 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు అయింది. టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మొదట గుంటూరు రేంజ్ డిఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (special investigation team SIT) ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులకే ఈ వ్యవహారం రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ సారధ్యంలో ఏపీ పోలీసు అధికారులతో కలిపి సీట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబాబు ఏపీ నుంచి డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్య కుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణకు దిగిన అధికారులు కేసు పూర్వాపరాలకు సంబంధించిన రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ధర్మారెడ్డిని విచారణ చేసిన వివరాల్లోకి వెళితే..
రాజకీయ ప్రతినిధులపై ఫోకస్
శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ మిల్క్ డైరీ ఎండి రాజశేఖర్, ఉత్తరప్రదేశ్ చెందిన మూడు డైరీ ప్రతినిధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బిపిన్ గుప్తా, పోమెల్ జైన్, అపూర్వ చావ్డా ఉన్నారు. ఆ తర్వాత 15 మంది వరకు సిబిఐ అధికారులు అరెస్టు చేసిన వారిలో నిందితులుగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ అధికారులు అధికారులు, రాజకీయ ప్రతినిధులపై దృష్టి సారించారు.
2019 నుంచి 24 వరకు టీటీడీ పాలకమండలి అధ్యక్షులుగా పనిచేసిన వారిపై సిబిఐ బృందం దృష్టి సారించింది. టిటిడి మాజీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను ఈ సంవత్సరం జూన్ 4వ తేదీని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అనంతరం సుబ్బారెడ్డి, ఆయన భార్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించనునున్నట్లు సీబీఐ అధికారులవర్గాల ద్వారా తెలిసింది.
వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఎ ను అదుపులోకి తీసుకోవడం ద్వారా సిపిఐ రాజకీయ ప్రతినిధులపై దృష్టి సారించినట్లు స్పష్టమైంది.. అదే సమయంలో టిటిడి ప్రత్యేక అధికారిగా ఆ తర్వాత అదనపు ఈఓగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి పాత్రపై కూడా సిబిఐ దృష్టి సారించింది.
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..?
శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం జరగడానికి కొనుగోలు జరిగిన తీరుపై టీటీడీ అదనపు మాజీ ఈఓ ఏవి ధర్మారెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి నగరం అలిపిరి సమీపంలోని సిబిఐ తాత్కాలిక కార్యాలయం వద్ద విచారణకు హాజరయ్యారు. సిబిఐ బృందంలోని సీనియర్ అధికారులతో సహా తిరుపతి అదనపు ఎస్పీ వెంకటాద్రి, అలిపిరి సిఐ రామకిషోర్ తో సహా ఇంకొంతమంది అధికారులు ఏవి.ధర్మారెడ్డిని అనేక అంశాల పైన సుదీర్ఘంగా విచారణ చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రైవేటు సంస్థల నుంచి తిరుమలకు అవసరమైన సరుకుల కొనుగోలు ప్రత్యేకంగా నెయ్యి కొనుగోళ్లలో జరిగిన వ్యవహారాలపై తరచి తరచి ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. దర్యాప్తు బృందం లోని అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు కొన్ని, కొన్ని తెలియదని ధర్మారెడ్డి సమాధానం చెప్పినట్లు సిబిఐ అధికార బృందం ద్వారా తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతం వరకు జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం ధర్మారెడ్డి సిపిఐ తాత్కాలిక కార్యాలయం నుంచి బయటికి వచ్చారు.
సీబిఐ మీడియా కనుగప్పి, ప్రయివేటు వాహనంలో వచ్చిన ధర్మారెడ్డిని పంపించడానికి ప్రయత్నాలు సాధ్యం కాలేదు.ఆయన కారును కార్యాలయం వద్ద వెనక్కు, ముందుకు నడిపించడం కొంతసేపు తాత్సారం చేశారు. ఆతరువాత సిబిఐ అధికార బృందంతో పాటు సివిల్ పోలీసులు కూడా ఆయనను తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టారు.
బెదరని ధర్మారెడ్డి
సిబీఐ తాత్కాలిక కార్యాలయంలో విచారణ అనంతరం బయటికి వచ్చిన ధర్మారెడ్డి తో మాట్లాడడానికి మీడియా ప్రతినిధులు తోపులాటకు గురయ్యారు. వెంటనే కారు నిలిపించిన ధర్మారెడ్డి ఏమాత్రం జంకు, బెదరు లేకుండా కారు నుంచి దిగారు.
"అయ్యా కాస్త వెనక్కి వెళ్లండి. వీడియో బాగా వస్తుంది. ఇప్పుడు ఓకేనా. ఇక వీడియో తీసుకోండి. అయ్యా. నాకేమీ ఇబ్బంది లేదు" అని ధర్మారెడ్డి మీడియా ప్రతినిధులు ముందుకు వచ్చారు. అక్కడి హడావిడి లేకుండా పోలీసులు నివారించడంతో ఏమాత్రం బెదరకుండా ధర్మారెడ్డి వద్ద ఓ జనసేన నేత లడ్డూలు చూపిస్తూ, చేసిన యాగీతో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడకుండా, కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ అనంతరం ఆయన ముఖంలో ఆందోళన ఏమాత్రం కనిపించలేదు. టీటీడీ అదనపు ఈఓగా పనిచేసే సమయంలో ఒత్తిడితో ఉన్నట్లు కనిపించే ఆయన, సీబీఐ విచారణకు వచ్చినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా కనిపించారు.
Next Story

