
2047కు పేద, ధనిక అంతరాలు తగ్గించే వ్యవస్థ..
జాతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్ గా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. 2047లోపు భారత్ ప్రపంచంలో మొదటిస్థానంలోకి వెళుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన ఆలోపు ఆలోపు పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన జాతీయ విజ్ఞాన ఏడో సమ్మేళనంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రాచీనకాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందనే విషయాన్ని గుర్తు చేసిన ఆయన పిల్లలకు హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారనే చరిత్ర వివరించాలని తల్లిదండ్రులకు సూచన చేశారు.
"ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విలువలు, నైతికత వంటి అంశాలను పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి వారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు" అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. భారతదేశంలో అద్భుతమైన కుటుంబ వ్యవస్థ అందరికీ భద్రత కల్పించేలా ఉందని ఆయన అన్నారు.
మోదీ.. భగవత్ పై ప్రశంసలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు జ్నాపిక అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు వర్షం కురిపించారు.
"సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. ఈ సదస్సులో దేశం, భారతీయతపై చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2900 ఏళ్ల కిందటే యోగాభ్యాసం చేసిన చరిత్రను ప్రస్తావించిన ఆయన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత స్వల్ప కాలంలోనే యోగా 150 దేశాలు సాధన చేస్తున్నాయని వివరించారు. 2600 ఏళ్ల కిందట పుట్టిన ఆయుర్వేదంతో వైద్య సేవలు విస్తృతమై ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామన్నారు.
పురాణాలు వివరించండి
తెలుగు ప్రజలు పురాణాలు మరిచిపోయే రోజుల్లో నటుడిగా పురాణ గాధలతో మాజీ సీఎం ఎన్టీ. రామారావు సినిమాలు చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రస్తావించారు. విలువలను చెబుతూ సినిమాల ద్వారా చైతన్యం తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించిన గొప్ప నాయకుడు అని అన్నారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్ పేయి పునాదులు వేస్తే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో వినూత్న ఆలోచనలు చేయడంతో పాటు కొత్త ఆవిష్కరణలు చేపట్టడానికి శాస్ర్తవేత్తలు ముందడుగు వేయాలన్నారు. ఈ ఫలితాలతో భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారని చరిత్రను వివరించాలని ఆయన తల్లిదండ్రులకు హితవు పలికారు.
"సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు. కృష్ణుడి మహిమలు, శివుడి మహత్యంపై యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. రామరాజ్యం అంటే ఏమి టో చెప్పాలి. అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవి" అని పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. వారితో పాటు బకాసురుడు, కంసుడు లాంటి రాక్షసుల చరిత్ర వివరిస్తే, పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదనేది అర్థం అవుతుందన్నారు.
అర్బన్ ప్లానింగ్ కు ఆదర్శం హరప్పా నాగరిత
భారతదేశం ప్రాచీన కాలంలోనే విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చరిత్రను ఆవిష్కరించారు. ఎన్నో వేల ఏళ్ల కిందటే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందని ఆయన అన్నారు. పూర్వకాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశంగానే కాకుండా, 1600 ఏళ్ల కొందటే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత తోపాటు సున్నా ( ZERO ) ను భారతీయులే కనుగొన్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావింాచరు.
"మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు... వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చరిత్రను ఆవిష్కరించారు. వాటి స్ఫూర్తి, ప్రేరణతో శాస్త్ర, సాంకేతికరంగంలో భారతదేశం సాధించిన పురోభివృద్ధి ప్రపంచ దేశాల సరసన నిలిచిందని వివరించారు.
నాలెడ్జ్ ఎకానమీలో సూపర్ పవర్
భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రశంసించారు.
"అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం ఎంతో వెనుకబడి ఉన్నాయి. అప్పట్లోనే ప్రపంచంలోనే భారతదేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జీ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేది. విదేశీ పాలన, మన పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడింది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రస్తావించారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నాం, ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారని ఆయన అన్నారు. వివిధ దేశాలు ఏజింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని ఆ సమస్య మనకు లేకపోవడమే ప్రధాన వనరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రపంచండంలో ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో నదుల అనుసంధానం ద్వారా మాత్రమే నీటి భద్రత వస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందులో గంగా-కావేరీ నదుల అనుసంధానం జరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్ గా నిలుస్తుంది. ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. టెలికాం రంగంలో సంస్కరణల వల్ల కనెక్టివిటీ పెరగడం వల్ల, ఏపీలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్న విషయాలను ఆయన ప్రస్తావించారు. గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖలో పెట్టబోతోందని మరోసారి పునరుద్ఘాటించారు.
Next Story

