"ఉక్కు" సంకల్పాన్ని వరించనున్న పదవి?
ప్రొద్దుటూరులో "కడప ఉక్కు రాయలసీమ హక్కు" నినాదం ప్రతిధ్వనించింది. ఈ ఉద్యమంతో ఎదిగి, టీడీపీకి అండగా నిలిచిన ప్రవీణ్ కు నామినేటెడ్ పదవి దక్కనుందని సమాచారం.
క్యాబినెట్ స్థాయి నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో పేర్లు వెల్లడించడానికి సీఎం ఎన్. చంద్రబాబునాయుడు కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంకితభావంతో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే..
ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో పార్టీకి అండగా నిలిచిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఏపీఐసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కష్టకాలంలో కూడా పార్టీకి దన్నుగా నిలిచిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు క్షేత్రస్థాయి విభిన్న మార్గాల్లో అభిప్రాయాల సేకరణతో తుది నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో అనేక రకాల ప్రాధమ్యాలను ప్రామాణికంగా తీసుకున్నారనేది పార్టీ వర్గాల సమాచారం.
టీడీపీ కూటమి అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. అందరూ పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. 2014 తరహాలో టడీపీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు. బీజీపీ, జనసేనతో కూడిన టీడీపీ కూటమిలో సర్దుబాట్లకు సమయం తీసుకుంది. మిగిలిన పార్టీల నుంచి కూడా రాజకీయ చాతుర్యంతో సమన్వయం సాధించిన సీఎం చంద్రబాబు పదవులు ఇవ్వడానికి కార్యరంగం సిద్ధం చేశారని సమాచారం. అందువల్ల ఆ కసరత్తు చేయడానికి రెండు నెలల సమయం పట్టడానికి పరిపాలన వ్యవహారాలు చక్కదిద్దుతూనే, ఆశావహులను సంతృప్తి పరిచే నిర్ణయం వెలువరించడానికి అన్ని వ్యవహారాలు పూర్తి చేశారని సమాచారం.
2024 ఎన్నికల్లో దాదాపు 80 మందికి యువకులకు టికెట్లు ఇవ్వడం ద్వారా సీఎం చంద్రబాబు దూరదృష్టితో మంత్రి నారా లోకేష్ టీం సిద్ధం చేసినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అదేవిధంగా పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిలో యువకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేశారు.
రాయలసీమలో ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రాతినిధ్యం వహించిన కడప జిల్లాలో ఊహలకు అందని విధంగా మొదటిసారి గెలిచిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈయన అన్ని వర్గాలను సమన్వయం చేయడంలో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా వాగ్ధాటి, చొరవ చురుకుదనం వంటి అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తిగా ప్రొద్దుటూరు పార్టీ ఇన్చార్జి, యువకుడికి ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్ స్థాయి పదవి ఇవ్వడానికి ఈపాటికే నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ కోలోనే నిలిచిన..
ఎవరీ ఉక్కు ప్రవీణ్
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గుండ్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఉక్కు పరిశ్రమ కోసం సాగించిన పోరాటం ఓ మంచి నేతగా నిలిపింది. బీ.టెక్ చదివిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప ఉక్కు సీమ హక్కు నినాదంతో 2018లో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితులు, విద్యార్థులను సమీకరించి ప్రదర్శనలు ప్రారంభించారు. ఉక్కు పరిశ్రమ అవసరం అనేది రాయలసీమ ప్రాంత వాసుల్లో బలమైన ఆకాంక్ష ఉండడం ఆయనకు కలసి వచ్చింది. కరువు సీమలో అంత పెద్ద భారీ పరిశ్రమ కోసం సాగుతున్న పోరాటానికి పట్టణం ఆదరించింది. స్వతహాగా ప్రొద్దుటూరు పట్టణం ముంబై తరువాత బంగారు, వస్త్ర వ్యాపారంలో అంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉద్యమాలకు కూడా పుట్టినిల్లు అని చెప్పడంలో సందేహం లేదు. అందులో కమ్యూనిస్టుల పోరాటాలు ఈ ప్రాంతంలో చైతన్యాన్ని రగిల్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంతో పాటు విద్యార్థి, యువజన, రైతు సంఘాలు కూడా ప్రవీణ్ కుమార్ తో పాదం కలిపాయి. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి చేపట్టిన ఉద్యమం సహేతుకమైనది కావడం వల్ల ఆయనకు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వకతప్పని అనివార్యమైన పరిస్థితిని సృష్టించుకున్నారు. దీంతో
మారిన ఇంటిపేరు
"ఆయన ఇంటిపేరు గుండ్లూరు కాస్తా.. ఉక్కు ప్రవీణ్"గా మారింది. ప్రొద్దుటూరుతో పాటు మైదుకూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాలకు కూడా ఉక్కు ఉద్యమం విస్తరించింది. చదువుకున్న వారే కాకుండా, సామాన్యుడు కూడా తమ ప్రాంతానికి మేలు జరిగే కార్యక్రమం అని భావించి, మమేకం కావడం వల్ల చివరాఖరికి టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఆయన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో వారంతా అండగా నిలిచారు.
108 గంటల దీక్ష
ఉక్కు పరిశ్రమ సాధన కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ వద్ద 108 గంటల పాటు దీక్ష చేయడం ద్వారా జనం నోళ్లలో నానారు. రాజ్యసభ సభ్యుడు సీఎం. రమేష్ ను కూడా ఆమరణ దీక్షకు దిగేలా చేశారు. అదే సమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీపై సీఎం ఎన్.చంద్రబాబు నాయుడును కూడా కలిసిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన దృష్టిని ఆకర్షించారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆయన చైతన్యం రగిల్చారనడంలో ఎంతమాత్రం అతిశేయోక్తి కాదు. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. ఇదిలావుండగా,
టీడీపీలో అరంగేట్రం
కమలాపురం మాజీ ఎమ్మల్యే జీ. వీరశివారెడ్డికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం. ఆయన సోదరుడి కొడుకే ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. అయినా, ఉక్కు ఉద్యమంలో ఎక్కడా రాజకీయ వాసనలకు ఆస్కారం లేకుండా అన్నివర్గాలను మమేకం చేశారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన 2019 ఎన్నికల తరువాత టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో యువతలో చరిష్మా సాధించిన ఆయన టీడీపీకి అండగా నిలిచారు. మెల్లగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు కూడా దగ్గరయ్యారు.
ప్రొద్దుటూరులో వర్గాలు
ఈ అసెంబ్లీ స్థానంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డిపై టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి ఓటమి చెందారు.
2009లో వరదపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి విజయం సాధించారు. ఇంతవరకు సవ్యంగానే ఉంది. 2019 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. లింగారెడ్డి, ఉక్కు ప్రవీణ్ సహకారం లేకపోవడంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు ఎన్. వరదరాజులురెడ్డి, మల్లెల లింగారెడ్డి రెండువర్గాలుగా మిగిలారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే ప్రొద్దుటూరులో కార్యకర్తలకు దిక్కలేకుండా పోయింది. మాజీలు ఇద్దరు ఎవరికి వారుగా మిలిగిపోయారు.
ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒంటరి పోరు సాగించారనడంలో ఎంతమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. సీనియర్లు ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఇక ఆ బాధ్యత మొత్తం ప్రవీణ్ కుమార్ రెడ్డి తీసుకోవడం ద్వారా పోరాటం సాగించారు.
14 కేసులు... 29 రోజుల జైలు
వాస్తవంగా చెప్పాలంటే ఉక్కు ప్రవీణ్ టీడీపీ శ్రేణులు, తన స్నేహితుల సహకారంతో ఎమ్మెల్యే రాచమల్ల శివ ప్రసాద్ రెడ్డిపై ఒంటరి పోరు సాగించారని చెప్పవచ్చు.
నాపై "14 కేసులు నమోదు చేశారు. 29 రోజులు జైలుపాలు చేశారు" అని ఉక్కు ప్రవీణ్ తెలిపారు. "ఇవన్నీ రాజకీయంగా నన్ను రాటుదేల్చాయి" అని ఆయన అంటారు. ఇదిలావుండగా, ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ బీసీ విభాగం నేత ఒకరు హత్యకు గురయ్యారు. ఈ సమాచారం తెలుసుకుని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా పట్టణానికి వచ్చినప్పుడు కూడా మిగతా నాయకులంతా అండగా నిలిచారు.
ఈ పరిస్థితులు అన్ని గమనించిన నారా లోకేష్ స్వయంగా చొరవ తీసుకుని కొంతకాలానికే పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆయన పనితీరును తెలిసిన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి. ఇద్దరు సీనియర్లు సైలెంట్ గా ఉండడం వల్ల పార్టీకి నష్టమని భావించిన ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
చేజారిన టికెట్
యువగళం పాదయాత్రలో జనసమీకరణతో సత్తా చాటుకున్న ఉక్కు ప్రవీణ్ 2024 ఎన్నికలకు టీడీపీ టికెట్ తనదే అని ధీమాగా ఉన్నారు. అంతకు రెండేళ్ల ముందే మాజీ ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. ఎన్నికలు సమీపించే సరికి ఉక్కు ప్రవీణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎన్. వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డి ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. విభిన్న లెక్కలు వేసిన తరువాత ఎన్. వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై మొగ్గు చూపిన సీఎం చంద్రబాబు ఉక్కు ప్రవీణ్ కు భరోసా ఇచ్చారని, దీనికి నారా లోకేష్ కూడా అభయహస్తం ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరిగింది. ప్రొద్దుటూరులో తన సోదరుడి కుమారుడు ప్రవీణ్, కమలాపురంలో తనకు టికెట్ లభించని స్థితిలో మాజీ ఎమ్యెల్యే జీ. వీరశివారెడ్డి కినుక వహించి వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్ సీపీకే మద్దతు ఇవ్వడం గమనార్హం.
ఇచ్చిన మాట మేరకు
ఎన్నికల వేళ సీనియర్ అయిన వరదరాజులరెడ్డికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలోనే ఉక్కు ప్రవీణ్ కు మాట ఇచ్చారు. అందులో భాగంగా ఆయనకు క్యాబినెట్ హోదాతో పాటు నామినేటెడ్ పదవుల్లో కీలకమైన ఏపీఐసీసీ పోస్టుకు ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉక్కు ప్రవీణ్ అమరావతిలో ఉన్నట్టు సమాచారం. గురువారం కూడా ఆయన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి చర్చించారు.
"ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించండి" అని మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి" అని కూడా ఉక్కు ప్రవీణ్ విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతిపై విచారణకు చర్యలు తీసుకోండి" అని కూడా కోరిన ఆయన నియోజకవర్గ సమస్యలపై ఓ వినతిపత్రం కూడా అందించారు.
Next Story