పలమనేరు పట్టణ సమీపంలోకి వచ్చిన ఓ ఒంటరి ఏనుగు స్వైర విహారం చేసింది. ట్రాకర్స్ ఆ ఏనుగును దారిమళ్లించే యత్నంలో దాడికి తెగబడింది. ఓ అటవీశాఖాధికారిపై దాడి చేసింది. పరిగెత్తలేక కింద పడిపోయిన ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ను తొక్కివేసింది.
ఈ ప్రమాదంలో గాయపడిన ఆయనను తిరుపతిలోని ఓ ప్రైయివేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.
పలమనేరులో నివాసాల సమీపానికి వచ్చిన ఏనుగు
పలమనేరు పట్టణ శివారులో సాయిబాబా ఆలయం సమపంలో ఉన్న గంగవరం మండలంలోకి ఓ ఏనుగు వచ్చిందని గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ట్రాకర్స్ ఆ ఏనుగును అడవిలోకి మళ్లించే యత్నంలో ఒంటరి ఏనుగు తిరగబడింది. గ్రామస్తుల పైకి దాడికి తెగబడింది. పరిగెత్త లేక కింద పడిపోయిన అటవీ శాఖ అధికారిపై దాడికి దిగింది. ఎట్టకేలకు ఏనుగును దారి మళ్లించిన గ్రామస్తులు గాయపడిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ను కాపాడి పలమనేరు ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై పలమనేరు ఫారెస్టు రేంజ్ అధికారి నారాయణ మాట్లాడుతూ,
"పలమనేరు పట్టణ శివారులోకి వచ్చిన ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ట్రాకర్స్ రంగంలోకి దిగారు. కీలపట్లకు సమీపంలోని రెడ్డుపై నుంచి ఏనుగు ఘీంకరిస్తూ వెళ్లే సమయంలో ఎదురుగా ఉన్న గ్రామస్తుల అలజడి వల్ల తిరగబడింది" అని ఎఫ్ఆర్ఓ నారాయణ చెప్పారు. కింద పడిన ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ పై ఏనుగు దాడి చేసిందని ఆయన వివరించారు.
పల్లెలను వదలని ఏనుగు
పలమనేరు పరిసరాలతో పాటు ఈ నియోజకవర్గంలోని వీకోట, గంగవరం మండలాల పరిధిలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఒంటరి ఏనుగు సంచరిస్తోంది. పంటలను కూడా ధ్వంసం చేస్తుంది. మంద నుంచి తప్పిపోయిన ఈ ఒంటరి ఏనుగు సంవత్సరాల కాలంగా పంటలను నాశనం చేస్తూనే ఉంది. మినహా ఎవరి పైన దాడికి దిగిన దాఖలాలు లేవు.. అనేక సందర్భాల్లో "పలమనేరు నుంచి కుప్పం వెళ్లే మార్గంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు కూడా ఈ ఏనుగు కనిపించింది" అని అక్కడ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
దాడి ఎలా జరిగింది?
పలమనేరుకు అత్యంత సమీపంలోనే గంగవరం మండలం ప్రాంతం కూడా విస్తరించి ఉంటుంది. కౌండిన్య అభయారణ్యంగా పరిగణించే ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువ. శనివారం ఉదయం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంగవరం గ్రామం వద్దకు ఒంటరి ఏనుగు వచ్చింది. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
గంగవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ సిబ్బందితో కలిసి ఏనుగు సంచరిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. అత్యంత సమీపంలో ఉంటూనే ఒంటరి ఏనుగును అడవిలోకి దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేశారు. అరుపులు కేకలతో చికాకు పడిన ఒంటరి ఏనుగు ఎదురు తిరిగింది. సమీపంలో ఉన్న వారిని వెంటాడింది. ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ పరిగెత్తే ప్రయత్నంలో పట్టుతప్పి కింద పడిపోయారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఏ ఒంటరి ఎనుగు సుకుమార్ పై దాడి చేసి పాదాలతో తొక్కి వేయడానికి ప్రయత్నించింది. గ్రామస్తులు మూకుమ్మడిగా శబ్దాలు చేస్తూ ఒంటరి ఏనుగును దూరంగా వెళ్లగొట్టారు. ఏనుగు దాడిలో సెక్షన్ ఆఫీసర్ ఎడమ కాలు, చెయ్యి కూడా విరిగిపోయి కదలలేని స్థితిలో పడిపోయారు వెంటనే ఆయనను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత గాయపడిన ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ను తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పలమనేరు అటవీశాఖ అధికారి నారాయణ చెప్పారు.