వైజాగ్‌లో రైలు లాంటి హోటల్‌!
x
రైలు బోగీని తలపిస్తున్న క్యాప్సూల్‌ హోటల్‌ లోపలి భాగం

వైజాగ్‌లో రైలు లాంటి హోటల్‌!

తూర్పు కోస్తా రైల్వేలో సరికొత్త క్యాప్సూల్‌ హోటల్‌ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో గదులు తక్కువ అద్దెకే లభిస్తాయి.


మీరు విశాఖపట్నం స్టేషన్‌లో రైలు దిగి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? విశాఖ అందాలను తిలకించడానికి రైలులో వచ్చి నగరంలో హోటల్‌ కోసం వెతుక్కుంటున్నారా? ఎక్కడెక్కడ నుంచో వచ్చే వారు ఇకపై అలాంటి హైరానా పడాల్సిన పనిలేదు. రైల్వే శాఖ ఇలాంటి వారి కోసమే వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లో రైలులాంటి ఓæహోటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నాన్ని సందర్శించే పర్యాటకులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఈ తరహా హోటల్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీనిని క్యాప్సూల్‌ హోటల్‌గాను, స్లీపింగ్‌ పాడ్‌లుగాను పిలుస్తారు.


హోటల్‌లో అధునాతన సోఫాలు

క్యాప్సూల్‌ హోటల్‌ సంస్కృతి తొలుత జపాన్‌లో ఆరంభమైంది. క్రమంగా అది ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పడు ఈ సౌకర్యాన్ని విశాఖపట్నంలో తూర్పు కోస్తా రైల్వే ప్రవేశపెట్టింది. దీనిని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఒకటో నంబరు ప్లాట్‌ఫాం గేట్‌ నంబరు 3 పై అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇందులో ఏసీ సదుపాయం కలిగిన మొత్తం 88 బెడ్‌లున్నాయి. వీటిలో 73 సింగిల్‌ బెడ్లు, 15 డబుల్‌ బెడ్లు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా 18 పడకలను కేటాయించారు. వీటిని రైలులో ప్రయాణించి వచ్చిన వారితో పాటు విశాఖ పర్యటనకు వచ్చే సందర్శకులు కూడా వినియోగించుకోవచ్చు. సింగిల్‌ బెడ్‌కు తొలి మూడు గంటల వరకు ఒక్కొక్కరికి రూ.200, అది దాటితే 24 గంటల వరకు రూ.400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబుల్‌ బెడ్‌కు మూడు గంటలకు రూ.300, అపై 24 గంటలకైతే రూ.600 చొప్పున అద్దె నిర్ణయించారు. విశాఖపట్నం మహా నగరంలో చిన్నపాటి హోటల్‌లో నాన్‌ ఏసీ సింగిల్‌ రూమ్‌ తీసుకున్నా రూ.500–600 వరకు అద్దె వసూలు చేస్తారు. అదే ఏసీ అయితే రూ.800–1000 మధ్య చెల్లించాలి. వాటి అద్దెతో పోల్చుకుంటే ఈ క్యాప్సూల్‌ హోటల్‌ లాభదాయకంగా ఉంటుంది.


డబుల్‌ బెడ్‌ మోడల్‌ స్లీపింగ్‌ పాడ్‌

అచ్చం రైలు బోగీల మాదిరిగానే..
విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చిన క్యాప్సూల్‌ హోటల్‌ రైలు బోగీని పోలి ఉంటుంది. అందులోని బెడ్లు/స్లీపింగ్‌ పాడ్లు రైలులోని బెర్తుల మాదిరిగానే ఉన్నాయి. ఒక వరసలో పైన, కింద, మరో వరసలో ఎదురెదురుగా బెడ్లు ఉండేలా ఈ క్యాప్సూల్‌ను డిజైన్‌ చేశారు. వాటికి కర్టెన్సు కూడా ఉండడం వల్ల అందులో ఉన్న వారికి ప్రైవసీ (గోప్యత) ఉంటుంది. ఒకసారి అందులోకి వెళ్లిన/ బస చేసిన వారికి రైలులో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ క్యాప్సూల్‌ హోటల్‌ను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా ప్రారంభించారు.

గోప్యత కోసం అమర్చిన కర్టెన్లు

క్యాప్సూల్‌ హోటల్‌ ప్రత్యేకతలివీ!

ఈ కాప్సూల్‌ హోటల్‌/స్లీపింగ్‌ పాడ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అంతకుమించి సదుపాయాలు ఉన్నాయి. అక్కడ ఉచిత వైఫై, స్నానం చేయడానికి వేడి నీళ్లు, బస చేసిన వారికి అవసరమైన పర్యాటక ఇతర సమాచారం అందించే హెల్ప్‌ డెస్క్, అధునాతన వాష్‌ రూమ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన వారు స్నాక్స్‌ (చిరుతిళ్లు) కొనుగోలు చేసుకోవచ్చు. ఇవే కాకుండా అక్కడున్న వారు కూర్చునేందుకు సోఫాల్లాంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. వీక్షించేందుకు టీవీ సదుపాయం కూడా కల్పించారు.
ఈ హోటల్‌ ఎవరికి ప్రయోజనం?
ప్రకృతి రమణీయతతో అలరించే విశాఖపట్నం పర్యాటక ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకే ఏటా కోటిన్నర మందికి పైగా పర్యాటకులు విశాఖ అందాలను తిలకించడానికి వస్తుంటారు.వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరమైన వైజాగ్‌కు వివిధ పనులు, అవసరాల నిమిత్తం రోజూ వేల సంఖ్యలో వస్తారు. దీంతో వీరి అవసరాలను తీర్చడానికి విశాఖలో ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు, లాడ్జిలు ఏర్పాటయ్యాయి. ఇవి సంవత్సరం పొడవునా మంచి ఆక్యుపెన్సీతో ఉంటాయి. వైజాగ్‌లో ఒకరోజు ఉండి వెళ్లాలనుకునే మధ్య తరగతి వారు, వ్యాపారులు చిన్నపాటి హోటళ్లలో బస చేసి వెళ్తున్నారు. ఇలాంటి వారికి రూ.400/600 బడ్జెట్‌తోనే ఈ క్యాప్సూల్‌ హోటల్‌ అవసరాలు తీరుస్తుంది.


Read More
Next Story