
‘ఉచిత బస్సు’కు కోత, 'పల్లె వెలుగు'కే పరిమితం!
‘ఉచితం బస్సు’ అంటే ప్రజలు ఎగబడతారని ప్రభుత్వంలో బాగా నాటుకు పోయింది. అందుకేనేమో కోత వేద్దామా...
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ‘ఉచిత బస్ ప్రయాణం’పై పరిమితులు విధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రాష్ట్రమంతా అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రజలు సమీపంలో ఉన్న పట్టణాలకు, గుళ్లకు , తిరునాళ్లలకు, ఆసుప్రతులకు, బంధువుల ఇళ్లలో కార్యక్రమాలకు వెళ్లుతుంటారు. గ్రామీణ మహిళల ప్రయాణాలు వంద కిలోమీటర్లు దాడి సాధారణ పరిస్థితులలో ఉండవు. అనంతపురం మహిళలు శ్రీకాకుళం,కాకినాడు వెళ్లే అవకాశాలు తక్కువ. అందువల్ల మహిళలకు బాగా ఉపయోగపడే విధంగా ఉచిత ప్రయాణాన్ని నిర్వచించాలనుకుంటున్నారు. అందువల్ల మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి పరిమితలు విధించే అవకాశం మెండుగా ఉంది. ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు అందిన సమాచారం ప్రకారం మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘పల్లెవెలుగు’ బస్సులకు మించి ఉండకపోవచ్చు.
***
Shocking News

***
ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మంత్రులు, అధికారులు పర్యటించారు. అక్కడి నుంచి కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నారు. వారు ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకున్నారు. ఇవన్నీ ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రాష్ట్రమంతా అవసరం లేదు. జిల్లా వరకు చాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి జిల్లాల్లోనే ప్రయాణాలు ప్రజలు ఎక్కువ సాగిస్తున్నారని, పక్క జిల్లాలకు చాలా అరుదుగా వెళుతున్నారనే విషయం ప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించింది.
పల్లె వెలుగు కే పరిమితం
ఏ జిల్లాకు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంది. అంటే దాదాపు డీలక్స్, అల్ట్రా డీలక్స్, లగ్జరీ బస్ లు కూడా లేవని చెప్పొచ్చు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 8,458 బస్ లు పల్లె వెలుగుతో సమానం. పేరులోనే మార్పు ఉంటుంది తప్ప స్పీడులోనూ, సౌకర్యాలలోనూ పల్లె వెలుగు లో ఎలాగైతే ప్రయాణం చేస్తామో అలాగే చేయాల్సి ఉంటుంది.
ఆర్టీసీలో ఉన్న బస్ లు ఎన్నో తెలుసా?
ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో 11,449 బస్ లు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ కలిపి 6,511 బస్ లు ఉన్నాయి. ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, 1,897 ఉన్నాయి. అంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్ లు 8,458 ఉన్నాయి. జిల్లాల పరిధిలో ఏసీ బస్ లు పెద్దగా లేవని చెప్పొచ్చు. ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలో ఏసీ బస్ లు లేవు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు కూడా ఏసీ బస్ లు 2 శాతం మించి లేవని చెప్పొచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, వంటి నరగాలకు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వెళ్లేందుకు మాత్రమే ఏసీ బస్ లు ఉన్నాయి.
ఎందుకు ఇలా జరుగుతోంది?
అవసరం ఉన్న చోటుకు ప్రజలు తప్పకుండా ప్రయాణాలు చేస్తారు. కానీ 91.5 శాతం సొంత ఉమ్మడి జిల్లాల్లోనే ప్రజలు ప్రయాణించడానికి కారణాలు ఏమిటనేది పలువురిలో చర్చకు దారితీసింది. కేవలం 8.5 శాతం మాత్రమే వేరే జిల్లాల్లో ప్రజలు ప్రయాణిస్తున్నారు. అంటే ప్రజలు ఉన్నచోటు నుంచి కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కొన్ని జిల్లాల పరిధిలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎటువైపు పోయినా 50 నుంచి 60 కిలో మీటర్ల లూపులోనే ఉంటున్నాయి. కొన్ని జిల్లాలు మాత్రం 100 నుంచి 140 కిలో మీటర్ల వరకు కూడా ప్రయాణం చేయాల్సి వస్తోంది. బంధువులు, బంధుత్వాలు సొంత జిల్లాలకే పరిమితై ఉండొచ్చు. అలాగే వ్యాపారాలు ఎక్కువగా ప్రజలు సొంత జిల్లాల్లోనే చేస్తూ ఉండొచ్చు. లేకుంటే వేరే ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంటే కారణాలు మరేమై ఉంటాయా? అనే చర్చ కూడా సాగుతోంది.
అందుకే ఉచిత ప్రయాణం జిల్లాలకే పరిమితం
గ్రామీణ, సిటీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు రోజుకు జిల్లాల్లో 16.11 శాతం ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం అమలు చేయడం ద్వారా ఈ సంఖ్య 26.95 లక్షలకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నిర్థారించింది. ఈ నిర్థారణ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిందో వెల్లడించలేదు. అంటే ప్రభుత్వం చెబుతున్న ప్రకారం సగటున రోజుకు 10.84 లక్షల మంది ఉచిత బస్ ప్రయాణంలో మహిళల సంఖ్య పెరుగుతుంది. వారానికి ఒక రోజు మహిళలు ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ప్రభుత్వం తేల్చింది.
ప్రస్తుతం టిక్కెట్ లో మహిళా టిక్కెట్ లేదు కదా?
ప్రస్తుతం బస్ ల్లో ప్రయాణికుల సంఖ్య మాత్రమే ఉంటుంది. అందులో పెద్దలు, పిల్లల సంఖ్య మాత్రమే ఉంటుంది. అయితే ఏ విధమైన లెక్కల ప్రకారం బస్ ల్లో ప్రయాణిస్తున్న మహిళలు ఇంత మంది ఉన్నారని తేల్చారో వివరించ లేదు. ఈ లెక్కలు ఏపీఎస్ ఆర్టీసీ వారే తేల్చారని ప్రభుత్వం చెబుతోంది. మహిళా టిక్కెట్లు ఇన్ని అనే ఆధారం లేకుండా వారానికి రెండు సార్లు మహిళలు జిల్లాల పరిధిలోనే ప్రయాణిస్తారని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. బస్ ల్లో మహిళలకు కేటాయించిన సీట్ల ఆధారంగా లెక్కలు చెబితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మహిళల సీట్లన్నీ తప్పకుండా నిండుతాయనే నమ్మకం లేదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి బస్ ల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గింది. చిన్న కుటుంబం కూడా కారు కొనుగోగలు చేసి ప్రయాణం కొనసాగిస్తోంది. ఇన్ని వడిదుడుకుల మధ్య మహిళా ప్రయాణికులు ఎలా నమోదయ్యారనే అంశంపై స్పష్టత లేదు.
ఉచిత ప్రయాణం అంటే అంతే...
ఉచిత ప్రయాణం అంటే ఇలాగే ఉంటుంది. అది కూడా ఊరక రాదు కదా... ఉచిత ప్రయాణానికి ప్రయాణికుల తరపున ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కు డబ్బులు చెల్లించాలి. ప్రయాణించే వారికి ఉచితమే కాని, పాలించే వారికి ఆర్థిక భారంతో కూడుకున్నది. మొదులే అప్పుల కుప్పగా ఏపీ మారింది. ఈ ప్రయాణానికి కూడా అప్పులు చేసి డబ్బులు తీసుకు రావాల్సిందే అందుకే ఏ జిల్లాకు ఆ జిల్లా అనే చిన్న అడ్జెస్ట్ మెంట్.
గుంటూరు వెళ్లాలంటే విజయవాడ వాళ్లు టిక్కెట్ తీసుకోవాల్సిందేగా...
కొందరు మహిళలను ఈ విషయమై పలకరిస్తే విజయవాడకు చెందిన నాగర్తి కస్తూరి బాయి మాట్లాడుతూ అనుకున్నదొక్కటి అయింది ఒకటి అన్నట్లుగా ఉచిత ప్రయాణం ఉంటుందని అర్థమైందని అన్నారు. హైదరాబాద్ వరకు ప్రశాంతంగా వెళ్లొచ్చనుకున్నాం. కానీ ఎక్కడి వారు అక్కడే అంటే సిటీల్లో మాత్రమే తిరుగుతాం తప్ప వేరే ఊర్లకు కూడా అంతగా వెళ్లేది లేదని అన్నారు. అందులోనూ గుంటూరులో ప్రభుత్వ సిటీ బస్ లు లేవు. అక్కడ ఆటోలే గతి. ప్రైవేట్ బస్సుల్లో తిరగాల్సిందే. విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే సిటీ బస్ ల్లో తిరిగే అవకాశం ఉంది. అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని లేదు అనుకునే వాళ్లకు మాత్రమే ఉపయోగం. వెంటనే వెళ్లి రావాలంటే ఆటోల్లో వెళ్లాల్సిందే అని ఆమె అన్నారు.
మరో మహిళ గొర్రెపాటి అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అన్నారే కాని ఇంతవరకు అమలు చేయలేదు. ఆగస్టు 15 నుంచి అంటున్నారు. అందులోనూ జిల్లా వరకే పరిమితం అంటున్నారు. అంటే విజయవాడ వాళ్లు గుంటూరు వెళ్లాలన్నా, ఏలూరు వెళ్లాలన్నా టిక్కట్లు తీసుకోవాల్సిందే, ఇదేనా ఉచిత ప్రయాణం అంటే అని ప్రశ్నించారు.