
చంద్రగిరి వద్ద టిప్పర్ ను ఢీకొట్టిన శ్రీకాళహస్తి డిపో అద్దె బస్సు
ఆర్టీసీ బస్సుల్లో సింగిల్ డ్రైవర్.. కునికిపాటు తెచ్చిన ప్రమాదం..
చంద్రగిరి వద్ద లారీని బస్సు ఢీకొనడంతో 30 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సును ఒకే డ్రైవర్ వందల కిలోమీటర్లు నడపడం అనేది ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడినట్టు కనిపిస్తోంది. తాజాగా శనివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద గ్రానైట్ టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సులకు కూడా ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ఆర్టీసీ తిరుపతి ఆర్ఎం జగదీష్ చెప్పారు. సంఘటన వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిలోని చంద్రగిరి మండలం అగరాల పంచాయతీ వద్ద శనివారం తెల్లవారుజామున ప్రయాణిస్తోంది. మరో రెండు గంటలు ప్రయాణం చేస్తే, తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి చేరుకునేవారు. ప్రయాణికులు కూడా గమ్యస్థానంలో దిగి, వారిలో కొందరు ఇళ్లకు వెళితే, చాలా మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారు. కానీ,
కనురెప్ప పాటులో..
బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి రోడ్డు మార్గంలో చేరాలంటే దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించాలి. 48 ప్రయాణికులు ఉన్న బస్సు నడుపుతున్న డ్రైవర్ చంద్రగిరి సమీపానికి రాగానే అలసిపోయారో? లేక బస్సు కంట్రోల్ కాలేదో తేలియదు. కునికిపాటు వల్ల ఎదురుగా గ్రానైట్ లోడుతో వెళుతున్న టిప్పర్ ను ఢీకొట్టాడని చెబుతున్నారు. వేకువజాము కావడం వల్ల నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపలే, టిప్పర్ ను బస్సు ఢీకొన్న ధాటికి ఒకరిపై మరొకరు పడడం, ఎదురుగా ఉన్న సీట్ల బలంగా గుద్దుకోవడంతో దాదాపు 30 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది. సమాచారం అందిన వెంటనే చంద్రగిరి పోలీసులు రంగప్రవేశం చేశారు. ట్రాఫిక్ స్తంభించకుండా క్లియర్ చేయడంతో పాటు గాయపడిని ఐదుగురిని తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ జగదీష్ మాట్లాడారు.
"శ్రీకాళహస్తికి చెందిన ఆర్టీసీ బస్సు చంద్రగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 30 వరకు వరకు స్వల్పంగా గాయపడ్డారు" అని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రగాయాలు, మరణాలు లేవని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు కండక్లర్ టీవీ. రత్నం చెయ్యి విరిగిందన్నారు.
"ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎక్కువగా గాయపడిన కండక్టర్ రత్నంను మెరుగైన చికిత్స కోసం నారాయణాద్రి ఆస్పత్రికి తరలించాం" అని ఆర్ఎం జగదీష్ వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంత ప్రయాణికి కూడా సింగిల్ డ్రైవర్లను పంపిస్తున్నారు. ఉదాహరణకు తిరుపతి నుంచి బెంగళూరుకు 260 కిలోమీటర్లకు పైగానే డ్రైవర్ బస్సు నడపాలి. తిరుపతి నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల దూరం నడపడానికి కూడా సింగిల్ డ్రైవరే దిక్కు. మరో 100 కిలోమీటర్ల దూరంలోని కర్నూలు వరకు కూడా డ్రైవర్ల పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ విషయంపై తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం జగదీష్ స్పందించారు.
"దూర ప్రాంతాలకు నడిచే అద్దె బస్సుల్లో కూడా ఇద్దరుడ్రైవర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం ద్వారా ప్రమాద రహిత ప్రయాణానికి చర్యలు తీసుకుంటా" అని ఆర్ఎం జగదీష్ స్పష్టం చేశారు.
Next Story