రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసు   సీఐడీ ఎంట్రీతో ఏమి జరగబోతోంది?
x

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసు సీఐడీ ఎంట్రీతో ఏమి జరగబోతోంది?

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో మాజీ మంత్రి శిబిరంలో కలవరం బయలుదేరిందా? నిషేధిత భూముల ఫ్రీహోల్డ్ లో తమ సంతకాలు ఫోర్జరీ చేశారని కొందరు కొత్తరాగం ఆలపించారని సమాచారం.


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధమైన ఘటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పటిస్తూ, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కేసు ఫైళ్లు రెండు రోజుల్లో సీఐడీ చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఆ తరువాత అసలు కథ ఇక ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడం ద్వారా అసలు నిందితులను తెరముందుకు తీసుకుని వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈయన మద్దతుదారులపై కేసులు నమోదయ్యాయి. ఇంకొందరు అజ్నాతంలోకి వెళ్లారని చెబుతున్నారు.

ఇదిలావుండగా, మదనపల్లె రెవెన్యూ డివిజన్ లోని తహసీల్దార్లు కొందరు కొత్తపల్లవి అందుకున్నట్లు సమాచారం. నిషేధిత భూములను ఫ్రీహోల్డ్ చేయడంలో తమ సంతకాలు ఫోర్జరీ చేశారనే వాదన వినిపిస్తున్నట్లు తెలిసింది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి రికార్డులు వెళ్లకుండానే సబ్ కలెక్టరేట్లో దస్త్రాలు సిద్ధం చేశారని చెప్నారని, ఇది ఎలా సాధ్యం అనే ధర్మసందేహాలకు కూడా ఆస్కారం కల్పించారు.


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21వ తేదీ రెవెన్యూ రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమాచారం అందిన వెంటనే సీఎం ఎన్. చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర అయ్యన్నార్ ను మదనపల్లెకు పంపారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా కూడా మదనపల్లెలో మకాం వేసి, ప్రాధమిక సమాచారం సేకరించారు. ఇందులో 22ఏ రికార్డులతో పాటు, జమిందారీ అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు, నిషేధిత భూములను ఫ్రీహోల్డ్ చేసిన రికార్డులు ధగ్ధమయ్యాయి. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ ద్వారా వందలాది మంది వినితిపత్రాలు సమర్పించడం ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.


ఈ ఘటన జరిగిన నాడు ఉన్న ఆర్డీఓ హరిప్రసాద్, అంతకుముందు ఆర్డీఓ మురళీ, రికార్డుల దగ్ధమైన సెక్షన్ సూపరింటెండెంట్ గౌతం తేజాను సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదనే కారణంపై మదనపల్లె సీఐ వలిబసును వీఆర్ కు పంపడంతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

తొమ్మిది కేసులు నమోదు
మదనపల్లె రికార్డుల దగ్ధం కేసు సీఐడీకి అప్పగించాలనే నిర్ణయంతో మదనపల్లి, పుంగనూరు ప్రాంతాల్లో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిబిరంలో కలవరం చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఘటనపై ఆర్డీఓగా ఉన్న హరికృష్ణ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అంతకుముందు ఉన్న ఆర్డీఓ మురళిని కూడా విచారణ చేశారు. వారిద్దరు కార్యాలయ సూపరింటెండెంట్ గౌతం తేజ పేరును ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. మొదటి నుంచి ఆయనపై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా..

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడు భాస్కరరెడ్డి భార్య పేరిట కూడా మదనపల్లె, పుంగనూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. "ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినవి" అని పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి కోటరీలో టెన్షన్
అసైన్డ్ భూములు కొనుగోలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో "వైఎస్ఆర్ సీపీ నేతలు కొందరు కీలకంగా వ్యవహరించారు" అని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియాకు వినతుల రూపంలో బాధితులు ఫిర్యాదులు చేశారు. అంతకుముందే, కొందరు నేతలను పోలీసులువిచారణకు పిలిపించారు. ఆ కోవలో కౌన్సిలర్ జింకా చలపతితో పాటు, మాజీ ఎంఎల్ఏ నవాజ్ బాషాపై కూడా కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట మాజీ ఎమ్మెల్యేను విచారణకు రావాలని నోటీసు కూడా జారీ చేశారని తెలుస్తోంది. మిల్లు మాధవరెడ్డితో పాటు ఆయన సోదరుడిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకొందరిని కూడా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసును సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేతల్లో అలజడి చెలరేగింది. ఇప్పటికే విచారణకు హాజరైన వారిలో కొందరిపై కేసులు నమోదు కావడంపై కలవరం చెందుతున్నారు. సంబంధం లేని కేసుల్లో నిందితులుగా చేరుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఐడీ చేపట్టే విచారణ ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రాగలని భావిస్తున్నారు. అందుకు వీలుగా వైఎస్ఆర్ సీపీ నేతలను లోతుగా విచారణ సాగించడానికి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఎప్పడు పిలుపు వస్తుందో? ఎవరికి నోటీసులు జారీ చేస్తారో? అనే ఆందోళనలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణకు రంగంలోకి దిగే సీఐడీ విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయనేది వేచిచూడాలి.
Read More
Next Story