7వ మైలు.. ఎందుకంత ప్రమాదం..
ఆ ప్రదేశంలో జరిగిన హత్య ఏమని పాఠం నేర్పింది. ఇంకా ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. తిరుమల కాలిబాటలో 7వ మైలు అంటే ఎందుకు ఉలికిపడతారు?!
అలిపిరి నుంచి తిరుమల కాలిబాటలోని ఏడో మైలు అనేక పాఠాలు నేర్పుతోంది. అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తోంది. దట్టమైన అడవిలో వన్యమృగాలు సంచరించే ఆ ప్రదేశం గుర్తు రాగానే ఎందుకంత ఉలిక్కి పడతారు? చరిత్ర మిగిల్చిన చేదు అనుభవాలు కొన్ని. బాధ్యతాయుత అధికారుల వల్ల యాత్రికులకు ఎలాంటి మంచి జరిగింది. తిరుమలకు నడిచి వెళ్లే అధికారులు పరిస్థితిని అర్థం చేసుకుంటే, మరింత మంచి జరుగుతుంది.
ఒకరోజు
అది 1979 సంవత్సరం. దట్టమైన అడవి. కాలిబాటలో ఓ మహిళ హత్య జరిగింది. ఈ సంఘటన తిరుపతి, తిరుమలలో కలకలం రేపింది. యాత్రికులకు భద్రత లేదనే విషయాన్ని గుర్తు చేసింది. వారికి ధైర్యం కల్పించాలనే పాఠం నేర్పింది.
కొంచెం వెనక్కి వెళదాం...
తిరుమల కొండలకు వెళ్లే దారిలో నడకమార్గం, రోడ్డు కలిసే ప్రదేశంలో ఓ మహిళ హత్యకు గురైంది. అంతకుముందే అంటే 1978లో పీవీఆర్కే ప్రసాద్ టీటీడీ ఈవోగా ఉన్నారు. హత్య సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరీశీలించారు. అంచనా వేశారు.
"దట్టమైన అడవిలోదీపాలు లేని ఆ ప్రదేశం చీకటిలో ఉంటుంది. అదే ఓ మహిళ హత్యకు ఆస్కారం కల్పించింది. పవిత్ర కొండలపై హత్యతో నేను రాజీ పడలేకపోయాను. ఈ ఘోరమైన నేరం కొండలపైకి నడిచేటప్పుడు యాత్రికులు ఎదుర్కొనే సమస్యలపై నాకు ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. నేను ఈఓగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే, సాధారణ యాత్రికుడిలా భిన్నమైన ఆలోచనతో నడిచాను" అని పీవీఆర్కే తన రాసిన పుస్తకంలో ప్రస్తావించారు.
టీటీడీ ఈవో. జేఈవో, సీవీఎస్ఓగా నియమితులయ్యే అధికారులు తిరుమలకు కాలిబాటన వెళ్తారు. అది ఓ మొక్కుగా భావించడం కాదు.
"నడక దారిలో సామాన్య యాత్రికులు ఎదుర్కొనే కష్టాలను, సమస్యలను గుర్తించడానికి దృష్టి సారించాలి" అనే బాధ్యతను పీవీఆర్ కే. ప్రసాద్ పరిపాలన తీరు ఓ పాఠం నేర్పుతుంది.
అందులో భాగంగానే టీటీడీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ నడకమార్గంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో పాటు దారిలో రక్షణ అవసరం అని విషయాన్ని గుర్తించారు. ఏమి చేయాలని తీవ్ర అంతర్మధనానికి గురయ్యారు. ఆ ఆలోచనలతోనే..
ఒకరోజు ఆయన రాజమండ్రికి వెళుతుండగా, పెద్దాపురం వద్ద రహదారి మధ్యంలో ప్రతిష్టించిన ఆంజనేయ విగ్రహం ఆకర్షించింది. ఆ విగ్రహం శిల్పి వివరాలు తెలుసుకున్న ఆయన మారుమూల గ్రామానికి వెళ్లి, విగ్రహ శిల్పి లక్ష్మణాచారిని సంప్రదించారు. అంతకంటే పెద్ద విగ్రహాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో ఏర్పాటు చేయించడానికి శ్రద్ధ తీసుకున్నారు. లక్ష్మణాచారికి అవసరమైన సదుపాయల కల్పన బాధ్యతలు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైఖాసనచారి, అసిస్టెంట్ ఇంజినీర్ బెల్లం వెంకట్రామయ్యకు అప్పగించారు. అనుకున్న పనిపూర్తయింది.
అయినా తెలియని వేదన
ఆ తరువాత కూడా.. తిరుమలకు నడిచివెళ్లే సమయంలో ఏడవ మైలు వద్ద మహిళ హత్య గుర్తుకు రాగానే పీవీఆర్కే ప్రసాద్ మనసును కలిచివేస్తూనే ఉంది. "అక్కడ కాసేపు ఆగి శ్రీవారిని తలుచుకుంటే ఉంటే, తనకు తెలియని ధైర్యం, ఆనందం కలిగింది" అని ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు.
తిరుమల మొదటిఘాట్ లో ఏడవ మైలు వద్ద నడకదారి, రోడ్డు కలిసే ప్రదేశంలో కూడా ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయించాలనే ఆలోచన మదిలో మెదలగానే, ఆయన పండితులతో సంప్రదించారు. "మాతంగిముని ఆదేశాలతో అంజనాదేవి 12 ఏళ్లు తపస్సు చేశారు. ఆ తరువాత కలిగిన సంతానమే ఆంజనేయుడు. అందుకే ఇది అంజనాద్రిగా కూడా ప్రసిద్ధి కదా" అనే పండితుల మాటలతో సంతృప్తి చెందిన పీవీఆర్కే ప్రసాద్ ఏడో మైలు వద్ద భారీ భద్రాంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా పెద్దపురానికి చెందిన లక్షణాచారికి అప్పగించారు.
ఏడోమైలు వద్ద "1980లో విగ్రహం పూర్తి చేశాక నాకు మనస్సాంతి లభించింది" అనేది పీవీఆర్కే ప్రసాద్ అంతరంగం. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు కదా!
దట్టమైన అటవీప్రాంతంలో దైవచింతన, అది కూడా స్థైర్యం, బలానికి ప్రతిరూపమైన ఆంజనేయుడి విగ్రహం వల్ల యాత్రికులకు తెలియని శక్తి లభిస్తుందనేది ఆయన భావన. అది వాస్తవమని కూడా చెబుతున్నారు. అయినా,
ఆగని ప్రమాద ఘంటికలు
ఏడో మైలు వద్ద కూడా దట్టమైన అటవీప్రాంతం. నిత్యం జన సంచారం ఉంటుంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ముప్పు మరో రూపంలో ఎదురవుతోంది. ఎలాగంటే..
కొన్ని అవాంఛనీయ కలాపాలతో శేషాచలం అటవీప్రాంతంలో కలకలం చెలరేగుతోంది. విలువైన ఎర్రచందనం చెట్లకు నిలయమైన ఈ ప్రదేశంలో సెలయేర్ల వద్ద స్మగ్లర్లకు ఆవాసమైంది. దీంతో గత్యంతరం లేని స్థితిలో వన్యప్రాణులు రోడ్డుపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్ల సంచారానికి కొదవలేదు. దుప్పి, జింకలు, నెమళ్ల సంచారం కూడా కనువిందు చేస్తుంటాయి. వాటిలో చిరుతల దాడులతో బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ప్రాణాలు కూడా బలితీసుకున్నాయి.
2023 జూన్ 21: కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఓ కుటుంబం తిరుమలకు అలిపిరి నుంచి కాలిబాటలో సాయంత్రం బయలుదేరింది. ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం చెంత దుకాణాల వద్ద సేదదీరుతున్నారు. తాతతో కలసి దుకాణం వద్ద తినుబండారాలు కొనుక్కుంటుండగా అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి కౌశిక్ (3)ను నోట కరుకుచుకుని పారిపోయింది. భద్రతా సిబ్బంది, బాలుడి తల్లిదండ్రులు వెంబడించారు. ఈ అరుపులకు భయపడిన ఆ బాలుడిని ఏడో మైలు కంట్రోల్ రూం వద్ద బాలుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. గాలింపులో మూలుగులు విని, బాలుడిని రక్షించి, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీంతో యాత్రికులు నడకమార్గంలో గుంపులుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు.
ఆ తరువాత అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, చిరుతల సంచారంపై నిఘా పెట్టారు. నెల వ్యవధిలో ఐదు చిరుతలను బంధించి, తిరుపతి జూపార్కుకు తరలించారు. ఆ తరువాత వాటిని నల్లమల అటవీప్రాంతంలో వదిలారు.
2023 ఆగష్టు 12: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన కుటుంబం అలిపిరి మార్గంలో శుక్రవారం రాత్రి ఎనిమిదికి తిరుమలకు బయలుదేరింది. 11 గంటలకు శ్రీలక్షీ నరసింహస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంది. వారిందరికి కాస్త ముందు బాలిక లక్షిత (6) నడుచుకుంటూ వెళుతోంది. పొదల్లో నుంచి దూసుకుని వచ్చిన చిరుత ఆ బాలికను లాక్కుని వెళ్లిపోయింది. కళ్లముందే జరిగిన సంఘటనతో బాలిక తల్లిదండ్రులు కేకలు వేసి, వెంటాడినా ప్రయోజనం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా గాలించినా, ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం ఉదయం లక్ష్మీనరసింహ ఆలయానికి సమీపంలో శవమై కనపించింది. గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా చిరుత ఆ బాలిక దేహాన్ని ఛిద్రం చేసేసింది.
ఈ రెండు ఘటనల నేపథ్యంలో అలిపిరి నుంచి మోకాటిపర్వతం వరకు పటిష్ట రక్షణ చర్యలు తీసుకున్నారు. అయినా వన్యప్రాణుల సంచారం ఇంకాస్త పెరిగింది.
కారణం ఏమిటి?
అడవిలో అలజడి ఎక్కువగా ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడికి టాస్క్ ఫోర్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా, స్మగ్లర్లు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలోనే తిరుమలలో కూడా వాహనాలతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అలజడి నేపధ్యంలో నీరు, ఆహారం దొరకని స్థితిలో వన్యప్రాణులు ఎక్కువగా రోడ్డుపైకి వస్తున్నాయి. ఏడోమైలు ప్రాంతానికి సమీపంతో పాటు అవ్వాచారికోన దాటిన తరువాత వచ్చే ఆర్చి వద్ద ఏనుగుల మందలు ఎక్కువగా రోడ్డుపైకి చేరుతున్నాయి. చిరుతల సంచారం ఇక చెప్పడానికి వీలుకాదు. ట్రాప్ కెమెరాల్లో కనిపించే దృశ్యాల ద్వారా అటవీశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
మళ్లీ ఆంక్షలు
తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి రాత్రి తొమ్మది వరకే బైక్ లు అనుమతిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా..
"వన్యమృగాలకు ఇది జతకలిసే (బ్రీడింగ్ టైం) సమయం" అని తిరుపతి అటవీశాఖ సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ కు చెప్పారు. "యాత్రికులకు కూడా ఇబ్బంది లేకుండా 20 మంది సభ్యులు కలిగిన రెండు బృందాలు పగలు, రాత్రి వేర్వేరుగా పట్రోలింగ్ నిర్వహిస్తున్నాం" అని కూడా తెలిపారు. "యాత్రికులు కూడా అలసత్వం పాటించకుండా, అటవీశాఖ, టీటీడీ చెప్పే సూచనలు పాటించాలి" అని ఆయన సూచించారు.
"నడకమార్గంలో రూఫ్ కింద ఇరుపక్కలా ఇనుపకంచె ఏర్పాటు చేయాలి" అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గత నెలలో సూచించారు. నడకమార్గంలో వెళ్లిన ఆమె పరిస్థితులను కూడా అంచనా వేశారు. ఆ మేరకు యాత్రికుల రక్షణ చర్యలపై కూడా సూచనలు చేశారు.
దీంతో ఏడో మైలు వద్ద ఉన్న భద్రాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో కాలిబాట రోడ్డు కింద నుంచి సాగుతుంది. అక్కడ మాత్రమే ఇరుపక్కల కంచె ఏర్పాటు చేశారు.
ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సులకు తోడు కార్లు, జీపుల రోద ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రైవేటు టాక్సీల రాకపోకలు మితిమీరుతున్నాయి.. ఈ వాహనాల రాకపోకల అలజడికి కూడా వన్యమృగాలు ప్రమాదాలకు గురికావడం తో పాటు వాటి ఉనికికి ముప్పు ఏర్పడింది. గతంలో మాదిరి ప్రైవేటు వాహనాల రోజుకు ఒకటి, రెండుసార్లు మాత్రమే అనుమతించే చర్యలు తీసుకుంటే, ఆర్టీసీ ఆదాయం పెరగడంతో పాటు వాహనాల రోద కూడా తగ్గుతుంది. ఇది కాలినడక యాత్రికులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది.
"ఘాట్ రోడ్డులో వాహనాల నియంత్రిణకు చర్యలు తీసుకుంటున్నాం" అని తిరుపతి ఆర్టీఓ గంగారపు ఆదినారాయణ చెబుతున్నారు. దీని ఫలితాలు ఎలా ఉండబోతాయనేది వేచిచూడాలి.
Next Story