బీహార్ లో శ్రీవారి దర్శనం.. త్వరలో టీటీడీ ఎంఓయూ..
x

బీహార్ లో శ్రీవారి దర్శనం.. త్వరలో టీటీడీ ఎంఓయూ..

పాట్నాలో ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయింపు.


టీటీడీకి లేఖ రాసిన బీహార్ చీఫ్ సెక్రటరీ. పాట్నా నుంచి 38 గంటల ప్రయాణ భారం తగ్గించే యత్నం.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని టీటీడీ పాలక మండలి మరింత విస్తృతం చేసే విధంగా సాగుతోంది. పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పదెకరాలు కూడా కేటాయించడానికి టీటీడీకి లేఖ రాసింది.
పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం ద్వారా దర్శనం, సేవలు అక్కడ కూడా అందుబాటులోకి తీసుకుని రావడానికి అవకాశం ఏర్పడుతుంది. యాత్రికులకు రైలుమార్గంలో 38 గంటల ప్రయాణ భారం తప్పుతుంది. వృద్దులు, పిల్లలకు సమస్య లేకుండా వారి ప్రాంతంలోని స్వామిదర్శనం కల్పించడానికి వెసులుబాటు లభిస్తుందని టీటీడీ అధికారవర్గాలు చెబుతున్నాయి.
స్థలం కేటాయింపు
పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆలయ నిర్మాణానికి 10.11 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. 99 సంవత్సరాలకు ఒక రూపాయి అద్దెతో టోకన్ లీజుకు ఇవ్వడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. టీటీడీతో ఎంఓయు (Memorandum of Understanding MoU) చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నియమించింది.
బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంగీకరించడంపై టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
బీహార్ సీఎస్ లేఖ..
బీహార్ రాజధాని పాట్నా నగరం మోకామాఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. ఆ స్థలంలో టిటిడి ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బీహార్ చీఫ్ సెక్రటరీ ప్రతయ అమృత్ తెలిపారు.
"పాట్నా మోకా ఖామోస్ ప్రాంతంలో 10.11 ఎకరాలు కేటాయిస్తున్నాం. 99 సంవత్సరాలకు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది" అని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ రాసిన లేఖలో స్పష్టం చేశారు.
పాట్నాలో కేటాయించిన స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి వీలుగా టీటీడీతో ఎంఓయు చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించినట్టు ఆ లేఖలో తెలిపారు. ఈ వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాట్లాడుతూ,
"బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అక్కడ టిటిడి ఆలయాన్ని నిర్మిస్తాం" అని నాయుడు తెలిపారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ తో టిటిడి ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు సాగిస్తారని ఆయన వెల్లడించారు. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
దూరప్రాంత రాష్ట్రాల్లో దర్శనం..
దేశంలోని కర్ణాటక, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ (గుజరాత్)లోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ ఆలయాలు ఉన్నాయి. రిషికేష్ (ఉత్తరాఖండ్) లో ఆంధ్ర ఆశ్రమం అందుబాటులో ఉంది. విశేష పర్వదినాలు జరిగే సమయాల్లో యాత్రికులు అక్కడి ఆలయాలను దర్శించుకుని, తిరుమల శ్రీవారినే స్వయంగా దర్శించుకున్నంత సంతృప్తి చెందుతారు. తిరుమలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆ ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు, అలంకరణలు, అన్నప్రసాదాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచడమే దీనికి ప్రధాన కారణం.
దూరా..భారం తగ్గించాలనే..
పొరుగు రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణం వల్ల వందల కిలోమీటర్లు ప్రయాణించే బాధ లేకుండా చేయాలనేది టీటీడీ సంకల్పం. వృద్ధులు, పిల్లలకు స్థానిక ఆలయాల వల్ల ప్రయాణ భారం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆ కోవలోనే..
బీహార్ రాజధాని పాట్నా నుంచి తిరుపతి రైలులో ప్రయాణించాలంటే రావాలంటే 36 గంటల పాటు ప్రయాణించాలి. రోడ్డు మార్గంలో 1,792.9 కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఖర్చే సుమారు 20 వేలకు పైగానే అవుతుంది. గగనతలంలో ప్రయాణించేందుకు పాట్నాలోని లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి కూడా కలెక్టివిటీ ఉంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి చేరుకునేందుకు ఇవన్నీ ఖర్చు, శ్రమతో కూడుకున్నవి కావడం వల్ల టీటీడీ ధార్మిక కార్యక్రమాలు విస్తృతం చేయడంలో పాలక మండలి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు.
Read More
Next Story