కొడుకా యాడున్నావ్ నాయనా.. ఇంటికి రా..
x
దెబ్బలు తిని పడిపోయిన దళిత యువకుడు పవన్ పక్కనే లాఠీతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి దినేష్. పవన్ తల్లి సునీత (ఫైల్)

కొడుకా యాడున్నావ్ నాయనా.. ఇంటికి రా..

వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు చేతిలో దాడికి గురైన పవన్ తల్లి వేదన. వీడియోలతో పోలీసుల గందరగోళం


తిరుపతి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల చేతిలో దళిత యువకుడు పవన్ చిత్రహింసలకు గురయ్యాడు. 48 గంటలు దాటినా అతని జాడ మాత్రం తెలియలేదు. ఇప్పటికీ పవన్ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల ఆధీనంలోనే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక అంశాలతో ఎన్నో కేసులు ఛేదించామని చెప్పే పోలీసులు పవన్ జాడను కనిపెట్టలేకపోయారు. ఈ పరిస్థితుల్లో..

పవన్ చిత్రహింసలకు గురైన వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. పవన్ తల్లి నీలం సునీత ఓ వీడియో విడుదల చేశారు.
"అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నా..
నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా... బాబు.
నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
నిన్ను కొట్టి ఆ వీడియోలు అన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా నాకు పంపడం వల్లే కదా పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాము.
నీకు ఎలాంటి భయము అవసరం లేదు‌.. నాన్న.
నీకు చేతులెత్తి మొక్కుతున్నా.
నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న.
ఇదీ ఆ తల్లి వేదన.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలానికి చెందిన పవన్ తిరుపతిలో ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో
"ఓ బక్కపలచని యువకుడిని మరో బలంగా ఉన్న యువకుడు పోలీసులు వాడే ఫైబర్ లాఠీతో చితకబాదుతున్నాడు. పక్కనే మరో యువకుడు కూర్చుని ఉన్నాడు"
పీలగా ఉన్న యువకుడు పవన్. అతను దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని తేలింది. ఇతనిని కొడుతున్న వ్యక్తి దినేష్. కాగా, పక్కన కూర్చొన్న యువకుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జిగానే కాకుండా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కారు డ్రైవర్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో భూమన కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. కానీ, "వైసీపీ నేతలు మాత్రం మా పార్టీకి, నేతలకు సంబంధం లేని విషయంలో అకారణంగా మా పార్టీ పేరు, నాయకులను అప్రతిష్టకు గురి చేస్తున్నారు" అని తిరుపతి ఈస్టు డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే..
వీడియోలతో గందరగోళం
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల చేతిలో చిత్రహింసలు అనుభవించిన పవన్ ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలోని ఆయన మాటలు పోలీసులనే కాదు. కుటుంబీకులు, నిరసనకు దిగిన దళిత సంఘ నేతలను కూడా డోలాయమానంలో పడేశాయి.
"దినేష్ అన్న (పవన్ ను లాఠీతో కొట్టిన వ్యక్తి)కి ఆ హక్కు ఉంది. నేనే బాగానే ఉన్నాను. ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవద్దు. పోలీసుల ముందుకు నేనే వస్తాను. అన్నీ వివరిస్తా" అని దాడి చేసిన వారి తప్పు ఏమి లేదనే విధంగా పవన్ సందేశంతో కూడిన వీడియో విడుదల అయింది.
ఆ వీడియోను పరిశీలించండి. పవన్ కళ్లలో బెరుకు, మాటల్లో తడబాటు ఎలా ఉందనేది అర్థం అవుతుంది.

అంటే, దాడి చేసిన వారే పవన్ ను అదుపులో ఉంచుకుని ఇలా మాట్లాడించారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏమి జరిగింది?
వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి తిరుపతిలోని శ్రీనివాసం ముందు ఎస్విపి బైక్ రైడర్స్ అండ్ రెంటల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మరవ పల్లికి చెందిన పవన్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి వద్ద ఓ బైక్ అద్దెకు తీసుకొని డబ్బు చెల్లించలేదు అనేది సమాచారం.
అనిల్ కుమార్ రెడ్డికి సన్నిహితుడైన జగదీశ్వర్ రెడ్డి అలియాస్ జగ్గా వద్ద కూడా పవన్ మరో వాహనం తీసుకున్నాడు. దీనికి సంబంధించి డబ్బులు చెల్లించకపోవడంతో వారిద్దరూ పవన్ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. పవన్ కుమార్ బుధవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు తెలుసుకున్న జగదీశ్వర్ రెడ్డి అతని స్నేహితుడు అజయ్ కుమార్ అక్కడికి వెళ్లి బైక్ స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
ఆ తర్వాత ఈ వాహనాలను వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డికి అప్పగించారు. పవన్ తన కార్యాలయానికి తీసుకువచ్చిన అజయ్ కుమార్ పాకాల కు చెందిన దినేష్ తో పోలీసు లాటితో కొట్టించినట్లు ఆరోపణలు వినిపించడమే కాదు వీడియో కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. పక్కనే ఉన్న అనిల్ కుమార్ కూడా కొట్టమని ప్రోత్సహించినట్లు వీడియో రికార్డు అయింది.
ఆ తర్వాత..
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, చిత్రహింసలకు గురైన పవన్ తల్లిదండ్రులకు కూడా వీడియో పంపించారు.
"మీ కొడుకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి. సాయంత్రం లోపల డబ్బు కట్టకుంటే, కిడ్నీలు తీసి అమ్మేసి శవాన్ని ఇంటికి పంపిస్తాం" అని బెదిరించారని పవన్ తల్లి నీలం సునీత ఆరోపించింది.
ఈ పరిణామాలు ఇలా ఉంటే,
చిత్రహింసలకు గురైన పవన్ వీడియో సందేహాలకు తెరతీసింది. ఈ వ్యవహారంలో అనిల్ కుమారరెడ్డిది ప్రేక్షక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు.
"పరారీలో ఉన్న అసలు నిందితుడిగా భావిస్తున్న దినేష్ దొరికితే కేసు మిస్టరీ వీడుతుంది" అని ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం చెబుతున్నారు.
తిరుపతిలో జరిగిన సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తో పాటు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ కూడా స్పందించారు.
"తిరుపతిలో వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన అనుచరుల అరాచకాలు పెరుగుతున్నాయి" అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story